- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఐ క్యాపిటల్‌గా భారత్.. దిశానిర్దేశం చేసే ఢిల్లీ సమ్మిట్!
ప్రస్తుతం ఢిల్లీ వేదికగా జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ -2026’ కేవలం సాంకేతిక సదస్సు మాత్రమే కాదు.. ఇది భవిష్యత్తు ప్రపంచ ముఖచిత్రాన్ని భారత్ ఏ విధంగా మార్చబోతుందో చెప్పబోతున్న ఒక దౌత్య ప్రకటన..

ప్రస్తుతం ఢిల్లీ వేదికగా జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ -2026’ కేవలం సాంకేతిక సదస్సు మాత్రమే కాదు.. ఇది భవిష్యత్తు ప్రపంచ ముఖచిత్రాన్ని భారత్ ఏ విధంగా మార్చబోతుందో చెప్పబోతున్న ఒక దౌత్య ప్రకటన.. అమెరికా వాణిజ్య ఆధిపత్యం, చైనా ఒంటెత్తు పోకడలకు భిన్నంగా భారత్ ఒక ‘మూడవ మార్గాన్ని’ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నదని చెప్పవచ్చు. కీలకమైన సంస్థల డేటా సెంటర్లు ఇండియాలో ఏర్పాటు చేస్తుండటంతో అంతర్జాతీ యంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేయాలి? దాని పరిమితులు పరిధులు కూడా నిర్ణయించే దిశగా అడుగులు వేస్తున్నది.
ఈ సదస్సు చివరిరోజున అంటే ఫిబ్రవరి 20వ తేదీన భారత్ ‘ఢిల్లీ డిక్లరేషన్’ పేరిట ఓ డ్రాఫ్ట్ విడుదల చేయ బోతున్నది. అది భవిష్యత్తులో ఏఐ ఎలా పనిచేయాలన్న విధివిధానాలకు మార్గదర్శకంగా నిలవబోతున్నది. ఇప్పటికే ప్రధాని డీప్ ఫేక్ లాంటి సమస్యలను బహిరంగంగానే లేవనెత్తారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఎలా ఉండాలన్నది డిక్లరేషన్‌లో చర్చకు రానున్నది. ఇక ఏఐ కేవలం అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే పరిమితం కాకు డదని.. ఆఫ్రికా వంటి పేద దేశాలకు కూడా అందేలా చూడాలని పిలుపు ఇవ్వనున్నారు.. మొత్తంగా ఏఐకి భారత్ క్యాపిటల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతిమంగా భారత్ ఇప్పుడు కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు.. ఏఐ ప్రపంచానికి మార్గదర్శి లేదా దిక్సూచిగా మారబోతోంది.
ఏఐ హబ్‌గా ఇండియా!
భారత్ ఏఐ హబ్‌గా మారడానికి ఉన్న అవకాశాలు మరే దేశానికీ లేవన్నది వాస్తవం. దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. డేటా వైవిధ్యం.. భారత్‌లోని భాషలు, సంస్కృతులు, భౌగోళిక పరిస్థితులు ఏఐ అల్గారిథమ్స్ శిక్షణకు అద్భుతమైన ముడిసరుకు.. ఇక్కడ ఒక ఏఐ మోడల్ సక్సెస్ అయిందంటే, అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయగలదని అంతర్జాతీయంగా పేరొందిన టెక్ కంపెనీలు నమ్ముతున్నాయి. అందుకే అమెరికాలోనే ఉచితంగా ఇవ్వని ఏఐ అత్యాధునిక మోడళ్లను ఇక్కడ ఉచితంగా అందజేస్తున్నాయి. ఇక డెమోగ్రాఫిక్ డివిడెండ్.. ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభాతోపాటు ఇంగ్లిష్ మాట్లాడే సాంకేతిక నిపుణులు భారత్ సొంతం. ఇది అంతర్జాతీయ సంస్థలను అయస్కాంతంలా ఆకర్షిస్తున్నది. దీంతో పాటు ప్రధానమైన మరో అంశం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. యూపీఐ లాంటి వ్యవస్థల ద్వారా సామాన్యుడిని డిజిటల్ పరిధిలోకి తెచ్చిన అనుభవం భారత్‌కు ఉంది. ఇప్పుడు అదే స్ఫూర్తితో ‘ఇండియా ఏఐ మిషన్’ సాగుతున్నది.
డేటా లోకలైజేషన్ చట్టం..
