ఆసుపత్రిలో డాక్టర్ లేకపోతే.. ప్రత్యామ్నాయ డాక్టర్‌ను సమకూర్చలేరా?

by Ravi |   (  Updated:2025-05-17 00:30:28  IST  )

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలకు కేరాఫ్‌గా పేర్కొనే నిమ్స్ హాస్పిటల్‌లో.. పేదలకు మెరుగైన వైద్యం అందడంలో కొంత

ఆసుపత్రిలో డాక్టర్ లేకపోతే.. ప్రత్యామ్నాయ డాక్టర్‌ను సమకూర్చలేరా?
X

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలకు కేరాఫ్‌గా పేర్కొనే నిమ్స్ హాస్పిటల్‌లో.. పేదలకు మెరుగైన వైద్యం అందడంలో కొంత ఆలస్యం అవుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ వివిధ రకాల రోగాలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందనే విశ్వాసంతో, నమ్మకంతో వస్తుంటారు. నా బంధువు ఒకరికి కూడా వేరే వేరే రోగాలతో చాలా రోజులుగా బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గత కొంతకాలంగా ఎన్ని హాస్పిటల్స్ మార్చినా, డాక్టర్లను మార్చినా, ఎన్ని గోలీలు మింగినా రోగం మాత్రం నయం కావడం లేదు. ఓ సందర్భంలో ఒక బంధువు నిమ్స్ ఆస్పత్రి గురించి చెప్పారు. అక్కడ కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తారని, ఆరోగ్యశ్రీలో కూడా డబ్బులు తక్కువ అవుతాయని సలహా ఇవ్వడంతో నిమ్స్ ఆసుపత్రికి వెళ్లాం. అక్కడ కొన్ని రకాల రోగాలకు టెస్టులు, మందులు తీసుకున్నాం.

కొన్ని రోజులు వాడిన తర్వాత టెస్ట్ చేసిన ఓ డాక్టర్ అదే ఆసుపత్రిలో మరో కీలకమైన డాక్టర్ దగ్గరికి వెళ్లమని రిఫర్ చేశారు. అక్కడికి ఓ సారి వెళితే ఆ డాక్టర్ రెండు వారాలు లీవ్‌లో ఉన్నారని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక రెండు వారాల తర్వాత వచ్చాం. అప్పుడూ ఆ మేడం లీవ్‌లోనే ఉన్నారు. ఇక మళ్లీ రెండు వారాల తర్వాత వెళితే అప్పుడూ లీవ్‌లోనే ఆమె ఉన్నారు. ఇలా మొత్తంగా నెల రోజులకు పైగా ఒక డాక్టర్ లీవ్‌లో ఉంటే పేద ప్రజలకు వైద్యం అందేదేలా? మెరుగైన వైద్యం కోసం ఎంతో దూరం నుండి నగరానికి వస్తుంటే, నెలల తరబడి డాక్టర్లు లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు నిమ్స్ ఆస్పత్రిలో దీర్ఘకాలికంగా సెలవుల్లో ఉన్న డాక్టర్ల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రోగులకు ఇబ్బందులు జరగకుండా కాపాడాలని కోరుకుంటున్నాం.

గుండమల్ల సతీష్ కుమార్,

94931 55522

Next Story