ఐఐటీ గ్రాడ్యుయేట్ అరెస్టు.. సమాజానికి హెచ్చరిక!

by Ravi |   (  Updated:2025-06-27 00:45:19  IST  )

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఇటీవల చేపట్టిన ఒక విస్తృతమైన ఆపరేషన్‌లో, బాలల లైంగిక దోపిడీ

ఐఐటీ గ్రాడ్యుయేట్ అరెస్టు.. సమాజానికి హెచ్చరిక!
X

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఇటీవల చేపట్టిన ఒక విస్తృతమైన ఆపరేషన్‌లో, బాలల లైంగిక దోపిడీ, లైంగిక దాడి వీడియోలు కలిగి ఉండి వీక్షిస్తున్న,పంచుకుంటున్న, సృష్టిస్తున్న 15 మంది వ్యక్తులను అరెస్టు చేసింది. ఈ అరెస్టులలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ ఉండటం సమాజంలో తీవ్ర చర్చకు దారితీసింది. జూన్ 18న బాలల రక్షణ విభాగం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ నేరపూరిత చర్యగానే కాకుండా, చట్ట పరమైన, సామాజిక, నైతిక కోణాలను స్పృశించే తీవ్రమైన సమస్యగా పరిణమించింది.

సెప్టెంబర్ 2024 లో మద్రాస్ హైకోర్టు చైల్డ్ పోర్నోగ్రఫీ (Child Pornography) చూడటం నేరం కాదని చెప్పిన తీర్పును రద్దు చేసి, భారతదేశ సుప్రీంకోర్టు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ vs ఎస్. హరీష్ కేసులో పిల్లల లైంగిక దోపిడీ కంటెంట్‌ను పంపిణీ చేయాలనే ఉద్దేశ్యం లేనప్పటికీ, కేవలం చూడటం, తమ వద్ద కలిగి ఉండటం లేదా కూడా POCSO చట్టం, IT చట్టం ప్రకారం నేరమేనని స్పష్టం చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ స్థానంలో CSEAM అనే పదాన్ని ఉపయోగించాలని కూడా కోర్టు సిఫార్సు చేసింది.

కేసు నేపథ్యం

ఈ మెరుపుదాడి 57 సైబర్ లైఫ్ లైన్ ఫిర్యాదుల ఆధారంగా నమోదు చేయబడిన 34 ప్రాథమిక సమాచార నివేదికల (FIRs) ఫలితంగా జరిగింది. ఈ కేసులను ఐటీ చట్టంలోని సెక్షన్ 67-బి, బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (Protection of Children from Sexual Offences Act - POCSO) లోని సెక్షన్ 15 కింద నమోదు చేశారు. నిందితులను హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఇతర ప్రాంతాల్లో అరెస్టు చేశారు.. బాధితులు ఎక్కువగా 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు కావడం ఈ నేరం తీవ్రతను తెలియజేస్తుంది.

డిజిటల్ నేరాలకు కఠిన శిక్షలు..

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, ముఖ్యంగా దాని సెక్షన్ 67-బి, ఎలక్ట్రానిక్ రూపంలో బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన పదార్థాలను ప్రచురించడం, ప్రసారం చేయడం లేదా సృష్టించడం, సేకరించడం, బ్రౌజ్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం, ప్రకటించడం, ప్రోత్సహించడం, మార్పిడి చేయడం లేదా పంపిణీ చేయడం వంటి నేరాలను తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం, మొదటిసారి నేరానికి పాల్పడిన వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, పది లక్షల రూపాయల వరకు జరిమానా విధించ బడుతుంది. పునరావృత నేరాలకు పాల్పడిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, పది లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది.

బాలల రక్షణకు కఠిన చట్టం

పోక్సో చట్టం 2012, బాలలను లైంగిక నేరాల నుండి రక్షించడానికి రూపొందించబడిన సమగ్ర చట్టం. దీనిలోని సెక్షన్ 15, చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్ అనగా ఫొటోలు, వీడియోలు లాంటి అశ్లీల చిత్రాలను లేదా CSEAMను నిల్వ చేయడం లేదా కలిగి ఉండటం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం, ఎవరైనా, చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్ నిల్వ చేసినా లేదా కలిగి ఉన్నా, వాటిని పంచుకునే లేదా ప్రసారం చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లు రుజువైతే, వారికి జరిమానా విధించబడుతుంది. వాణిజ్య ప్రయోజనాల కోసం చేస్తే, మొదటి నేరానికి మూడు నుండి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది.

సమాజానికి హెచ్చరిక..

ఉన్నత విద్యావంతులైన వ్యక్తులు కూడా ఇటువంటి నేరాలకు పాల్పడటం సమాజంలో నైతిక పతనాన్ని సూచిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత నేరం కాదని, బాలల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే సామాజిక విఘాతం అని గుర్తించాలి. తల్లి దండ్రులు తమ పిల్లలు ఆన్‌లైన్‌లో ఏమి చూస్తున్నారు, ఎవరితో సంభాషిస్తున్నారు అనే దానిపై నిరంతరం నిఘా ఉంచాలి. ఇంటర్నెట్ సురక్షిత వినియోగంపై పిల్లలకు అవగాహన కల్పించాలి. ఏదైనా అనుమానాస్పద కార్య కలాపాలను వెంటనే www.cybercrime.gov.in ద్వారా లేదా 1930కు డయల్ చేయడం ద్వారా అధికా రులకు నివేదించాలి. బాలల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం మనందరి సమిష్టి బాధ్యత.

డా.కట్కూరి

సైబర్ సెక్యూరిటీ న్యాయ నిపుణులు.

94909 34520

Next Story