ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన సాధ్యమా?

by Ravi |   (  Updated:2025-08-23 01:01:00  IST  )

భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘం (ఈసీ) వెన్నెముక. స్వేచ్ఛాయుత, నిష్పక్ష పాత ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగం

ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన సాధ్యమా?
X

భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘం (ఈసీ) వెన్నెముక. స్వేచ్ఛాయుత, నిష్పక్ష పాత ఎన్నికల నిర్వహణకు రాజ్యాం గం ఈసీకి అపారమైన స్వతంత్రతను కల్పించింది. అయితే, ఇటీవల కాలంలో ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సీఈసీ స్వతంత్రతను పునరుద్ధరిస్తామని, తొలగింపు ప్రక్రియను సంస్కరిస్తామని ప్రకటించిన నేపథ్యంలో, ఈ అభిశంసన ప్రక్రియ వారి ప్రణాళికలో ఎంతవరకు పనిచేస్తుంది అనేది ప్రశ్నార్ధకం.

ఇటీవలి కాలంలో, ఈసీ పనితీరుపై రాజకీయ వర్గాల నుండి తీవ్ర విమర్శలు, ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు అధికం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే, ‘భారత కూటమి’ సీఈసీ నియామక ప్రక్రియతో పాటు, తొలగింపు ప్రక్రియను కూడా సంస్కరిస్తామని ప్రతిపాదించింది. తాజాగా, ఆ కూటమి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో తన రాజ్యాంగ విధిని నిర్వర్తించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆయనను అభిశంసించడానికి‌ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అభిశంసన ఏ కారణాలతో ప్రవేశపెట్టొచ్చు?

అయితే అభిశంసన చేయడం అంత ఈజీ కాదు. సీఈసీని కేవలం రెండు నిర్దిష్ట కఠినమైన కారణాలతో మాత్రమే తొలగించవచ్చు. అవి నిరూపితమైన దుష్ప్రవర్తన (Proved Misbehaviour) అంటే బాధ్యతారహితంగా లేదా అక్రమంగా వ్యవహరించినట్లు స్పష్టమైన ఆధారాలతో నిరూపించబడటం, రెండవది అసమర్థత (Incapacity) అంటే తమ విధులను నిర్వర్తించడంలో శారీరకంగా లేదా మానసికంగా అసమర్థులైనట్లు రుజువు కావడం. అయితే ఈ రెండు కారణాలను నిరూపించడం అంత సులభం కాదు. ఆర్టికల్ 324(5) కింద సీఈసీని తొలగించే ప్రక్రియ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిశంసనతో సమానం. ఈ ప్రక్రియ పార్లమెంటులో తీర్మానం ప్రవేశ పెట్టడం (లోక్‌సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది ఎంపీల మద్దతు), విచారణ కమిటీ ఏర్పాటు, ఆపై ఉభయ సభలలో ‘ప్రత్యేక మెజారిటీ’ (సభ మొత్తం సభ్యుల మెజా‌రిటీ, హాజరై ఓటు వేసిన వారిలో మూడింట రెండు వంతుల మెజారిటీ)తో ఆమోదం పొందడం వంటి కఠినమైన దశలను కలిగి ఉంటుంది. అనంతరం రాష్ట్రపతి ఉత్తర్వులతో తొలగింపు జరుగుతుంది. ఈ కఠిన నిబంధనల కారణంగా, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటివరకు ఏ సీఈసీని ఈ ప్రక్రియ ద్వారా తొలగించలేదు. ఈ అభిశం సన తీర్మానంపై కనీసం 14 రోజుల ముందు నోటీసు ఇ‌వ్వాల్సి ఉంటుంది. అంటే, భారత కూటమి నాయకులు శీతాకాల సమావేశాల్లో దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?

ఈసీ స్వతంత్రతపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో నవీన్ చావ్లా ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వివాదం చెలరేగింది. 2009లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాల స్వామి, నవీన్ చావ్లాను తొలగించాలని రాష్ట్రపతికి సిఫారసు చేశారు. చావ్లా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని గోపాలస్వామి ఆరోపించారు. అయితే, రాష్ట్రపతి ఈ సిఫారసును తిరస్కరించారు. ఈ వివాదం, ఎన్నికల కమిషనర్‌ల తొలగింపు ప్రక్రియలో సీఈసీకి ఉన్న అధికారాలు, ప్రభుత్వ జోక్యంపై తీవ్ర చర్చకు దారితీసింది. ఆ సమయం లో ప్రతిపక్ష బీజేపీ చావ్లా తొలగింపునకు పట్టుబట్టగా, అప్పటి యూపీఏ ప్రభుత్వం గోపాలస్వామి సిఫారసును తోసిపుచ్చింది. ఈ సంఘటన, ఈసీలోని కీలక పదవులపై రాజకీయ నియామకాల ప్రభావం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్వతంత్ర సంస్థలో అంతర్గత విభేదాలు ఎలా తలెత్తగలవో స్పష్టం చేసింది. ఇది సీఈసీకి ఉన్న ప్రత్యేక రక్షణను ఎత్తిచూపుతూనే, ఇతర ఎన్నికల కమిషనర్లకు అటువంటి రక్షణ లేకపోవడంపై రాజ్యాంగపరమైన ప్రశ్నలను రేకెత్తించింది.

తొలగింపు ప్రక్రియ ఏలా?

ఈ అభిశంసన ప్రక్రియ రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన ఒక బలమైన సాధనం. అభిశంసన అనేది కేవలం అధికారానికి సంబంధించిన సాధనం కాదు, ఇది రాజ్యాంగ విధులను రక్షించడానికి ఉద్దేశించిన కవచం అని వారు గ్రహించాలి. అయితే, రాజ్యాంగపరంగా ఇటువంటి ప్రక్రియ ఉండటం, అత్యంత అరుదైన, తీవ్రమైన పరిస్థితుల్లో జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ఒక కీలకమైన నియంత్రణగా పనిచేస్తుంది. ప్రతిపక్ష కూటమి ఈ ప్రక్రియను రాజకీయ ప్రతీకార చర్యగా కాకుండా, స్పష్టమైన ఆధారాలతో నిరూపించాలి. ఆధారాలు చూపించ‌లేకపోతే పార్లమెంటరీ ప్రక్రియ దుర్వినియో గానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇది ఈసీ స్వతంత్రతకు మరింతగా నష్టం కలిగిస్తుంది. అదే సమయంలో, నిస్సందేహంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ఏ ప్రయత్నమైనా భారత ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైన పరిణామం. భారత కూటమి తన ప్రణా ళికలో దీనిని ఎలా అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, ఒక బలమైన, స్వతంత్ర ఎన్నికల సంఘం మాత్రమే భారతదేశ ప్రజాస్వామ్య ఆత్మను సజీవంగా ఉంచుతుంది.

- డా. కట్కూరి,

న్యాయ నిపుణులు

94909 34520

Next Story