కొన్నేళ్ల క్రితమే భారత ప్రభుత్వం ఒక నిబంధన తెచ్చింది. ‘భారతీయుల డేటా (ముఖ్యంగా బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలు) భారత గడ్డపై ఉన్న సర్వర్లలోనే ఉండాలి.’ దీంతో గతంలో అమెరికా లేదా సింగపూర్‌లో సర్వర్లు పెట్టుకున్న గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి సంస్థలు తప్పనిసరిగా భారత్‌లో డేటా సెంటర్లు నిర్మించా ల్సి వచ్చింది. ఇది ఒక ముందస్తు ‘మాస్టర్ ప్లాన్’. అందుకోసమే ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వం డేటా సెంటర్ల కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ క్లౌడ్ కంపెనీలు భారత్‌లో డేటా సెంటర్లు పెట్టి ఇక్కడి నుండి ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తే, వారికి 2047 వరకు పన్ను మినహాయింపులు ప్రకటించింది. డేటా సెంటర్లను ‘మౌలిక సదుపాయాల’ జాబితాలో చేర్చడం వల్ల వీరికి తక్కువ వడ్డీకే రుణాలు దొరుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్, ముంబై, పుణె ప్రాంతాల్లో సుమారు 21.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. విశాఖపట్నంలో గూగుల్ తన మొదటి పూర్తిస్థాయి ‘ఏఐ హబ్’ను ఏర్పాటు చేయడానికి 15 బిలియన్ డాలర్లు కేటాయించింది. రిలయన్స్, అదానీ వంటి స్వదేశీ దిగ్గజాలు కూడా గిగావాట్ స్థాయి డేటా సెంటర్లను గుజరాత్, మహారాష్ట్ర తోపాటు ఆంధ్ర ప్రదేశ్‌లో నిర్మిస్తున్నాయి.
ఎందుకు భారత్?
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో డేటా సెంటర్ నిర్వహణ ఖర్చు (ముఖ్యంగా లేబర్, కన్స్ట్రక్షన్) చాలా తక్కువ. భారత్ సౌర విద్యుత్ రంగంలో దూసుకుపోతున్నది. డేటా సెంటర్లకు కావలసిన భారీ విద్యుత్తును గ్రీన్ ఎనర్జీ ద్వారా అందించడం వల్ల అంతర్జాతీయ కంపెనీలకు తమ ‘కార్బన్ ఫుట్‌ప్రింట్’ తగ్గించుకునే అవకాశం దొరుకు తోంది. ‘డేటా ఇస్ ద న్యూ ఆయిల్’ అని మనందరికీ తెలుసు.. ఆ చమురును నిల్వ చేసే ‘ట్యాంకర్లే’ ఈ డేటా సెంటర్లు.. భారత్ ఇప్పుడు ప్రపంచానికి డిజిటల్ గిడ్డంగిగా మారబోతున్నది.
ఆవశ్యకతతోపాటే సవాళ్లు..
ఏఐ వల్ల కలిగే లాభాల కంటే, దాని మిస్ యూజ్ గురించిన ఆందోళనలే ఎక్కువ. అందుకే నియమ నిబంధనల విషయంలో భారత్ కఠినంగా వ్యవహరించనున్నది. భారతీయ వినియోగదారుల డేటా భారత గడ్డపైనే ఉండాలి. విదేశీ సంస్థలు మన డేటాను ‘టెస్టింగ్ ల్యాబ్’గా వాడుకోవచ్చు కానీ, దానిని మనకు వ్యతిరేకంగా వాడకుండా చూడాలి. జర్నలిజం రంగంలో ఏఐ వల్ల తప్పుడు వార్తలు వ్యాపించే ప్రమాదం ఉంది. దీనిని అరి కట్టేలా ఏఐ కంటెంట్‌కు ‘డిజిటల్ వాటర్‌మార్క్’ తప్పనిసరి చేసే దిశగా చట్టాలు రాబోతున్నాయి. ముఖ్యంగా బ్యాం కింగ్, వైద్యం వంటి రంగాల్లో ఏఐ వాడకంపై స్పష్టమైన గైడ్‌లైన్స్ అవసరం. అంతేకాకుండా కొన్ని దశాబ్దాల కిందట భారతదేశం మెడికల్ డ్రగ్ ట్రయల్స్‌కు బలైంది.. గతంలో జరిగిన ‘డ్రగ్ ట్రయల్స్’ చేదు జ్ఞాపకాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు జరుగుతున్న ‘డేటా ట్రయల్స్’ విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు సమాచారాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆ సమాచారం వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. డేటా సెంటర్లు సహా ఇతర వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఎన్ని రాయితీలు ఇచ్చినా డేటా దుర్వినియోగం కాకుండా కఠినంగా వ్యవహరించాల్సి ఉన్నది.
-హరీష్ ఎస్పీ






