- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఒక్కటీ నేర్చుకుంటే.. ఏఐతో నో రిస్క్!
నేటి జాబ్ మార్కెట్లో మెషీన్ లెర్నింగ్, కోడింగ్‌ల హవా నడుస్తోంది. వీటిలో మంచి నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా

నేటి జాబ్ మార్కెట్లో మెషీన్ లెర్నింగ్, కోడింగ్‌ల హవా నడుస్తోంది. వీటిలో మంచి నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఈ ఉద్యోగాలకు కూడా ఏఐ నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఓ స్కిల్‌ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఐ రీప్లేస్ చేయలేదని మీకు తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ ఆధారంగా సేవలు మొదలైపోయాయి. ఇక, టెక్నాలజీకి కొత్త అప్డేట్‌లా అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) అద్భుతాలు చేస్తోంది. గంటల్లో చేసే పనిని నిమిషాలు, సెకండ్లలో చేస్తూ ఆ పనిచేసే మనుషులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్ లాంటి రంగాల్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగులకు సవాల్ విసురుతోంది. ఇప్పటికే కొన్ని సాంకేతిక, ప్రోగ్రామింగ్ పనుల్లో ఉద్యోగులకు కృత్రిమ మేధ ప్రత్యామ్నాయంగా మారిపోయింది. కానీ ఓ స్కిల్‌ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏఐ రీప్లేస్ చేయలేదని అమెరికాకు చెందిన మార్కెటింగ్ ప్రొఫెసర్ స్కాట్ గాల్లోవే చెబుతున్నారు..
కాలం చెల్లని నైపుణ్యం..
న్యూయార్క్ లోని ఓ యూనివర్సిటీలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న స్కాట్ గాల్లోవే సొంతంగా ఓ కంపెనీని స్థాపించి దానిని విజయవంతంగా నడిపారు. తరువాత దానిని 130 మిలియన్ డాలర్లకు విక్రయించి భారీ లాభాలు ఆర్జించారు. ఆయన నేటి తరం యువతీ యువకుల కోసం కొన్ని కీలక విషయాలు తెలిపారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే అభ్యర్థులకు 'స్టోరీ టెల్లింగ్' నైపుణ్యం చాలా కీలకం. ఇది నా అనుభవంతో తెలుసుకున్నాను. పూర్తిగా టెక్నాలజీపైనే ఆధారపడుతున్న ఈ రోజుల్లోనూ, మన మనస్సులో ఉన్నది అత్యంత ప్రభావవంతంగా చెప్పగలగడం చాలా కీలకం. తగిన సమాచారం, చిత్రాలు, ఇన్ఫోగ్రాఫిక్స్‌తో మన ఆలోచనలను వ్యక్తపర్చడం, ఇతరులకు వాటిపై అవగాహన కల్పించడం చాలా అవసరం. వాస్తవం ఏమిటంటే, కమ్యూనికేషన్ మాధ్యమాలు మారవచ్చు. కానీ చెప్పే విధానానికి మాత్రం ఎప్పుడూ ప్రాధాన్యం తగ్గదు. అందుకే ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఎప్పటికీ కాలం చెల్లని ప్రత్యేకమైన నైపుణ్యమని స్కాట్ వివరించారు.
అతిగా టెక్నాలజీపై ఆధారపడవద్దు!
నేటి యువత చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్‌పై అతిగా ఆధారపడుతున్నారు. కానీ ఇది ప్రయోజనకరమైన అలవాటు కాదు. ఏఐ, కోడింగ్ అవసరమైనప్పటికీ, స్టోరీ టెల్లింగ్ లాంటి విలువైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఒక బ్రాండ్ ప్రతిష్టను పెంచడం లేదా తగ్గించడం అనేది స్టోరీ టెల్లింగ్ పైనే ఆధారపడి ఉంటుంది. రానున్న రోజుల్లో చాట్ జీపీటీ లాంటి అత్యాధునిక టెక్నాలజీలు సైతం కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు. న్యూరల్ నెట్‌వర్క్ వంటి సరికొత్త టెక్నాలజీలు తెరపైకి రావచ్చు, అప్పుడు కోడింగ్‌కు పూర్తిగా ప్రాధాన్యం తగ్గిపోతుంది. కానీ స్టోరీ టెల్లింగ్‌కు ఎప్పుడూ కాలం చెల్లదు.. ఈ కీలక నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. అందుకే.. స్కిల్స్ పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఏఐని వాడుకోవాలి కానీ.. దానిపైనే ఆధారపడకూడదు.
