ప్రైవేట్ కాలేజీల్లో పెరిగిన స్ట్రెంత్.. తగ్గిన కాన్సన్‌ట్రేషన్

by Ravi |   (  Updated:2025-08-19 00:46:03  IST  )

కరోనా మహమ్మారి తర్వాత విద్యార్థులు సోషల్ మీడియాకు విపరీతంగా బానిసలుగా మారారు.. దీంతో తల్లిదండ్రులు తమ

ప్రైవేట్ కాలేజీల్లో పెరిగిన స్ట్రెంత్.. తగ్గిన కాన్సన్‌ట్రేషన్
X

కరోనా మహమ్మారి తర్వాత విద్యార్థులు సోషల్ మీడియాకు విపరీతంగా బానిసలుగా మారారు.. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటి దగ్గరే ఉంచి చదివించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ పాఠశాలల కంటే డబ్బులు పోయినా పర్వాలేదని అప్పులు చేసి మరీ ప్రైవేట్ పాఠశాలలో చదివించేందుకు పోటీపడుతున్నారు. ప్రైవేట్ కళాశాలేమో ఇదే అదునుగా తీసుకొని ఒక్కొక్క విద్యార్థి నుంచి హాస్టల్, స్కూల్, కాలేజ్, బుక్స్, మెటీరియల్, యూనిఫామ్, దోబీల పేరుతో లక్ష నుంచి రెండు లక్షల వరకు దర్జాగా వసూలు చేస్తూ తమ విద్య వ్యాపారాన్ని నిస్సిగ్గుగా నిర్వహిస్తున్నాయి.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ..

ప్రస్తుతం ఖమ్మంలోని ప్రైవేట్ పాఠశాల, కళాశాలలో ప్రతియేటా గ్రామీణ ప్రాంతాలకూ చెందిన విద్యార్థులే వందల సంఖ్యలో హస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ విద్యార్థులందరినీ ఇరుకు గదుల్లో ఉంచుతున్నారు. అక్కడ పది మంది విద్యార్థులకు ఒక బాత్రూమ్ మాత్రమే ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నప్పటికీ మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదు. అలాగే ఆ పాఠశాలలో విద్యార్థుల స్ట్రెంత్ పెరగడంతో సరిపడా సిబ్బంది లేక విద్యార్థులపై కాన్సన్‌ ట్రేషన్ తగ్గిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలు అయితే పిల్లలకు హాస్టల్‌లో ఉంచి చదివిస్తే బయటకు వెళ్లే అవకాశం ఉండదు. పైగా స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులో ఉండవని పేద, మధ్యతరగతి కుటుంబాలకు కాస్తా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల వైపు మొగ్గు చూపుతుండటంతో తల్లిదండ్రుల ఆలోచనలను ప్రస్తుత ప్రైవేటు విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇక ఎంసెట్, ఐఐటీ, నీట్, సి‌ బ్యాచ్, ఒలంపియాడ్ తదితర పేర్లతో ఆయా ప్రైవేటు విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటూ కోట్లు దండుకుంటున్నారు. తరుచూ విద్యార్థులకు ఎలుకలు కరుస్తున్నా, పుడ్ పాయిజన్‌లు లాంటివి అవుతున్నా విద్యా సంస్థలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఖమ్మంలో ప్రైవేట్ నిర్వాకాలు..

ఖమ్మంలో విద్యార్థుల నుంచి ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల వివరాలు.. గత ఏడాది స్కూల్, హాస్టల్ కలిపి 85 వేలతో పాటు దోబీ 3 వేలు, బుక్స్ యూనిఫామ్‌లకు మరో 15 వేలు వసూలు చేస్తుండేవి. అదే విద్యార్థికి ఈ ఏడాది రూ. 96 వేల ఫీజు, దోబీకి 4 వేలు, బుక్స్ మెటీరియల్స్‌కి 20 వేలు వసూలు చేస్తున్నారు. నీట్, ఐఐటీ, ఎంసెట్‌ల విద్యార్థులకు మొదటి సంవత్సరం కాలేజ్ ఫీజు లక్ష 45 వేలు, బుక్స్ మెటీరియల్స్ పేర్లతో మరో 30 వేలు వసూలు చేస్తున్నారు. అదే విద్యార్థి ఇంటర్ రెండో సంవత్సరానికి వచ్చేసరికి లక్షా 65వేలు కాలేజ్ ఫీజు, మెటీరియల్ బుక్స్ కోసం 40 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఇక వైరాలో సీబీఎస్ చదువుతున్న విద్యార్థుల నుంచి స్కూల్, హాస్టల్ ఫీజు గత ఏడాది 85 వేలు ఉండగా ఈ ఏడాది ఒకేసారి 20 వేలు పెంచడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో ప్రభుత్వ నిబంధనలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. విద్యాసంస్థలలో బుక్స్ యూనిఫామ్‌లు అమ్ముతుండటం సంబంధిత అధికారులకు విద్యాసంస్థలకు ఉన్న లోపాయకారి ఒప్పందం లో భాగమేనని స్పష్టంగా కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. విద్యపై ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తుం డటం పలు అనుమానాలకు తావిస్తోంది.

-నాగుల్ మీరా

87907 17947

Next Story