పశ్చిమ ఆసియా యుద్ధం పాఠం.. భారత్ మాన్యుఫ్యాక్చరింగ్ వైపు మళ్లాల్సిన సమయం!

by Ravi |   (  Updated:2026-03-22 01:00:30  IST  )

పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో భారత్ ఆర్థిక విధానాల్లో మార్పులు అవసరమా? చైనా మాన్యుఫ్యాక్చరింగ్ ఆధిపత్యం, సెమీ కండక్టర్ రంగంలో వెనుకబాటు, భవిష్యత్తు కోసం భారత్ తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలు తీసుకోవాలి.

పశ్చిమ ఆసియా యుద్ధం పాఠం.. భారత్ మాన్యుఫ్యాక్చరింగ్ వైపు మళ్లాల్సిన సమయం!
X

పశ్చిమ ఆసియాలో నేడు జరుగుతున్న యుద్ధం చూశాక.. దీని నుండి మన దేశం చాలా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ముఖ్యంగా రాబోతున్న సవాళ్లకు తగ్గట్టు ITతో పాటు మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్‌కు వీలైనంత త్వరగా షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. అందుకు అత్యంత ఖచ్చితమైన పాలసి మేకింగ్, ముందు చూపుతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది!

అందరూ ఈ ఆయిల్.. గ్యాస్.. సమస్యలకే పరిమితమై మాట్లాడుతున్నారు కానీ.. అంతకు మించి మన పక్కనే ఉన్న మన చిరకాల ప్రత్యర్థిగా బావిస్తున్న చైనా మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్‌తో పాటు.. సాఫ్ట్‌వేర్‌కు ప్రత్యామ్నాయంగా సెల్ ఫోన్ విడిభాగాలు, చిప్ మ్యానిఫ్యాక్చరింగ్, నానో చిప్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ (IC), సర్క్యూట్ బోర్డ్స్ (PCB), కంప్యూటర్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సెమీ కండక్టర్స్ తయారీలో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్ డిమాండ్‌ను, అవకాశాలను అందిపుచ్చుకొని.. ఈరోజున గ్లోబల్ ప్లేయర్‌గా ఒంటిచేత్తో ప్రపంచాన్ని శాసిస్తుంటే.. మనం ఇంకా ఈ వేవ్‌ను అందిపుచ్చుకోవడంలో వెనుకబడే ఉన్నాం అని చెప్పాలి!

గ్లోబల్ మార్కెట్‌లో మనవాటా తక్కువే!

ఈ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధాన విభాగంలో మన స్థాయి ఎంటి? వాస్తవ పరిస్థితులు ఏంటి? మనకున్న సవాళ్లు ఎంటి? దీనిపై సమగ్రమైన బ్లూ ప్రింట్‌తో పాటు.. రాబోయే దశాబ్ద కాలానికి తగ్గట్టు నిర్ధిష్టమైన ప్రణాళికలతో.. స్వల్ప దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది! ఈ సెక్టార్‌లో బెంగుళూరు లాంటి చోట్ల కొంత స్టార్టప్ కంపెనీల హడావుడి కనపడుతున్నప్పటికి.. గ్లోబల్ మార్కెట్‌లో మనవాటా తక్కువే ! ఆ రోజున రాజీవ్ గాంధీ లాంటి లిబరల్ నాయకుల ముందు చూపు కారణంగా.. ఆయన పట్టుబట్టి దేశానికి తీసుకొచ్చిన ఇంటిలెక్చువల్ స్కాలర్స్.. పాలసీ మేకర్స్.. కమిటెడ్ బ్యూరోక్రాట్స్ సహాయంతో.. సరైన సమయానికి IT విప్లవాన్ని అందిపుచ్చుకొని.. సాఫ్ట్‌వేర్, టెలి కమ్యూనికే షన్ రంగాల సహాయంతో గత మూడు దశాబ్దాల నుండి నుండి దేశాన్ని కొంత అభివృద్ధి చేసుకోగలిగాం! ఇప్పుడు మరి దేశంలో పెరుగుతున్న యువతకు తగ్గట్టుగా ప్రభుత్వాలు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఎందుకు నెలకొల్పలేకపోతోంది?

