- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం.. ఈ బంధం మరింత బలోపేతమవ్వాలి!
ఈ శిఖరాగ్ర సమావేశం లక్ష్యం.. ద్వైపాక్షిక పురోగతిని సమీక్షించడం, రక్షణ, అంతరిక్షం, ఇంధనం, వాణిజ్య సహకారంలో కొనసాగుతున్న కార్యక్రమాలను

ఈ శిఖరాగ్ర సమావేశం లక్ష్యం.. ద్వైపాక్షిక పురోగతిని సమీక్షించడం, రక్షణ, అంతరిక్షం, ఇంధనం, వాణిజ్య సహకారంలో కొనసాగుతున్న కార్యక్రమాలను అంచనా వేయడం, భవిష్యత్ నిబద్ధతలను రూపొందించడం. భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొంతమేరకు తగ్గించుకుంది. భారత్-రష్యా స్నేహానికి ఆర్థిక మూలస్తంభంగా ఉన్న ఈ కొనుగోళ్ల తగ్గింపు రష్యాపై కొంత ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది.
రష్యాకు వివిధ మార్గాల్లో చేదోడు
ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన కేవలం రక్షణ లేదా ఎనర్జీ రంగాలకే పరిమితం కాకుండా.. రష్యాకు వివిధ మార్గాల్లో చేదోడుగా నిలిచే కొత్త ఆర్థిక, వ్యూహాత్మక ఒప్పందాలను అన్వేషించేందుకు ఉపయోగపడనుంది. S-400 ట్రయంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థ డెలివరీలు, దాని భవిష్యత్తు నిర్వహణపై డీల్స్ కుదిరే అవకాశం ఉంది. AK-203 అసాల్ట్ రైఫిల్స్ తయారీకి సంబంధించిన వెంచర్లపై ఒప్పందం, అత్యాధునిక రక్షణ సాంకేతికత అభివృద్ధిలో సంయుక్త పరిశోధన, అభివృద్ధి డీల్స్ జరిగే అవకాశం ఉంది.
డాలర్‌పై ఆధారపడడం తగ్గించాలి..
చమురు, రక్షణ పరికరాల కొనుగోళ్ల విషయంలో డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం ఇరు దేశాల లక్ష్యం. దీని కోసం దేశీయ కరెన్సీలైన రూపాయి, రూబుల్ ద్వారా చెల్లింపులు జరిపే సుస్థిర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయ చెల్లింపుల ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. భారతదేశంలో రష్యన్ సాంకేతికతతో నిర్మిస్తున్న కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ తదుపరి యూనిట్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఒప్పందాలు, గగన్‌యాన్ వంటి భారత అంతరిక్ష కార్యక్రమాలకు రష్యా సహకారం, సంయుక్త ఉపగ్రహ నిర్మాణ ప్రాజెక్టులపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
కొత్త రకాల డీల్స్‌కి ప్రాధాన్యత!
చమురు కొనుగోళ్లు తగ్గిన నేపథ్యంలో రష్యా భారత్ నుంచి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ప్రయోజనం పొందేందుకు కొన్ని కొత్త రకాల డీల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఆంక్షల ప్రభావం తక్కువగా ఉన్న రంగాలపై దృష్టి సారిస్తూ భారత్ నుంచి రష్యాకు వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ (ముఖ్యంగా జెనరిక్ మందులు), ఐటీ సేవలను పెద్ద ఎత్తున ఎగుమతి చేసుకునేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. రష్యా ఈ రంగాల్లో భారత్‌ను సుస్థిర సరఫరాదారుగా గుర్తించడానికి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
నార్త్-సౌత్ ట్రాన్స్‌ఫోర్ట్ కారిడార్
ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌ఫోర్ట్ కారిడార్ కార్యక లాపాలను వేగవంతం చేయడంపై ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ముంబైని రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌తో కలుపుతూ ఇరాన్ మీదుగా సాగే ఈ కారిడార్ పశ్చిమ దేశాల ద్వారా కాకుండా, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాన్ని అందిస్తుంది. ఇది రష్యా తన వస్తువులను ఇతర దేశాలకు తరలించడానికి కీలక వ్యూహాత్మక ప్రత్యామ్నాయం అవుతుంది. రష్యా తన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) అమ్మకాలను భారత్‌లో పెంచేందుకు ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా ఆర్కిటిక్ ప్రాంతంలోని ఇంధన ప్రాజెక్టుల్లో భారత పెట్టుబడులు పెంచేందుకు ఒప్పందాలు కుదరవచ్చు.. ఇలా ఇరు దేశాల మధ్య వివిధ వ్యాపార, దౌత్య, రక్షణ ఒప్పందాలతో ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
- వి.సుధాకర్,
81067 95544






