తెలుగు సినిమా పరిశ్రమ ఐటీ రంగం స్థాయికి ఎదగాలంటే..

by Ravi |   (  Updated:2025-09-20 01:16:01  IST  )

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ఫిలిం హబ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటనలి స్తోంది. లక్ష్యం మంచిదే ఆశించదగిందే కానీ కేవలం

తెలుగు సినిమా పరిశ్రమ ఐటీ రంగం స్థాయికి ఎదగాలంటే..
X

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ఫిలిం హబ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటనలి స్తోంది. లక్ష్యం మంచిదే ఆశించదగిందే కానీ కేవలం సినిమాలకు సినిమా వాళ్లకు అవార్డులు ఇవ్వడం, షూటింగులకు అనుమతులు, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఫిలిం షోల సంఖ్య పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం ద్వారా మాత్రమే ఫిలిం హబ్ ఏర్పడదు. సినిమాల అనుమతుల కోసం ప్రభుత్వం పక్షాన ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేయడంతో హబ్ దానంతట అదే ఏర్పడదు. అసలు సినిమా హబ్ అంటే ఏమిటి, మౌలికంగా దానికి కావలసిన వసతులు సౌకర్యాలు నిర్మాణాలు ఇవన్నీ అనేకం ఉంటాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే హైద రాబాద్‌ని ఫిలిం హబ్‌గా చేసే ఆసక్తి వుంటే, దీక్షతో చేయగలిగితే నగరం సాంస్కృతికంగానూ, వ్యాపార పరంగానూ గొప్పగా ఎదుగుతుంది. ఫలితంగా కేవలం సినిమా రంగం ఎదగడమే కాదు ఉపాధి, పర్యాటక, హాస్పిటాలిటీ రంగాలు విపరీతంగా ఎదిగే అవకాశం ఉంది. ఫిలిం హబ్ భౌతిక లేదా ఆర్థిక క్లస్టర్‌గా, ఫిల్మ్ ప్రొడక్షన్, సంబంధిత కార్యకలాపాలకు కేంద్రంగా ఎమర్జ్ అయి హైదరాబాద్ మంచి సినీరంగ వేదికగా మారే అవకాశం ఉంది. తెలంగాణా ఫిలిం సెంటర్‌గా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటుంది.

ఫిలిం హబ్.. సినిమా టాకీస్ కాదు

నిజానికి సమాజంలో సినిమా ఇవ్వాళ కేవలం వినోదం మాత్రమే కాదు. ఒక సాంస్కృతిక ప్రకటన, ఒక పరిశ్రమ, ఒక ఉపాధి మార్గం కూడా. కళాకారులకే కాదు, సాంకేతిక నిపుణులకు సినీ కార్మికులకు గొప్ప గొప్ప అవకాశాల్ని అందించే వేదిక. అలాంటి ప్రభావవంతమైన సినిమా రంగాన్ని సంపూర్ణంగా సమగ్రంగా ఒకచోట కేంద్రీ కరించి అభివృద్ధి చేస్తే ఏర్పడేదే ‘సినిమా హబ్’ (Film Hub) లేదా సినిమా కేంద్రం (Cinema Hub). అట్ల అని ‘సినిమా హబ్’ అనేది మామూలు అంశం కాదు అది సినిమాకు సంబధించిన సంపూర్ణ ఇంద్ర ధనస్సు. సినిమా నిర్మాణం, ప్రదర్శన, శిక్షణ, పరిశోధన, వ్యాపార వ్యవహారాలు అన్నీ కలసి ఒకే చోట ఉండే ఒక సమగ్రమైన కేంద్రం. అది కేవలం సినిమాలు చూసే స్థలం టాకీస్ లాంటిది కాదు, సినిమా తీయడం, నిర్మాణం నేర్చుకోవడం, నిలుపుకోవడం, పంచు కోవడం, మార్కెట్ చేయడం వంటి అన్ని కార్యక్రమాలు జరిగే వేదిక. అన్నీ సమగ్రంగా జరగాల్సిన కేంద్రం. వాస్తవంగా సినిమా హబ్‌ని సినిమా రంగానికి ఒక నాడీ కేంద్రం (nerve center)గా భావించాలి.

ప్రపంచ సినిమా ఇక్కడ చూడాలంటే..

