బీమారు రాష్ట్రాలను ఎన్నేండ్లు పోషించాలి?

by Ravi |   (  Updated:2026-04-29 01:15:24  IST  )

భారతదేశంలో డీలిమిటేషన్ విధానం దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రతినిధిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది? ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే అభివృద్ధి, ఆదాయ పంపిణీ, జనాభా నియంత్రణ నేపథ్యంలో ఉద్భవిస్తున్న అసమానతలపై విశ్లేషణ.

బీమారు రాష్ట్రాలను ఎన్నేండ్లు పోషించాలి?
X

ఏ దేశ సమగ్రతకైనా రాష్ట్రాల సాధికారత ముఖ్యం. కేంద్రం కింద రాష్ట్రాలు నలిగి పోకూడదు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఒక రకమైన విధానాలు ఇతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో వేరే రకమైన విధానాలు వలన దేశ సమైక్యత సమగ్రత దెబ్బతింటుంది. భారతదేశ సమాఖ్య వ్యవస్థలో అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కేంద్ర ప్రభుత్వం కల్పించాలి. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పార్లమెంటరీ స్థానాలను, అసెంబ్లీ స్థానాలను, నిర్ణయిస్తూ డీలిమిటేషన్ చేపట్టడం చూస్తున్నాం.

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే లోక్‌సభ సీట్లు 850కి పెరుగుతాయని ఒక అంచనా అందులో దక్షిణాది రాష్ట్రాలకు 66 సీట్లు మాత్రమే పెరిగే అవకాశం ఉండగా, ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ (బీమారి రాష్ట్రాలు), గుజరాత్ ఈ ఐదు రాష్ట్రాలకు గాను 101 లోక్‌సభ సీట్లు పెరుగుతాయి.. ఈ ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభ సీట్లు 77% పెరగగా దక్షిణాది రాష్ట్రాలకు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక) 33 శాతం మాత్రమే పెరుగు‌తాయి. అయితే దక్షిణాది రాష్ట్రాలకు గత లోక్‌సభలో 543 సీట్లలో 25 శాతం ఉండగా నేడు అది 20 శాతానికి పడిపోతున్నది. అదే ఉత్తరాది రాష్ట్రాల సభ్యుల శాతం గతంలో 38 శాతం కాగా నేడు అది 43 శాతానికి పెరుగుచున్నది.

జనాభా నియంత్రణే శాపమైతే..!

ఇలా డీలిమిటేషన్ వలన ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సభ్యుల సంఖ్య పెరిగిపోయి దక్షిణాది రాష్ట్రాలపై వారి ఆధిపత్యం ఉంటుందని ఇది దేశ సమైక్యతకు సమగ్రతకు దెబ్బతీస్తుందని నిపుణుల అభిప్రాయం. ఉత్తరాది రాష్ట్రాలు దేశ పరిపాలన విధానాలలో ఆధిపత్యం వహిస్తాయి. పెరుగు‌తున్న జనాభాకి కావలసిన వసతులు కల్పించలేమని 1970 లో జనాభా పెరుగుదలను గణనీయంగా దక్షిణాది రాష్ట్రాలు తగ్గించుకుంటే అదే నేడు దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారింది. దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు పాలనాపరమైన విషయాలలో పార్లమెంట్‌లో వారి పాత్ర ఉత్తరాది రాష్ట్ర జనాభా ఆధిక్యం వలన తగ్గిపోతున్నది.

ఆదాయ పంపిణీలోనూ అన్యాయమే!

ఐదు దక్షిణాది రాష్ట్రాల పన్నుల రాబడి వాటా 36 శాతం కాగా, ఉత్తరాది రాష్ట్రాల పన్నుల వాటా 64 శాతమే. దక్షిణాది రాష్ట్రాల వాటా 36% అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి దక్షిణాది రాష్ట్రాలు పొందుతున్నది కేవలం 18.6 శాతం మాత్రమే. ఆదాయం కొద్దీ జీఎస్టీ, జనాభా కొద్దీ ఆదాయ పంపిణీ అంటూ దక్షిణాది రాష్ట్రాలు రూపాయి ఇస్తే వారికి తిరిగి 30 పైసలు మాత్రమే ఇస్తుంది. అదే ఉత్తరాది రాష్ట్రాలు రూపాయి ఇస్తే నాలుగు రూపాయల వరకు ఇస్తున్నారు. వారి జనాభా పేదరికంలో కూరుకుపోయిందని ఇతర కారణాలు చెప్పి దేశ ఆదాయ వనరులను నేడు అప్పగించుచుండడం సమాఖ్య వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకమైనది.

బీమారు రాష్ట్రాలు అంటే..

అశీష్ బోస్ అనే జనాభా శాస్త్రవేత్త 1980లో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను బీమారు - BIMARU రాష్ట్రాలుగా పిలిచారు. అంటే బిహార్ - Bi, మధ్యప్రదేశ్ - Ma, రాజస్థాన్ - R, ఉత్తరప్రదేశ్ - U, హిందీలో బీమారు అంటే వ్యాధిగ్రస్తమైన అనే అర్థం వచ్చే పదాన్ని చేర్చారు.. జనాభా పరంగా ఆయు ప్రమాణం రీత్యా పేదరికం, నిరుద్యోగం, తలసరి ఆదాయం అత్యల్ప స్థాయిలో ఉండి కనీస జీవన ప్రమాణాన్ని కూడా పొందని జనాభా ఎక్కువగా ఉండడంతో బీమారు రాష్ట్రాలుగా పేర్కొన్నారు.. ప్రజల జీవన ప్రమాణాల రీత్యా ఈ బీమారు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నాయి.. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2024లో మన దేశం 112 దేశాలలో 105వది. దీనికి కారణం పైన పేర్కొన్న బీమారు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో కడు పేదరికంతో అల్పవృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలుగా ఉండడం ప్రధాన కారణం.

పార్లమెంటునే కబ్జా చేస్తారా?

ఇక్కడ ప్రజలు పేదరికంలో ఉపాధి అవకాశాలు లేక కొనుగోలు శక్తి అతి తక్కువగా పోషక ఆహార లోపంతో ఆయుష్ ప్రమాణం అత్యల్ప స్థాయిలో ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం ఈ రాష్ట్రాలలో జనాభా నియంత్రణ అమలు ఆశించిన మేరకు ఆనాడు జరగకపోవడం. 1970 లో అప్పటి ప్రభుత్వాలు జనాభా నియంత్రణ చేస్తే తప్ప మానవ నరులను విద్య వైద్య ఆదాయ పరంగా అభివృద్ధి చేయలేమని కుటుంబ నియంత్రణతోనే మానవాభివృద్ధి జరుగుతుందని కుటుంబ నియంత్రణ దేశవ్యాప్తంగా చేపట్టగా దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయడం వలన నేడు ఈ దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గుతూ వచ్చింది. అయితే ఈ బీమారు రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను తూతూ మంత్రంగా అమలు చేయడం వలన జనాభా పెరిగింది. ఇప్పుడు జనాభా రంగంలో డీలిమిటేషన్ చేసి పార్లమెంట్ సీట్లు కేటా యించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇలాంటి డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాల వారి పాత్ర పార్లమెంట్‌లో నామమాత్రంగానే ఉంటుంది. బీమారి రాష్ట్రాల్లో పార్లమెంటరీ సభ్యులను పెంచి పార్లమెంటును వారి అజమాయిషీలో పెట్టి దేశ ఖజానాను కైవసం చేసుకోవడం కోసమేనా?

-డాక్టర్ ఎ. నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్

98663 22172

Next Story