- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ స్కామ్‌లలో... అందరం బాధితులమే..!
స్కామ్‌లలో డబ్బులు పోగొట్టుకున్న వారు ఎవరో అమాయకులని మనం అభిప్రాయపడతాం. కానీ డిజిటల్ అరెస్టులో గాని

స్కామ్‌లలో డబ్బులు పోగొట్టుకున్న వారు ఎవరో అమాయకులని మనం అభిప్రాయపడతాం. కానీ డిజిటల్ అరెస్టులో గాని, బ్యాంకు స్కామ్‌లలో గానీ, ఫోన్ల ద్వారా ఓటీపీలు చెప్పే వారిని గానీ పరిశీలించి చూస్తే... వీరిలో సగం కంటే ఎక్కువమంది తెలివైన వారూ, బాగా సామాజిక జ్ఞానం ఉన్నవారూ కనిపిస్తారు.. వీరిలో లాయర్లు, సీఈవోలు కూడా ఉన్నారు.. ఏదో అమాయకంగా డబ్బులు పోగొట్టుకున్నారు అనే రకంగా వీరి ప్రొఫైల్ ఉండదు. కానీ మనం తెలివైన వాళ్లం అనుకుంటే స్కామర్స్ మనకంటే తెలివైన వాళ్లు అయి ఉంటారు..
ఒక వ్యక్తి మీద టార్గెట్ పెట్టి ఆ వ్యక్తి నుండి వేలు, లక్షలు, కోట్లు స్వాహా చేసే ప్రణాళిక ఉన్న స్కామర్లు చాలా పకడ్బందీగా ప్రణాళిక వేస్తారు. ఎవరి మీద టార్గెట్ పెడతారో వారి వివరాలన్నీ కూడా వారి దగ్గర ఉంచుకుంటారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్ వారి దగ్గర ఉంటాయి. పగడ్బందీగా ప్రణాళిక వేసుకొని వీరు ముందుకు నడుస్తారు.
మనం ఆలోచించే లోపే..
గత ఏడాది నరేంద్ర మోడీ దేశంలో డిజిటల్ అరెస్ట్ లాంటిది దేశంలో లేదని స్వయంగా మాన్ కి బాత్ ఉపన్యాసంలో స్పష్టంగా చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా దేశంలో ఎన్నో డిజిటల్ అరెస్టులు జరిగాయి.. అలా డిజిటల్ అరెస్టులకు గురైన వారెవరూ కూడా అత్యంత అమాయకమైన నిరక్ష రాస్యులు కారు. చదువుకున్న వారూ, తెలివైన వారే.. మరి వీరంతా ఈ స్కామ్‌లలో ఎలా పడిపోతున్నారు అన్నది చాలా పెద్ద ప్రశ్న. మనం ఆలోచించేంత లోపలే వారు పని ముగించుకుని వెళ్లిపోతారు. తొందర పెడతారు. భయపెడతారు. మనుషుల ఎమోషన్స్‌ని నియంత్రిస్తూ వారితో ఆడుకుంటారు.
ఓటీపీ కోసం ఎన్నో కథలు..
ఇక ఓటీపీలు చెప్పకండి అని బ్యాంకులు కొన్ని వందల వేల ప్రకటనలు ఇస్తున్నాయి.. అయినా సరే స్కామర్లకు మనం ఓటీపీలు చెప్పేస్తూనే ఉన్నాం. దీనికి కూడా కారణాలు ఉన్నాయి. అవతలి స్కామర్లు బ్యాంకులు చెప్పినంత సునాయాసంగా ఓటీపీలు అడగరు.. ఆ ఓటీపీ కోసం వారు ఒక కథ అల్లుతారు. ఆ కథలో మనల్ని ముఖ్య నటుడు లేక నటిగా మార్చి వారికి కావాల్సిన ఓటీపీ తీసేసుకుంటారు. మనం తెలుసుకునే లోపే మన ఓటీపీ వారికి వెళ్లిపోయి ఉంటుంది. ఇందుకోసం వీరు ఒకసారి అకౌంట్ బ్లాక్ అయింది. మీ అకౌంట్‌లో మీరు ఏ వర్క్ చేయలేరు అని మనల్ని భయపెడతారు.. తొందర పెడతారు. ఇక మనమే వారికి ఏం చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. అప్పుడు వాళ్లు ఆపద్బాంధవుల్లా ఆదుకున్నట్టు నటిస్తారు.. వెరిఫికేషన్ కోడ్ ఒకటి వచ్చింది. పంపించండి. మీ అకౌంట్ యాక్టివేట్ చేసేస్తున్నామంటారు. ఓటీపీనే వారు వెరిఫికేషన్ కోడ్ అన్న మరో పదంతో మన నుండి తీసుకుంటారు. బ్యాంకర్లు మనల్ని ఓటీపీలు ఇవ్వకండి అని లక్షల సార్లు చెబుతారు. నిజమే మనం ఓటిపి ఇవ్వకూడదని మన మెదడు ట్యూన్ అయి ఉంటుంది. కానీ వెరిఫికేషన్ కోడ్ ఇవ్వకూడదు అని ఎవరూ చెప్పలేదు.. కాబట్టి వెరిఫికేషన్ కోడ్ పేరు మీద ఓటీపీని మనం అందించేస్తాం.