మనిషిలా ఆలోచించలేని రంగాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంత అభివృద్ధి చెందినా కొన్ని వృత్తులకు మాత్రం ప్రత్యామ్నాయంగా మారలేకపోతోంది. ఆయా వృత్తుల్లో మానవులదే పై చేయిగా నిలుస్తోంది. సృజనాత్మకత, భావోద్వేగాలకు సంబంధించిన మేధస్సు, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి ముఖ్యమైన పనుల్లో మనుషులను ఏఐ రీప్లేస్ చేయలేదు. అందులోనూ కౌన్సిలింగ్, ట్రస్ట్, ఎమోషనల్ కనెక్షన్‌తో సంబంధం ఉన్న పనులను చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరం కాదు. ఎందుకంటే చికిత్సకు సంబంధించిన పనులు, కౌన్సిలింగ్, సలహాలు ఇచ్చేందుకు మనసు, భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. ఆర్టిస్టుల విషయంలో అంతే.. ఆర్ట్ అనేది పూర్తిగా ఓ మానవ స్పర్శ. దానిని మనుషులు మాత్రమే ఫీల్ అయ్యి వేయగలరు. ఆర్ట్‌లో హ్యూమన్ టచ్ చూపించిన ప్రభావం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపించలేదు. అలాగే వ్యూహకర్తలు, విశ్లేషకులు విషయంలోనూ అంతే. వీరు ప్రతికూల సమయాల్లో వ్యూహాత్మకంగా ఆలోచించి పరిస్థితికి తగినట్టుగా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా కాదు. అది కేవలం డేటాను మాత్రమే విశ్లేషిస్తుంది. మనిషిలాగా దూరదృష్టితో ఆలోచించలేదు. ఇలా ఎన్నో రంగాలు ఏఐ మనుషులను రిప్లేస్ చేయలేనివి ఎన్నో ఉన్నాయి.
ఫండమెంటల్స్‌పై పట్టు సాధించాలి!
ఏఐ శక్తిసామర్థ్యాలు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ఫౌండేషనల్ కంప్యూటేషనల్ థింకింగ్, సిస్టమ్ డిజైన్ నైపుణ్యాలు ఇప్పటికీ చాలా కీలకం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్‌లో సహాయం చేయగలిగినప్పటికీ.. అది ఇప్పటికీ లాజికల్‌గా ఆలోచించే, నిర్మాణాత్మక మార్గదర్శకత్వాన్ని అందించే సామర్థ్యంపై ఎక్కువగా ఆధారపడుతుంది. కాబట్టి మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితే నిజమైన ఫండమెంటల్స్‌పై పట్టు సాధించమని సత్య నాదెళ్ల సందేశం ఇచ్చారు. కాకపోతే ఏఐతో మనం చేసే పని విధానం మారుతుంది. ఇప్పటివరకు మనం కోడ్ రాశాం. ఏఐతో ఆ అవసరం ఉండకపోవచ్చు. మనమందరం మరింత సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌లుగా మారబోతుండవచ్చు అని వివరించారు. ప్రపంచంలో ఎన్ని నూతన సాంకేతికలు వచ్చినా, మనుషులు మాత్రమే చేయగలిగిన రంగాలు ఎన్నో ఉన్నా యి. కాబట్టి నిరుద్యోగులు నిరాశ చెందకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త కోర్సులు నేర్చుకుంటే ఏఐ రిప్లేస్ చేయలేని ఉద్యోగాలలో సెటిల్ కావొచ్చు!
- డా. కృష్ణ సామల్ల
97058 90045






