- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియాను దూరం చేస్తే.. మనోళ్లూ జాంబీలవుతారేమో?
నేపాల్‌లో లక్షలాది మంది యువత రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా చేస్తున్న హింసాత్మక నిరసనలు, కాల్పుల్లో డజన్ల సంఖ్యలో

నేపాల్‌లో లక్షలాది మంది యువత రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా చేస్తున్న హింసాత్మక నిరసనలు, కాల్పుల్లో డజన్ల సంఖ్యలో యువత మరణాలు, వందలాది మంది గాయాలపాలవడం వంటివి ఒక విభిన్నమైన కొత్త కోణాన్ని ప్రపంచం ముందు ప్రదర్శిస్తున్నాయి. నేపాల్ యువత ఇప్పుడు ప్రాథమికంగా విద్య, ఉద్యోగాలపై కొట్లాడలేదు. కూడు, గూడు, నీడ వంటి ప్రాణాధార సమస్యపై తిరగబడలేదు. తన జీవన పరిస్థితుల్లో మార్పుల కోసం నిరసన తెలుపలేదు. దేశవ్యాప్తంగా ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి 26 యాప్‌ల పై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇంకేం.. ఏ ఇతర సమస్యల పైన పెద్దగా వీధుల్లోకి రాని నేపాల్ యువత ఒక్కసారిగా భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చేశారు.
నేపాల్‌లో యువత విషయానికి వస్తే నిరుద్యోగం 19.2 శాతం ఉంది. తలసరి ఆదాయం కేవలం 1,300 డాలర్లతో పేదరికం తాండవిస్తోంది. వర్గపరమైన అసమానతలు దేశంలో ఒకవైపు కనాకష్టమైన జీవితాన్ని, మరొకవైపు హద్దుల్లేని విలాస జీవితాన్ని సృష్టిస్తున్నాయి. వ్యవస్థపై ప్రజల అసంతృప్తి ఏవిధంగా విస్ఫోటనం చెందుతుందో ఒక పట్టాన అర్థం కాని పరిణామాలు ప్రపంచమంతటా అలుముకుంటున్నాయి.
వీధుల్లో మొబైల్ విప్లవాలకు నాంది..
నేపాల్ నుంచి ప్రస్తుతం ఫ్రాన్స్ వరకు చెలరేగిన ప్రజాందోళనలు ఒకటే విషయాన్ని చెబుతున్నాయి. తిరుగుబాట్లను ఎవరు ప్రేరేపిస్తున్నారనేది? ఇది చర్చనీయాంశమే కానీ ప్రజా అసమ్మతి కట్టు తప్పుతోందన్నదే ఆ వాస్తవం. అయినా అక్కడి యువత ఈ అసమానతలను వేటినీ పెద్దగా పట్టించుకోలేదు. చేతి వేళ్లలో ప్రపంచాన్ని చూపించడం మాత్రమే కాదు. తమ సమస్యలను ఫ్రీగా పంచుకునే అవకాశాలను అందిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తమకు అందుబాటులో లేకుండా మొత్తంగా బ్యాన్ విధించడంతో ఆగ్రహోదగ్రులై వీధుల్లోకి వచ్చేసింది యువత. ఈ పరిణామం యావత్ ప్రపంచానికి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ప్రజలకు ఏవి అందివ్వకపోయినా ఫర్వాలేదు. సోషల్ మీడియాను దూరం చేస్తే వీధుల్లో విప్లవాలు చెలరేగిపోతాయి అనే హెచ్చరికే ఇది.
అన్నింటికీ కుట్ర సిద్ధాంతమేనా..?
నేపాల్‌లో జరిగిన ఆకస్మిక పరిణామాలపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా కుట్ర దీనికి కారణం అని కొందరు.. చైనా ఉచ్చులోకి పోయినందుకే శ్రీలంక మొదలుకుని పాక్, బంగ్లాదేశ్, నేపాల్ వరకు అన్ని దేశాలు రాజకీయ అస్థిరత్వానికి లోనై ప్రభుత్వాలే కూలిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. నిజానికి బయట దేశాల కుట్రల మాటేమో కానీ గ్లోబలైజేషన్ మాయలో పడి ఆ ఊబిలోంచి బయటపడలేక గిలిగిల్లాడే ప్రతి దేశం సొంత ప్రజలకు ద్రోహం తలపెడుతూనే ఉంది. ప్రభుత్వ విధానాలు నేరుగా తమ జీవితాలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలోనే దక్షిణాసియా దేశాల ప్రజలు తిరగబడుతున్నారు. తమ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారంటూ భావ వ్యక్తీకరణ సాధనాలను కూడా అడ్డుకుంటున్న దాని పరిణామాలే ప్రస్తుతం నేపాల్ ఘటనకు కారణం.
