ఇల్లు ప్రశాంతంగా ఉంటే.. డార్జిలింగ్‌ అవసరం లేదు!

by Ravi |   (  Updated:2025-05-22 01:15:26  IST  )

రోజంతా మనం ఎక్కడున్నా, బయట ఎంత సమయం గడిపినా దినం చివరిలో ఇంటికి రావాలనుకుంటాం. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం.

ఇల్లు ప్రశాంతంగా ఉంటే.. డార్జిలింగ్‌ అవసరం లేదు!
X

రోజంతా మనం ఎక్కడున్నా, బయట ఎంత సమయం గడిపినా దినం చివరిలో ఇంటికి రావాలనుకుంటాం. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం. అయితే, ఇల్లు అనేది నాలుగు గోడలు మాత్రమే కాదు. లేదా, ఖరీదైనా ఫర్నిచర్‌తో నిండిన భవనం కాదు. అది విశ్రాంతికి భంగం కలిగించే విధంగా ఉండని ప్రదేశం అయి ఉండాలి. బతుకు కోసం మనం ఇంటి నుండి బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అది ఐదు గంటల కోసం కావచ్చు.. 10 గంటల కోసం కావచ్చు. రెండు రోజుల కోసం కావచ్చు. కానీ, తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రశాంతత ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య మంచి మానవ సంబంధాలు ఉంటే ఆ ఇంట్లో ఎంతో సేపూ గడపాలని ఉంటుంది.

సరిగ్గా దీనికి విరుద్ధంగా ఇల్లు ఉన్నప్పుడు ఒక్కసారిగా మనసు కకావికలమైపోతుంది. దాంతోపాటు వాదోప వాదాలు, డిప్రెషన్, చిరాకులు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, మందలించుకోవడం అన్నీ పక్కపక్కనే క్యూ కట్టి ఉంటాయి.

ఆఫీసు నుంచి ఇంటికి రాగానే..

అందుకే ఇంటిని వీలైనంతవరకు ప్రశాంతంగా ఉంచేలా ప్రతి కుటుంబ సభ్యుడు ప్రయత్నం చేయాలి. భర్త బయటి నుండి ఇంటికి రాగానే అలా సాక్స్ తీసి సోఫా మీద లేదా చైర్ మీద కూర్చోగానే భార్య "నేను ఇంట్లో ఒక క్షణం ఉండనండీ. మీ అమ్మగారు ఈ ఇంట్లో ఉంటే నేను ఉండను. ఎవరు కావాలో మీరే తేల్చుకోండి" అంటే. అసలే ఆఫీసులో విపరీతమైన టార్గెట్లతో, చిరాకు పరాకులతో పబ్లిక్ ట్రైన్‌లోనో, బస్సులోనో విపరీతమైన రద్దీని అనుభవించి వచ్చిన భర్తకు వీటన్నిటిని జీర్ణం చేసుకునే శక్తి ఉండదు. అలాంటి సందర్భంలో నిజనిజాలు ఎలా ఉన్నా ఈ వాక్యాలు ఆ వ్యక్తి జీర్ణం చేసుకునే పరిస్థితి ఉండదు. అప్పుడు అతని రెస్పాన్స్ కఠినంగా ఉంటుంది. అప్పుడు ఇల్లు తన శాంతిని కోల్పోతుంది. సరిగ్గా కథ రివర్స్‌గా కూడా ఉంటుంది.

ఆడదానివి.. నువ్వే చేయాలి!

