యువత ఎక్కువ.. స్థిర ఉద్యోగాలు తక్కువ!

by Ravi |   (  Updated:2026-05-26 00:30:28  IST  )

భారతదేశంలో యువ జనాభా భారీగా ఉన్నప్పటికీ, నిరుద్యోగం, నైపుణ్యాల కొరత, అస్థిర ఉపాధి యువత భవిష్యత్తును సంక్షోభంలోకి నెడుతున్నాయి. విద్యా నాణ్యత, స్కిల్ డెవలప్‌మెంట్, ప్రభుత్వ నియామకాలపై ప్రత్యేక విశ్లేషణ.

యువత ఎక్కువ.. స్థిర ఉద్యోగాలు తక్కువ!
X

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 36.7 కోట్ల మంది యువత దేశానికి అమూల్యమైన సంపద. పని చేసే వయస్సు గల జనాభాలో యువత మూడింట ఒక వంతు ఉండటం అభి వృద్ధికి గొప్ప అవకాశం. అయితే వాస్తవ పరిస్థితుల్లో యువతలో ఎక్కువ భాగం నిరుద్యోగం, అస్థిర ఉపాధి, తక్కువ వేతనాలతో కూడిన పనుల్లో ఇరుక్కుపోయింది. ప్రస్తుతం 10.4 కోట్ల మంది యువత విద్య లేదా శిక్షణా సంస్థల్లో ఉండగా, మిగిలిన 26.4 కోట్ల మంది ఉపాధి మార్కెట్లో ఉన్నారు. వీరిలో కేవలం 6 కోట్ల మందికే భద్రత కలిగిన స్థిరమైన ఉద్యోగాలు ఉన్నాయి. మిగిలిన వారు అసంఘటిత రంగంలో లేదా స్వయం ఉపాధిపై ఆధారపడుతున్నారు. గత కొన్ని దశా బ్దాల్లో ఉన్నత విద్యాసంస్థల సంఖ్య భారీగా పెరిగినా, నాణ్యమైన విద్య అందించడం లోపి స్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం, మౌలిక వసతుల కొరత, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ లేకపోవడం వల్ల విద్యార్థులు డిగ్రీలు మాత్రమే పొందుతున్నారు. అవసరమైన నైపు ణ్యాలు సాధించలేకపోతున్నారు. ఫలితంగా పట్టభద్రుల సంఖ్య పెరుగుతున్నా, ఉద్యోగాలకు తగిన నైపుణ్యాలు కలిగిన యువత తగ్గుతోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పట్టభద్రులు ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్నప్పటికీ, చాలా మందికి స్థిరమైన ఉపాధి దొరకడం లేదు. అనేక మంది తాత్కాలిక, కాంట్రాక్టు లేదా అసంఘటిత రంగ ఉద్యోగాల్లో చేరుతున్నారు. యువశక్తిని దేశాభివృద్ధికి ఉపయోగించాలంటే విద్యా నాణ్యత పెంపు, ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, ప్రభుత్వ నియామకాల వేగవంతం వంటి చర్యలు అవసరం. యువత భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని పాలకులు గుర్తించాల్సిన సమయం ఇది.

- ఆళవందార్ వేణు మాధవ్

86860 51752

Next Story