ఏమరుపాటుగా ఉంటే.. ఫోనే మనల్ని ముంచేస్తుంది!

by Ravi |   (  Updated:2025-07-09 01:15:21  IST  )

వాస్తవ ప్రపంచంలో అవతలి వ్యక్తి మనల్ని మోసం చేయడానికి ఎలాంటి ట్రిక్స్ వాడతాడో, సైబర్ ప్రపంచంలో కూడా సరిగ్గా

ఏమరుపాటుగా ఉంటే.. ఫోనే మనల్ని ముంచేస్తుంది!
X

మా ఫ్లాట్ కింద జామకాయలు అమ్మే అబ్బాయి మంచి ట్రిక్ వాడతాడు. నాణ్యత తక్కువగా ఉన్నవి బుట్టలో ఉన్న మంచి జామకాయల మీద పెడతాడు. ఎవరైనా కొనడానికి వచ్చేటప్పుడు వెంటనే పైన ఉన్న జామకాయలు తీస్తారు. అవతలి వ్యక్తి ఆలోచించే లోపే తన దగ్గర బాగా పండిపోయిన లేదా తక్కువ నాణ్యత ఉన్న జామకాయలు ఆ పోలితిన్‌లో పడేస్తాడు. కస్టమర్ అవి వద్దు అన్నప్పుడు బాగానే ఉన్నాయి అని కోపం నటిస్తాడు. చాలా సాధారణంగా అందరూ చేసే జిమ్మిక్కు ఇది.

వాస్తవ ప్రపంచంలో అవతలి వ్యక్తి మనల్ని మోసం చేయడానికి ఎలాంటి ట్రిక్స్ వాడతాడో, సైబర్ ప్రపంచంలో కూడా సరిగ్గా అలాంటి ట్రిక్స్ మాత్రమే వాడతారు. సైబర్ ప్రపంచంలో కూడా మనకు తెలియకుండానే మనం పొరపాట్లు చేస్తాం. తెలిసినంతలోనే మన ఫోన్ అవతలి వ్యక్తి చేతుల్లోకి వర్చువల్ రూపంలో అందించేస్తాం. లేదా ఓటీపీలు చెప్పేసి మనల్ని మనం నష్టం చేసుకుంటాం. జామకాయల అబ్బాయి పదిమందిలో ఐదుగురు అయినా తన జిమ్మిక్కుకు పడతారు కదా అనే ఆశతో ఉంటాడు. సరిగ్గా సైబర్ ప్రపంచంలో కూడా మనల్ని ట్రాప్ చేయడానికి అవతలి ఫ్రాడ్‌లు ఇలానే మన మీద గాలం వేస్తారు.. గాలం వేసిన ప్రతి ఒక్కరూ పడరని వారికి తెలుసు. కానీ ఒక ఇద్దరు పడినా సరే రెండు లక్షలు, రెండు కోట్లు దొరికితే ఆ రోజుకి వారి కోరిక నెరవేరినట్టే.

కాల్ చేసి.. భ్రమల్లో ముంచెత్తుతారు!

వాస్తవ ప్రపంచంలో అవతలి వ్యక్తి మనల్ని మోసం చేయాలనుకున్నప్పుడు మనల్ని మభ్యపెట్టి మన ఎమోషన్లతో ఆడుకుని, కథలు అల్లి, మాటల్లో పెట్టి తన పని తాను చేసుకు పోతాడు. సరిగ్గా సైబర్ ప్రపంచంలో కూడా మనకు ఫోన్ కాల్ వచ్చేటప్పుడు మనల్ని అలానే భ్రమలో ముంచుతారు. భయపెడతారు. ఏదో మనకు నష్టం జరుగుతుంది అని సీన్ క్రియేట్ చేస్తారు. ఫలానా పని చేయకపోతే మన అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయని భయం కలిగిస్తారు. పోలీస్ స్టేషన్ స్టూడియో తయారు చేస్తారు. జూనియర్ పోలీసుల నుండి సీనియర్ పోలీసుల వరకు వయసు మెయింటైన్ చేస్తారు. ఆ సీన్ మీద నమ్మకం కలిగేలా మనతో మాట్లాడతారు.. మనం నమ్మేస్తే అకౌంట్‌లో ఉన్న డబ్బులు ఖాళీ చేసేస్తారు. ఇంకా మోసపోయే మనుషులు ఉంటే మూడేసి నాలుగేసి రోజులు వారిని డిజిటల్ అరెస్ట్ చేసి బ్యాంకుకు వెళ్లి ఎఫ్‌డీలు విరగ్గొట్టి మరీ వారికి ఇచ్చేసేలా చేసి తర్వాత కుయ్యో మొర్రో అని ఏడ్చేలా చేస్తారు.

