ఓపీఎస్.. ఇప్పటికైనా అమలుపరచండి!

by Ravi |   (  Updated:2025-08-31 01:00:34  IST  )

గత 20 ఏండ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించకుండా పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి లాభం

ఓపీఎస్.. ఇప్పటికైనా అమలుపరచండి!
X

గత 20 ఏండ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించకుండా పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి లాభం చేకూర్చే విధంగా ఉద్యోగుల భవిష్యత్తును స్టాక్ మార్కెట్లో తాకట్టు పెట్టిన సీపీఎస్, యూపీఎస్ స్కీంలను అంతమొందించి పాత పెన్షన్‌పై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. అందులో భాగంగానే 15 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ అధికారుల, పెన్షనర్ల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (తెలంగాణ ఉద్యోగుల జేఏసీ) సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటిస్తూ పాత పెన్షన్ సాధన సభను హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీపీఎస్, యూపీఎస్, ఓపీఎస్ లాభనష్టాలపై విశ్లేషణాత్మకంగా చర్చిద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 3.69 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో రెండు లక్షలకు పైగా ఉద్యోగులు సీపీఎస్ పరిధిలో పనిచేస్తున్నారు. 2004 జనవరి 01 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ లేదా సీపీఎస్‌ను వర్తింపజేస్తూ అప్పటి భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 01 నుండి సర్వీసులో చేరిన ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీపీఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వయించుకుంటూ 2014 ఆగస్టు 23న జీవోను జారీ చేసింది.

సీపీఎస్ పెన్షన్‌ విధానంలో..

సీపీఎస్ ఉద్యోగి తన బేసిక్ పే, డీఏలతో కలిపి 10%, మ్యాచింగ్ గ్రాంట్‌గా ప్రభుత్వం నుంచి మరో 10% సొమ్మును కలిపి నేషనల్ పెన్షన్ స్కీం ట్రస్ట్‌లో ఒక పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్‌లో ఈ సొమ్ము జమ చేస్తుంది. ఉద్యోగి పదవీ విరమణ పొందే వరకు జమ అయిన మొత్తం నుంచి 60% డబ్బును మాత్రమే ఉద్యోగికి నగదుగా చెల్లిస్తారు. మిగతా 40% డబ్బును భారతీయ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడతారు. దానిపై వచ్చే లాభాన్ని నెలవారి పెన్షన్ కింద రిటైర్డ్ ఉద్యోగికి చెల్లిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల డబ్బులు స్టాక్ మార్కెట్లో పెట్టి స్టాక్ మార్కెట్ లాభనష్టాలపై ఉద్యోగి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా విచారకరం. సీపీఎస్ విధానం నష్టదాయకంగా ఉందని దాన్ని రద్దుచేసి ఓపీఎస్‌ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏండ్లుగా డిమాండ్ చేస్తుండటంతో, సీపీ‌ఎస్ రద్దు చేయడం అసాధ్యమని, ఎన్‌పీఎస్‌లో చేయాల్సిన మార్పులపై సమీక్షలు జరిపి యూపీఎస్‌ను సిఫారసు చేసింది టీవీ సోమనాథన్ కమిటీ దీనిని కేంద్ర ప్రభుత్వం సైతం ఆమోదించింది.

సీపీఎస్ రద్దు అవకాశం ఉన్నా..

యూనిఫైడ్ పెన్షన్ పథకం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. యూపీఎస్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు చేరితే అదనపు భారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం కూడా పాత సీసాలో కొత్త సారా లాగా ఉంది తప్ప ఉద్యోగ, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత కల్పించేదిగా లేదు. ఓపీఎస్ ద్వారా మాత్రమే ఉద్యోగులకు సామాజిక ఆర్థిక భద్రత కలుగుతుంది. సీపీఎస్‌ను రద్దు చేసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డి‌ఏ) చట్టం ప్రకారం వీలు కల్పిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభు త్వం అయినా వారి ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రత కోసం సీపీఎస్‌ని రద్దు చేయాలనుకుంటే చేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ కేవలం రాజస్థాన్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాయి.

రెండేళ్లుగా నిర్ణయం తీసుకోకపోవడంతో..

తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏండ్లుగా సీపీఎస్ రద్దు కోసం పోరాటం చేస్తున్నాయి. అయితే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను గుర్తించి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) అమలు చేస్తామని అభయహస్తంలో గ్యారెంటీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినప్పటికీ దీనిపై ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగులు తమ సమస్యల సాధన కోసం సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటిస్తూ పాత పెన్షన్ సాధన సభ హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఓపీఎస్‌ను పునరుద్ధరించి రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపుతారని ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.

-పాకాల శంకర్ గౌడ్

98483 77734

Next Story