చైనా ఇలా ఎదుగుతోంది!

ఈ రోజు మనందరం వాడుతున్న సెల్‌ఫోన్‌లలో ప్రీమియం బ్రాండ్స్‌తో పాటు మరో పదికి పైగా ఉన్న సెల్‌ఫోన్ బ్రాండ్స్ కలుపుకుంటే.. ప్రపంచంలో 90 శాతం సెల్ ఫోన్లు ఒక్క చైనా, తైవాన్ ఈ రెండు దేశాల నుండే వస్తున్నాయి! ఇక 20 ట్రిలియన్ డాలర్స్ జీడీపీతో మైనింగ్, సిమెంట్, కాపర్, స్టీల్ ఇండస్ట్రీతో సహా సింథటిక్ కెమికల్స్, బల్క్ డ్రగ్స్, టాయ్స్ ఇండస్ట్రీ, నిర్మాణ రంగాల్లో చైనా ప్రపంచాన్నే శాసించే దిశగా దూసుకుపోతుంటే.. చైనా అభివృద్ధి చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను చూసి అగ్రరాజ్యం అమెరికా సైతం అసూయ పడాల్సిన పరిస్థితి! నిజానికి చైనా నుండి ఒక్క పది రోజులు బల్క్ డ్రగ్ సప్లయ్ ఆగిపోతే.. మన హైద్రాబాద్‌లో 80 శాతం ఫార్మా కంపెనీలు పూర్తిగా మూత పడతాయనే సంగతి మనలో ఎంత మందికి తెలుసు? చైనా ఒక్క నెల రోజులు చిప్ ప్రొడక్షన్స్ ఆపేస్తే.. మన దేశంతో సహా అగ్రరాజ్యం అమెరికా సైతం అతలాకుతలం అవుతుందని మనలో ఎంతమందికి తెలుసు? ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన పొరుగు దేశం సూపర్ పవర్‌లా దూసుకుపోతుంది.

మన దేశ పరిస్థితులు మారాలంటే..?

మన దేశంలో మాత్రం రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల కోసం ఎలా గెలవాలనే ఆలోచనలు చేస్తుండటం బాధాకరం. మన దేశంలోని పరిస్థితులు మారాలంటే అధికారంలో ఏ రాజకీయ పార్టీ వారు ఉన్నా కూడా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం అలవర్చుకునే విధంగా విద్యా విధాన రూపకల్పన జరగాలి. భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి శాస్త్రీయ- సాంకేతిక పరిజ్ఞానం అందించాలి. ప్రభుత్వం NEP ద్వారా శాస్త్రీయ దృక్పథం, క్రిటికల్ థింకింగ్ ప్రోత్సహించాలి. అపార ఖనిజ సంపదకు నిలయ‌మైన ఈ దేశం స్థానిక వనరులతో, స్వావలంబన విధానాలతో అభివృద్ధిని సాధించాలి. అధికార రాజకీయ చర్చలకి బదులుగా ఎకనామిక్ ప్రియారిటీలు, హేతు బద్ధత మీద, మానవతా విలువల పైనా దృష్టి సారించాలి. అలాగే ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ వేవ్‌ను త్వరగా అందుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్, రూరల్ డవలప్‌మెంట్, యువతపై దృష్టి పెట్టాలి. అలాగే అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలను, వ్యవస్థలను ఉన్నత విద్యావంతులను, ఉద్యో గులుగా నియమించి ప్రభుత్వ పరిపాలనను పటిష్టం చేయడం ద్వారా జవాబుదారీ పెంచాలి.

- రమణాచారి

99898 63039

Next Story