- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీచర్లకు చేయూతని ఇవ్వకపోతే.. విద్యార్థులు పెడదారి పడతారు!
ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థుల ముందు సాగిలబడి సాష్టాంగ నమస్కారం చేస్తూ వేడుకోవడం, గుంజీలు

ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థుల ముందు సాగిలబడి సాష్టాంగ నమస్కారం చేస్తూ వేడుకోవడం, గుంజీలు తీయడం, బెత్తంతో తనను తాను బాదుకోవడం వంటి దృశ్యాలు వైరలయ్యాయి. తన విద్యార్థులు చెప్పిన మాట వినడం లేదని, చదవడం లేదని, వారు బడికి సక్రమంగా బడికి రావడం లేదని తాను అలా ప్రవర్తించినట్లు తద్వారా పిల్లల్లో మార్పు తీసుకురావాలని భావించినట్లు ఆ ఉపాధ్యాయుడు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తెలిపాడు.
అయితే ఉపాధ్యాయుడు తనను తాను శిక్షించుకుంటే విద్యార్థులు మారతారా? వారిలో మార్పు వస్తుందా? అది సమర్థనీయమా? దానివల్ల విద్యార్థులు మారతారని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? అలా మారుతారు అనుకుంటే టీచర్లంతా ప్రతిరోజూ గుంజీలు తీస్తూ, బెత్తంతో కొట్టుకునే కార్యక్రమం ప్రారంభించవచ్చు. కానీ అది సరికాదు.
ఈ పరిస్థితికి బాధ్యులెవరు?
ఆ ఉపాధ్యాయుని వేదన చూసిన కొందరు 'అయ్యో! పాపం' అనుకున్నారు. ఇంకొందరు అది ఆ ఉపాధ్యాయుని వృత్తి వైఫల్యమని, అసహనమని, నిస్సహాయత అని కామెంట్లు చేశారు. అది ఆ ఉపాధ్యాయుని ఆసహనమా? వైఫల్యమా? నిస్సహాయతా? అనే దానికన్నా అసలీ పరిస్థితికి బాధ్యులెవరు? పరిస్థితులను ఎక్కడ సరిదిద్దుకోవాలి! అనే దాని గురించి ఆలోచించాలి. ఈనాడు పాఠశాల విద్యార్థులలో కొందరిలో కనిపిస్తున్న ప్రతికూల వైఖరులు, వారిలో చదువు పట్ల పెరుగుతున్న నిర్లక్ష్య ధోరణులు, స్వేచ్ఛ పేరుతో పెరుగుతున్న విచ్చలవిడితనం మొదలైన వాటికి బాధ్యులెవరనగానే అందరూ టీచర్లనే వేలెత్తి చూపుతారు. కానీ విద్యార్థుల్లో పెరుగుతున్న అలసత్వానికి, విపరీత ధోరణులకు, మొండితనానికి తామెంత వరకు బాధ్యులమో, తమ విధానాలు, చర్యలు ఎంతవరకు కారణమో.. అని విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు, పాలకులు, మీడియా సభ్యులు ఆలోచించకపోవడం దురదృష్టకరం. అన్నింటికీ టీచర్లనే బాధ్యులని చేసి మాట్లాడటం విచారకరం.
ఈ ఒత్తిడిని తట్టుకోలేక..
నేడు పాఠశాల విద్యలో విద్యను అభ్యసిస్తున్న పిల్లల్లో క్రమంగా పెరుగుతున్న అలసత్వం, క్రమశిక్షణా రాహిత్యం చోటు చేసుకుంటున్న పెడధోరణుల గురించి టీచర్లను తప్పుపట్టడం సరికాదు. పిల్లల నేపథ్యం, వారి కుటుంబ వ్యవస్థ, పిల్లల మనస్తత్వం, వారి స్థాయిలను గుర్తించని కొందరు అధికారులు వందశాతం ఫలితాలు సాధించాలని టార్గెట్లు విధిస్తూ అటు పిల్లల్లో, ఇటు టీచర్లలో ఒత్తిడి, ఆందోళనలను కలిగిస్తున్నారు. ఆ టార్గెట్లను సాధించలేకపోతే తాము అందరిముందు అవమానపడాల్సి వస్తుందని, టీచర్లు విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతుంటారు. అది ఎదుర్కోలేని పిల్లలు మొండితనం చూపిస్తారు. మేము ఏమీ చేయం మీరేం చేస్తారో చేసుకోండి అనే వైఖరిని ప్రదర్శిస్తారు. ఇక విద్యార్థులు కూడా ఉపాధ్యాయులను శత్రువులుగా భావించకూడదు. ఒక దెబ్బ కొడితే అది మన మంచికే అన్న విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి. ఇక తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అతి గారాబం చూపిస్తూ వారు తప్పు చేస్తున్నా వెనకేసుకొస్తున్నారు. టీచర్లు వారిని గమనించి మందలించగానే ఆ తల్లిదండ్రులే బడికి వెళ్ళి టీచర్లను నిలదీస్తుంటారు. అది చూసిన పిల్లలకు ఆ టీచర్లంటే భయం ఉండదు, గౌరవం ఉండదు. తల్లిదండ్రులు ఆలోచించాలి. తమ పిల్లల బాగు కోసమే టీచర్లు కష్టపడుతున్నారని గ్రహించాలి.
అందరూ బాధ్యత వహించాల్సిందే!
ఎవరో ఒక విద్యార్థి పదవ తరగతి పరీక్షలు జరిగే సెంటర్ గోడపై 'పుష్ప' సినిమాలోని హీరోగారి డైలాగుతో ప్రేరణ పొంది 'దమ్ముంటే పట్టుకోరా ఇన్విజలేటర్. పట్టుకుంటే వదిలేస్తా బుక్లెట్. నీ యవ్వ తగ్గేదేలే' అని రాశాడంటే సినిమా రంగం పిల్లలపై ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నదో గ్రహించవచ్చు. ఈ విధంగా "నీ చేతను, నా చేతను, వరమడిగిన కుంతి చేత" అనే రీతిగా కర్ణుడి చావుకి అనేక కారణాలున్నట్లు ఇవ్వాళ పిల్లలు చదవకపోవడం, అలసత్వాన్ని ప్రదర్శించడం, విపరీత ధోరణులు ప్రదర్శించడం వెనుక అనేక కారణాలున్నాయి. దీనికి అందరూ బాధ్యత వహించాలనే తప్పా కేవలం టీచర్లను నిందించడం బాధాకరం, చట్టాలతో, అధికారంతో, బల ప్రదర్శనలతో టీచర్లను ఆదరగొడుతూ వారిని నిస్సహాయులను చేయడమే ఈ పరిస్థితులకు కారణం. ఇకనైనా సమాజం మేల్కొని టీచర్లకు చేయూత నివ్వాలి. వారికి అండగా నిలవాలి. అధికారులు కూడా ఉపాధ్యాయుల పక్షాన నిలబడి వారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- సుధాకర్.ఏ.వి
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS
9000674747