ఐవీఆర్ఎస్ ద్వారా కూడా..
ఇక ఈ కథ కూడా పాతయిపోయిన తర్వాత ఇటీవల ఐవీఆర్ఎస్ పద్ధతిలో ఓటీపీలు అడుగుతున్నారు. అంటే మనం ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదు. అవతలి ఒక స్కామర్ మనకు బాగా తెలిసిన మిత్రుని కాల్ మనకు వచ్చినట్టు భ్రమింపజేసి ఆ కాల్ మెర్జ్ చేయమని అంటారు. మన మిత్రుని కాలే కదా అని మనం యాడ్ చేస్తాం కానీ మనకు తెలియకుండా ఆ చర్య ద్వారా ఐవీఆర్ఎస్‌లో వచ్చిన ఓటీపీ వారికి కన్ఫర్మ్ అవుతుంది. దాంతో మన అకౌంట్‌లో ఐదారు లక్షలు స్వాహా.. ఆలోచించినంతలోనే ఇది జరిగిపోతుంది. మీరే పొరపాటు చేశారు. కాబట్టి మీ డబ్బులు మేము తిరిగి ఇవ్వలేమని బ్యాంకులు, చేతులెత్తేస్తున్నాయి. కానీ, మనం చెప్పని మన పాస్వర్డ్, మనం చెప్పని మన ఆధార్ కార్డు నంబర్లు అవతలి వ్యక్తులకు ఎలా అందాయి?
పోయిన డబ్బు తిరిగి రావాలంటే..
ఈ ఒక్క ఆర్గుమెంటుతో బ్యాంకు తర్కాన్ని మనం బలహీనం చేయొచ్చు. అంటే, డబ్బులు పోవడానికి తప్పు మనం మాత్రమే చేయలేదు. మొత్తం వ్యవస్థ కలగాపులగమై ఉంది. మనం చేసింది నేరం కాదు.. పొరపాటు మాత్రమే. కానీ ఇతర సంస్థలు మన వివరాలను లీక్ చేసి నేరం చేశారు.. అది పొరపాటు కాదు. కాబట్టి, మనం కోల్పోయిన డబ్బులు మనకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా బ్యాంకులదే అనే తర్కం కూడా ఇక్కడ ఉంది. డబ్బులు పోయిన నాలుగు గంటల తర్వాత ఆ మొత్తం డబ్బు దేశం బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి నిపుణుల ప్రకారం మన డబ్బులు పోయాయని తెలియగానే గంట గంటన్నర లోపల ప్రభుత్వం ప్రకటించిన 1930కు డయల్ చేయాలి. లేదా ఈ మెయిల్ చేయాలి. లేదా, సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. ఎంత తొందరగా ఈ పని చేయగలిగితే సైబర్ డిపార్ట్మెంట్ అంత వేగంగా మన డబ్బులు బ్లాక్ చేయగలదు. ఊరికే కంగారుపడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చుకోకుండా జరిగిన పొరపాటుకు వెంటనే స్పందించి పరిష్కార మార్గాలు వెతకడం ద్వారా మేలు జరుగుతుంది..
కేశవ్
ఆర్థిక, సామాజిక విశ్లేషకులు
98313 14213