అలా సినిమా నాడీ కేంద్రంగా వుండే హబ్‌లో ఉండాల్సిన భౌతిక వసతుల గురించి పరిశీలిస్తే ఆధునిక సాంకేతికతతో కూడిన సినిమా ప్రదర్శనశాలలు (మినీ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు) షూటింగ్ ఫ్లోర్లు, స్టూడియోలు, గ్రీన్ స్క్రీన్లు, ఎడిటింగ్ రూములు, డబ్బింగ్ స్టూడియోలు,VFX/Animation ల్యాబ్‌లు కావాలి. అంతేకాకుండా ఆధునిక కెమెరాలు, లైటింగ్, షూటింగ్ సామగ్రి, ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, కలర్ గ్రేడింగ్ సాఫ్ట్‌వేర్, డిజిటల్ స్టోరేజ్ సదుపాయాలు, వాస్తవిక అనుభవాల కోసం VR/AR ల్యాబ్‌లు ఇవన్నీ కావాలి. వీటన్నింటినీ ఏర్పాటు చేయడానికి కనీసం పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ లోనయినా సాంకేతిక వసతులు ఏర్పాటు కావాలి. ఫలితంగా ప్రపంచ సినిమా సాంకేతిక అవసరాల కోసం హైదరాబాద్ వైపు చూస్తుంది.

పూనా ఫిలిం ఇన్‌స్టి‌ట్యూట్ కావాలి..

ఇట్లా భౌతిక వసతులతో పాటు మానవ వనరులు కూడా రూపొందాలి. అంటే శిక్షణ కేంద్రాలు, వర్క్ షాపులు కావాలి. నిజానికి సృజన మానవ అంతరంగంలోంచి ఉప్పెనలా ఎగిసి వస్తుంది. దానికి ప్రత్యేకించి శిక్షణ ఉండదు. అవసరం లేదు కానీ సినిమా సృజన నిర్మాణానికి, నిర్మాణ రీతులకు శిక్షణ ఖచ్చితంగా అవసరం. ఉప్పొంగే కవితా భావనకు శిక్షణ అవసరం లేదు. ఉండదు కూడా, కానీ కవితా రూప నిర్మాణానికి అధ్యయనం, శిక్షణ ఖచ్చితంగా అవసరమ వుతాయి. అట్లే సినిమా లాంటి ఆధునిక కళ సాంకేతికత తోడుగా ఆవిష్కృతమైన సందర్భంలో శిక్షణ అవసరం వుంది. 1950ల్లో‌నే నెహ్రూ ఆధ్వర్యంలో పూనాలో ఏర్పాటయినట్టుగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బాలల కోసం చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ, ఫిల్మ్ ఆర్కైవ్స్, అంత ర్జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణలకు హైదరాబాద్ ఫిలిం హబ్ వేదిక కావాల్సి ఉంటుంది.

ఫిల్మ్ టూరిజం పాలసీ..

అట్లా ఫిలిం హబ్ రూపొందే క్రమంలో హైదరాబాద్ ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రధాన భూమికని పోషిస్తుంది. ఇంకా ఫిలిం హబ్‌లో భాగంగా సినిమా ఆర్కైవ్‌ కావాల్సి వుంటుంది. ఇక ప్రభుత్వ ఫిలిం పాలసీని ప్రకటించాలి. ఇన్సెంటివ్స్ విషయానికి వస్తే ట్యాక్స్ క్రెడిట్స్, సబ్సిడీలు, ఇండీ ఫిల్మ్ మేకర్లకు గ్రాంట్స్, ఫిల్మింగ్ కోసం స్ట్రీమ్‌లైన్డ్ సింగిల్-విండో పర్మిషన్‌ల వంటి స్కీమ్‌లను డెవలప్ చేయాలి. ఇంకా ఫిలిం ప్రమోషన్, సస్టైనబిలిటీ కోసం అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ హోస్ట్ చేయాల్సి ఉంటుంది. బ్రాండింగ్, ట్రిప్‌ల ద్వారా గ్లోబల్‌గా మార్కెట్‌ని ప్రమోట్ చేయాలి. ఎకో-ఫ్రెండ్లీ గైడ్‌లైన్‌లను అడాప్ట్ చేయాలి, ఫిల్మ్ టూరిజం పాలసీలను ఇంటిగ్రేట్ చేయాలి. ఇట్లా ఫిలిం హబ్ ఏర్పాటు చేయాలంటే కేవలం గొప్ప గొప్ప ప్రకటనలు కాదు సినిమా పరిజ్ఞానం వున్న వారితో ఒక కమిటీ వేసి హబ్‌కు సంబంధించిన కృషి మొదలు పెట్టాలి. సినిమా హబ్ అనేది ఐటీ పార్క్ లాంటిదే. కానీ దానికి కావాల్సింది సదుపాయాలు, సాంకేతికత, నైపుణ్యం, ఆర్థిక వనరులు, సృజనాత్మక వాతావరణం. ఇలాంటి హబ్‌లు ఏర్పడితే, సినిమా రంగం మరింత సమగ్రంగా, ఆధునికంగా, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందు తుంది. ప్రభుత్వ నిబద్ధత మీదనే ఫిలిం హబ్ ఆలోచన ఆచరణాత్మకం అవుతుంది. ఊక దంపుడు మాటలతో ఏ పనులూ జరగవు ఫిలిం హబ్‌తో సహా.

-వారాల ఆనంద్

94405 01281

Next Story