- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలకు కోర్టులపై, చట్టాలపై నమ్మకం పెరగాలంటే ఇది అమలుపరచాల్సిందే!
మనిషి పేదవాడైనా, పెద్దవాడైనా, ఉన్నత విద్యావంతుడైనా, అగ్రవర్ణాలవారైనా, దళితుడైపా, గిరిజనుడైనా తన జీవితంలో ఏదో ఒక

మనిషి పేదవాడైనా, పెద్దవాడైనా, ఉన్నత విద్యావంతుడైనా, అగ్రవర్ణాలవారైనా, దళితుడైనా, గిరిజనుడైనా తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంపై న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు, కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి మనిషికి న్యాయ విద్య తెలియాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు న్యాయ విద్య ఇంటర్, డిగ్రీ తరువాత ప్రత్యేక ప్రవేశ పరీక్షతో ఆడ్మిషన్ పొందే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వాలు చొరవ తీసుకొని న్యాయ విద్యను విద్యార్థులకు ప్రాథమిక విద్యలో భాగంగా అందించాల్సిన అవసరం ఉంది.
మన దేశంలో అనేక రకాల కోర్టులు, చట్టాలు ఉన్నాయి. వీటన్నింటి గురించి చాలా మందికి తెలియదు. పీజీలు చదివిన వారికి సైతం వీటి గురించి కనీస అవగాహన ఉండదు. ఇందులో వారి తప్పు కూడా లేదు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ఎక్కడా కూడా వీటి గురించి చెప్పలేదు. అందుకే న్యాయ విద్యపై ప్రాథమిక అవగాహనైనా విద్యార్థులకు పాఠశాల స్థాయిలో కల్పించాల్సిన అవసరం ఉంది. సోషల్ సబ్జెక్టులో భాగంగా దీనిని ఒక అంశంగా చేరిస్తే ఆ విద్యార్థుల జీవితాల్లో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
మనిషికి ఏదో ఒక దశలో..
మనిషి తన నిజ జీవితంలో భూ వివాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, ఆస్తి తగదాలు, ఉద్యోగ సంబంధిత వివాదాలు, డిజిటల్ మోసాలు, ఇన్సూరెన్స్ సంబంధిత సెటిల్మెంట్లు, తప్పుడు సమాచారంతో మోసం చేయడం, ఆగ్రిమెంట్‌లలో ఒకటి, అమలయ్యేది ఒకటి, భూముల డెవలప్‌మెంట్ అంశాలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధిగా ప్రజా ప్రాతినిధ్య చట్టం, గృహ హింస కేసులు, ఇలా చాలా అంశాలు మనిషి జీవితానికి ముడిపడి ఉంటాయి. దీంతో మనిషికి ఏదో ఒక దశలో కోర్టులు, కేసులు, పోలీస్స్టేషన్లు అవసరం ఉంటాయి. ఇక ప్రభుత్వాలు చేసే వివిధ రకాల చట్టాలు, వాటి అమలు కోసం పోరాడటానికి ఉండే నిబంధనలు ఇలా అనేక రకాలుగా ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో న్యాయం, చట్టాలు అవసరం అవుతాయి. అప్పటికప్పుడు వాటి గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు. అదే సమయంలో ప్రత్యేకంగా లా కోర్సులు చదవడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో చట్టం, న్యాయం, కోర్టులు, బెయిల్, స్టే, రిమాండ్, ఎఫ్ఐఆర్, ఛార్జీ షిట్ తదితర అంశాల గురించి లోతుగా కాకపోయినా కొంతైనా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
ఈ సమస్యలు ఎదుర్కొనడానికి..
గ్రామాల్లో భూ వివాదాలు చాలా సర్వసాధారణంగా మారాయి. పెళ్లిన అయిన తరువాత కోడలికి అత్తగారింట్లో జరిగే వేధింపులు, గృహహింస, మహిళగా తనకు రావాల్సి ఆస్తి హక్కు గురించి, అలాగే షాపుల్లో వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు, వాటి ధర, నాణ్యత, వ్యారెంటీ, ఎమ్మార్పీ కంటే ఎక్కువగా అమ్మడం, కొనుగోలు చేసిన కొద్ది రోజులకే నాణ్యత లేకుంటే తదితర వాటి గురించి కన్జుమర్ కోర్టులు పోరాడే వెసులుబాటు గురించి తెలుసుకోవడం ప్రజలకు అవసరం. నకిలీ విత్తనాలు, పురుగు మందులు, వ్యాపారుల మోసాలు, చిట్ ఫండ్‌ల పేరుతో జరిగే మోసాలు.. ఇలాంటి వాటన్నింటిని న్యాయ స్థానంలో పోరాడేందుకు ప్రాథమిక విద్యలో నుంచి న్యాయం, చట్టాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమికంగా అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక అంశంగా న్యాయవిద్యను చేర్చాల్సిన అవసరం ఉంది. ఇక కొన్ని కేసుల్లో వారికి సంబంధం లేకపోయినా వారి పేర్లు చేర్చే కుట్రలు వీటన్నింటి గురించి చట్టం నుంచి రక్షణ, వెసులుబాటు తదితర అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రజలకు అవగాహన పెరుగుతుంది. చట్టాలపై అవగాహన లేక కొందరు అమాయక ప్రజలు కోర్టులకు, న్యాయవాదులకు భరించలేనంత ఫీజులు చెల్లించి కూడా ఓడిపోతుంటారు. కానీ చట్టాలపై కొంత అవగాహన కల్పిస్తే ఏ కేసులో తమకు బలం ఉందో వారు తెలుసుకోవచ్చు.
వ్యవస్థలపై నమ్మకం కలిగేందుకు..
చట్టాలు, కోర్టులు వీటిపై సరిగా అవగాహన లేని వ్యవస్థ, ప్రభుత్వాలపై అపోహాలు, అనుమానాలు పెంచుకుంటారు. వ్యవస్థను నిందిస్తుంటారు. దీంతో ఒక్కొసారి వ్యవస్థ, కోర్టులు, చట్టాలపై నమ్మకం సన్నిగిల్లిన విధంగా మాట్లాడుతుంటారు. తమ జీవితంలో అనుభవాలు ఉన్నాయంటూ చెబుతుంటారు. ఇలాంటి వాటికి అస్కారం లేకుండా వారికి కొంత అవగాహన ఉండటం ద్వారా అలాంటి జరగకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం, ఒక ఏదైనా అనుకోకుండా జరిగినా తదుపరి వ్యవహరించాల్సిన వాటి గురించి కొంతైనా అవగాహన వ్యవహరించడం వారికి న్యాయం లభించే అవకాశం ఉంది. కోర్టులను, లాయర్లను, ప్రభుత్వాలను నిందించడం కూడా తగ్గుతుంది. వ్యవస్థలపై నమ్మకం, విశ్వాసం పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ప్రాథమిక విద్య స్థాయిలోనే న్యాయ విద్యను ప్రవేశపెట్టాల్సిన అవశ్యకత ఉంది. ఈ దిశగా మేధావులు, విద్యావంతులు తమ ఆలోచనలు, చర్చలు ప్రారంభిస్తే మరికొంత కాలానికైనా ఆచరణ సాధ్యమయ్యే అవకాశం ఉంది.
- నెలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి
98488 85505