భార్య బయట ఉద్యోగం చేసి ఇంట్లోకి రాగానే ఇంట్లో ఒక్క పని కూడా ఎవరు చేయకుండా అన్ని ఎక్కడికక్కడ అలాగే ఉంటాయి. అందరూ టీవీలో మునిగి ఉంటారు. బయట ఎనిమిది గంటలు ఉద్యోగం చేసి మరో రెండు మూడు గంటలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో పయనం చేసి వచ్చిన మహిళ ఇంట్లో ఈ పనులన్నీ చూసి సహనంతో ఉండే పరిస్థితి ఉండదు. 'ఇది నీ పని. నువ్వే చేయాలి. నువ్వు స్త్రీవి. కాబట్టి నువ్వే చేయాలి' అనేలా ఉంటుంది ఇంట్లో మెసేజ్. ఇలాం టప్పుడు, ఆ ఇంట్లోకి ఎంత డబ్బు వచ్చినా, భార్యా భర్తలు ఇద్దరు సంపాదించినా ఎన్ని కాస్ట్లీ వస్తువులు ఇంట్లోకి కొని తెచ్చుకున్నా ప్రశాంతత ఆ ఇంట్లో కనిపించదు. అన్ని పనులు చేసిన తర్వాత ఆమె ప్రవర్తన సానుకూలతతో ఉండదు. చిరాకులు, పరాకులు, మందలించడం కొనసాగుతాయి. అందుకే ఆమె వచ్చేలోగానే ఎవరికి ఏది వీలైతే అది చెయ్యొచ్చు. ఇది ఆడవాళ్ల పని, ఇది మగవాళ్ల పని అనే తారతమ్యం లేకుండా ఎంత వీలైతే అంత ఇంట్లో ఉన్న సభ్యులు కాస్తయినా చేసేస్తే ఆమె కాస్త రిలాక్స్ అవుతుంది. మానసికంగా కూడా మంచి మూడ్‌లో ఉంటుంది. తనను అర్థం చేసుకున్నవారు కనీసం ఇంట్లో ఉన్నారనీ, ఆమె ప్రవర్తన సానుకూలంగా మారుతుంది.

ఇంట్లో ప్రశాంతత.. గాల్లోంచి రాదు!

ఇంట్లో ప్రశాంతత ఊరికే గాలిలో నుంచి రాదు. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ ప్రయత్నం తాము చేస్తూనే ఉండాలి. అందరూ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ప్రశాంతత ఉండకపోవచ్చు. అప్పుడు వేరే పద్ధతులు, వేరే పరిష్కారాలు చూసుకోవాలి. కనీసం, కొంతవరకైనా తమ వంతు ప్రయత్నం ప్రతి ఒక్కరి నుండి జరగాలి కదా. ఇలా చిన్న చిన్న విషయాలు ఆలోచించకుండా పెద్ద పెద్ద సంతృప్తులు ఇవ్వ డానికి ప్రయత్నిస్తే ఆ ఇల్లు శాంతంగా ఉంటుందని ఎలా చెప్పగలం?

నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలి!

అలానే కొన్ని పాజిటివ్ లక్షణాలు కూడా ఇంటి కుటుంబ సభ్యుల మధ్యా, భార్యాభర్తల మధ్యా ఉండాలి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య నిజాయితీ ఉండాలి. దాగుడు మూతలు ఉండకూడదు. రహస్యాలు ఉండకూడదు. చాలామంది భార్యలు భర్తల నుండి ఊరట కోరుకుంటారు. భద్రత కోరుకుంటారు. వారు ఎంత ఉద్యోగం చేసినవారైనా, భర్త తనకు ఆసరాగా ఉన్నారు అన్న ఒక మంచి ఫీలింగ్‌ని వాళ్లు కోరుకుంటారు. ఆ పాత్రని భర్త నిర్వర్తించలేకపోయినప్పుడు బలహీనమైన పాత్రలో కనిపించేటప్పుడు, విపరీతమైన తాగు డుకు గురైనప్పుడు ఆమె బ్యాలెన్స్ తప్పుతుంది. తన ఆశలకు అఘాతం కలిగినట్టు ఫీలవుతుంది. బాధపడుతుంది. ఇక భర్త భార్యకు తెలియకుండా అక్కడక్కడా అప్పులు చేసేసి, అవి ఆమెకు తెలిసినప్పుడు తనకు తెలియకుండా ఇన్ని లక్షలు మీరెలా అప్పు చేశారు? అని ఆమె ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్న ఆ భర్తకి నచ్చదు. మేల్ ఈగో దెబ్బ తింటుంది. ఇలా వారి మధ్య సున్నితమైన సంబంధం దెబ్బతింటుంది. కలిసి ఉన్న ప్పుడు చాలాసార్లు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలి. జీవితం అనేది ఇద్దరు పంచుకుంటున్నారు. కాబట్టి చాలా విషయాలు షేర్ చేసుకోవడం అవసరం. అప్పుడు, డార్జిలింగ్ మనకు గుర్తుకు రాదు.

- కేశవ్

ఆర్థిక సామాజిక విశ్లేషకులు

98313 14213

Next Story