- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యా ప్రమాణాల్లో వెనుకబాటుతనం
విద్యా ప్రమాణాల్లో వెనుకబాటుతనం... india has Backwardness in educational standards says prasadrao

విద్యా సమపార్జన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ విద్యా రంగంలో నాసిరకం ఫలితాలు ఉంటున్నాయి అనీ, ప్రైవేటు కార్పోరేట్ విద్యా రంగంలో ఉన్నత స్థాయి ప్రమాణాలు, ర్యాంకులు గ్రేడులు ఎక్కువగా వస్తుంటాయి అనీ చాలామంది అభిప్రాయం. కొన్ని సందర్భాల్లో వాస్తవం కూడా... ఉన్నత విద్యా ప్రమాణాలు సాధించాలంటే అనేక వ్యవస్థల సమ్మేళనం, సమన్వయంతో సాధ్యం అవుతుంది అని గ్రహించాలి. ముఖ్యంగా విద్య అనేది ఒక వ్యక్తి శారీరక మానసిక ఆరోగ్యం, వారి కుటుంబ నేపథ్యం, సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుంది అని గ్రహించాలి. అదే సమయంలో ప్రభుత్వ విధానాలు కూడా విద్యా రంగాన్ని ప్రభావితం చేస్తాయి.
మౌలిక వసతులెక్కడ?
ప్రతీ వ్యక్తీ ముందుగా తల్లిదండ్రులను, కుటుంబాన్ని విడిచి, మొదటి సారిగా బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టే ప్రదేశం పాఠశాల. ఇటువంటి పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం, మంచినీరు, మరుగుదొడ్లు సౌకర్యాలు, ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు ఉండాలి. ముఖ్యంగా పాఠశాల అందుబాటులో ఉండాలి. మాతృభాషలో కనీసం ప్రాథమిక విద్య అభ్యసించే పరిస్థితి ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి అన్ని వసతులు కలిగిన విద్యా వ్యవస్థ ఉందా అని ప్రశ్నించుకోవాలి. దేశ జీడీపీలో గానీ, రాష్ట్రాల ఆదాయంలో గాని ఏ మేరకు నిధులు విద్యా రంగానికి కేటాయిస్తున్నారు.. పరిశీలన చేయాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నా, అన్ని వసతులు కలిగిన ఉన్నతమైన విద్యా ప్రమాణాలు అందించే విద్యా సంస్థలు చేతివేళ్ళు మీద లెక్కించే పరిస్థితి.
కుటుంబ సమస్యల భారం
ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల విషయంలో ఎక్కువ శాతం తల్లిదండ్రులు శ్రద్ధ, బాధ్యత ఎక్కువగా కనపడుతుంది. అదే విధంగా కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితి విద్యార్థులు చదువు అభ్యసించే పరిస్థితికి అనుకూలంగా ఉండటంతో కొంతమేర విద్యా ప్రమాణాలు బాగుంటున్నాయి అనేది నిర్వివాదాంశం. దీనికి భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కుటుంబ నేపథ్యం, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు అననుకూలంగా ఉంటున్నాయి. పైగా తల్లిదండ్రుల నిరక్షరాస్యత, పేదరికం కారణంగా వీరి విద్యా ప్రమాణాలు నాసిరకంగా ఉంటున్నాయి. తరచూ అనారోగ్య సమస్యలు, పోషకాహార లోపం, వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు లోపాలు, చర్మ వ్యాధులు వెంటాడుతుండటంతో వీరు విద్యా ప్రమాణాలకు దూరంగా ఉంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య తరచూ తగాదాలు, తల్లిదండ్రులు మధ్య విభేదాలు, సామాజిక, ఆరోగ్య సమస్యలు ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని గ్రహించాలి.
బోధనకే ఉపాధ్యాయులు...
అదే సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై బోధనేతర పనులు, సరియైన సమయంలో పాఠ్య పుస్తకాలు సరఫరా చేయకపోవడం, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ, మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి అనేక లోపాల వల్ల, ప్రభుత్వ విద్యా రంగంలో చదివే విద్యార్థుల ఫలితాలు, ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయి. ముఖ్యంగా విద్యా రంగానికి ప్రభుత్వ కేటాయింపులు అరకొరగా ఉంటున్నాయి. ఇళ్లలో చిన్న పిల్లల సంరక్షణ, కుటుంబ సంబంధ బాధ్యతలు విద్యార్థులపై పడుతున్నాయి. ఉపాధి కోసం తల్లిదండ్రులు వలసలు వెళ్ళటంతో వీరి పిల్లలు పాఠశాల అభ్యసనా పనిదినాలు కోల్పోతున్నారు. దీంతో వీరు తగినన్ని అభ్యసనా సామర్థ్యాలు సాధించలేకపోతున్నారు. ప్రభుత్వ విద్యార్థులను వెంటాడుతున్న వాస్తవాలు పరిగణనలోకి తీసుకుని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. తగిన నిధులు, సౌకర్యాలు, ఆరోగ్య పరీక్షలు సమకూర్చాలి. ముఖ్యంగా సకాలంలో పుస్తకాలు సరఫరా చేయాలి. ఉపాధ్యాయులను భోధనకే పరిమితం చేయాలి. తరగతి గదుల నిర్మాణ గోడలకు రంగులు వేయడం మంచిదే కానీ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉంటేనే నాణ్యమైన విద్య అందరికీ అందుతుంది అని గ్రహించాలి.
భారత రాజ్యాంగం ప్రకారం ప్రతీ ఒక్కరికీ ఉచిత నిర్బంధ విద్య అందించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయాలి. అందరికీ సమానమైన విద్య అందించాలి. మనదేశంలో కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు పాటిస్తున్న విధానాలు అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా కూడా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ముందడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఉపాధ్యాయులు కూడా అంకిత భావంతో పనిచేయాలి. ఉన్నత విద్య అభ్యసించిన వారిలో కూడా నైపుణ్యాలు లేని స్థితిలో ఉండటం గమనార్హం. ప్రపంచ వంద ఉత్తమ విద్యాలయాల్లో ఒక్క విశ్వవిద్యాలయం కూడా మన దేశం నుంచి లేకపోవడం బాధాకరం. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులు , తరగతి గదులు, సౌకర్యాలు ఉన్నప్పుడు మాత్రమే ఆశించిన విద్యా ప్రమాణాలు ప్రభుత్వ విద్యారంగంలో వస్తాయి అని గ్రహించాలి...
ఐ. ప్రసాదరావు
6305682733