భావ వ్యక్తీకరణకు అడ్డు చెబితే..
రేపు రేపు మన దేశంలోనూ ఇలాంటి ఉత్పాతాలు రావని చెప్పడానికి లేదు. ప్రజా వ్యతిరేకత ఏ రూపంలో సాగినా సరే అది ప్రభుత్వాలను కుప్పకూల్చేస్తోందన్నది ఆయా పాలక వర్గాలు మరవకూడదు. సంక్షేమ పథకాలను ఇచ్చినా, అమలు చేసినా, కోత విధించినా పట్టించుకోని యువత ఇప్పుడు తమ మొబైల్‌పై ప్రభుత్వాలు చేయి వేస్తే సహించమని తేల్చి చెబుతోంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. నేపాల్ ఘటన పరిమితార్థంలో అయినా సరే.. సరికొత్త ప్రజా విప్లవం అనే చెప్పాలి. ఇకపై సోషల్ మీడియాపై, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి చేయడం, బ్యాన్ చేయడం వంటి దుస్సాహసిక ప్రయత్నాలకు తలపడే ఏ ప్రభుత్వమైనా ఒకసారి నేపాల్ కేసి చూస్తే బాగుంటుంది.
ఇక్కడా జరగవని గ్యారెంటీ లేదు..
మన దేశం చుట్టూ ఇలాంటి అస్థిర పరిస్థితులు ఉన్నా బలమైన నాయకత్వంలో దేశం ఉంది కాబట్టే ఇక్కడ ఏమీ అలాంటివి జరగవు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆర్థిక పునాదులు ఇతర దేశాలతో పోలిస్తే బలంగా ఉండటం. పారిశ్రామిక, వస్తుసేవల, వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా దశాబ్దాలుగా సజావుగా సాగుతుండటం మినహాయిస్తే ఇతర దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలూ మన దేశంలోనూ ఉన్నాయి. పరిస్థితులు ఏమాత్రం వికటించినా జన విస్పోటనం మన దేశంలోనూ జరగబోదని చెప్పలేం. అదే సమయంలో నేపాల్ పరిణామాలను విప్లవాత్మక తిరుగుబాటు అని సూత్రీకరించడం కష్టం. అక్కడి పాలక వ్యవస్థను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలని ఎవరూ కోరడం లేదు. అధికారిక చట్టాల్లో మౌలిక మార్పును వారు కోరుకుంటున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడటం, సైన్యం చెప్పినట్లు త్వరలో ఎన్నికలు జరగటం సాధ్యపడినప్పుడు ప్రజల అశాంతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని గ్రహించాలి.
రోడ్లపై జాంబీలు తిరిగినట్టే..
మన చుట్టూ ఉన్న పొరుగు దేశాల్లో ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టి ప్రభుత్వాలకు ప్రభుత్వాలే వరుసగా కూలిపోతుంటే 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం స్థిరంగా, సుస్థిరంగా నిలబడి ప్రపంచం ముందు తన సత్తా చాటుతోందంటా కొందరు పొగుడుతున్నారు. కానీ వీళ్లు మర్చిపోతున్నదేమిటంటే ఒక సంవత్సరం ఆర్థిక పరిస్థితులు ఏ కారణం వల్ల అయినా తలకిందులైపోతే, ప్రజల కనీస అవసరాలను పూర్తిగా గాలికొదిలేసే పరిస్థితి సంభవిస్తే ఇండియా కూడా పైన పేర్కొన్న దేశాల సరసన నిలబడటం ఖాయం. సోషల్ మీడియాను బ్యాన్ చేశారన్న కసితో తాజాగా నేపాల్ యువత జాంబీల్లాగా వీధుల్లోకి వచ్చి కనిపించిన దాన్నల్లా ధ్వంసం చేస్తున్నారు. పరిస్థితులు విషమిస్తే ఇండియా రోడ్లపై కూడా ఇలాంటి జాంబీలు మొబైల్స్ పట్టుకుని తిరగడం ఖాయం.
-ప్రత్యూష
73964 94557