మనచేతే తప్పు చేయించి..

నేరస్తులకు డబ్బులు కావాలి. లేదా మన ఫోన్ మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోవాలి. అప్పుడు మన ఓటీపీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన ఓటీపీలు వారికే వెళ్లిపోతూ ఉంటాయి. కాబట్టి, ఏదో ఒకరకంగా మన ఫోన్లోకి కొన్ని మాల్‌ వేర్లు పంపించేలా ప్రయత్నాలు చేస్తారు. అవి మన ఫోన్లో క్లిక్ చేసి మనమే అమాయకత్వంతో మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యేలా చేస్తాం. సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ కూడా మన దగ్గరికి వచ్చి నేరం చేయరు.. మనల్ని టార్గెట్ చేస్తారు. మన చేతే తప్పు చేయిస్తారు. మనమే వారి మాయ మాటల్లో పడేలా చేస్తారు. తర్వాత ఫోన్‌లో ఉన్న డేటాతో మనతో ఆడుకుంటారు.

మన డేటా నిమిషంలో కాపీ చేస్తారు..

వాస్తవ ప్రపంచంలో మన వాలెట్ పాకెట్‌లో ఉంచుకున్నప్పుడు పదిసార్లు చూసుకుని, జాగ్రత్త పడతాం. మన ఫోన్ విషయం వచ్చేటప్పటికీ మనం అది పాటించం. ఫోన్‌ని చాలా లైట్‌గా తీసుకున్నవారు మనలో నూటికి తొంభై మంది ఉంటారు. కానీ ఫోన్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మాత్రమే కాదు. మన జీవితం. మన ప్రైవసీ. మన ఫోటోలు, మన వీడియోలు ఉంటాయి. మనకు సంబంధించిన సంపద అందులో ఉంటుంది. బ్యాంకుతో లింక్ చేయడం ద్వారా ఓటీపీలు కూడా అదే ఫోన్‌కి వస్తాయి. మరి ఇంతగా ముఖ్యమైన ఒక ఫో‌న్‌ని మనం ఇంట్లో ఉన్న పిల్లలకు చాలా క్యాజువల్‌గా ఇచ్చే‌స్తాం. లేదా హోటల్‌లో కూర్చుంటే ఆ టేబుల్ మీద క్యాజువ‌ల్‌గా పెట్టేస్తాం. చేయి కడుక్కోవడానికి వాష్ రూమ్‌లోకి వెళ్లి వచ్చేటప్పటికీ ఆ ఫోన్లో డేటా అంతా మనకు తెలియకుండానే ఒక సైబర్ నేరగాడు ఎవడైనా నిమిషంలో కాపీ చేయగలడని మనం అర్థం చేసుకోం.

డిజిటల్ అరెస్ట్ ఇండియాలో లేదు!

జామకాయలు అమ్మే అబ్బాయి చేసే ట్రిక్కులతో మనం కోల్పోయేది యాభై రూపాయలు అయితే ఇక్కడ కోల్పోయేది ఐదు లక్షలు కావచ్చు. రెండు కోట్లు కూడా కావచ్చు. కాబట్టి, ఇక్కడ మరింత జాగ్రత్త పడాలి. డిజిటల్ అరెస్ట్ ఇండియాలో లేదు అని మనం గుర్తుంచుకోవాలి. అరెస్టు చేయాల్సిన అవ సరం వస్తే పోలీసులు ఇంటికే వస్తారు. కాబట్టి ఫోన్‌లో డిజిటల్ అరెస్ట్ అని ఎవరు భయపెట్టినా వాట్ ఏ జోక్ అని ఒక్క నవ్వు నవ్వి మీ మీ స్టూడియో సెట్ అప్‌కి ఎంత ఖర్చయింది బాబూ అని జోక్ చేసి ఫోన్ కట్ చేసి రిలాక్స్‌గా కూర్చోండి. మరోసారి జీవితంలో అలాంటి ఫోన్‌లు మీకు రావు. వచ్చినా అదే పద్ధతి వాడండి. ఫ్రాడ్‌లు మీ నంబర్‌ని స్కెచ్ పెన్‌తో కో పంగా కట్ చేసేసి చెత్తబుట్టలో వేసేసి మీ నెంబర్ మర్చిపోతారు.

- కేశవ్

ఆర్థిక సామాజిక విశ్లేషకులు

98313 14213

Next Story