- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation sindoor: పాకిస్తాన్ ఇప్పటికీ తీరు మార్చుకోకపోతే.. తీవ్ర పరిణామాలే!
ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరుతోనే పాక్‌కు బలమైన సందేశం పంపింది. మన మహిళలు భర్తలను కోల్పోయారు..

భారతదేశం ఉగ్రవాదుల ఏరివేతకై ఆపరేషన్ సిందూర్ చేపట్టి కేవలం 25 నిమిషాల్లో ముగించిన సైనిక చర్య అభినందనీయం. రెండు వారాల క్రితం కశ్మీరులోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై దాడికి తెగబడ్డ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల మూలాల్ని అంతం చేసే తలంపుతో తలపెట్టిన ఈ సైనిక చర్య భారత్ శక్తి యుక్తులను తెలిపేది.
ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరుతోనే పాక్‌కు బలమైన సందేశం పంపింది. మన మహిళలు భర్తలను కోల్పోయారు.. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని భారత్ ఎక్కడున్నా వదిలి పెట్టదు అనేలా మన ప్రతిస్పందన కచ్చితంగా కనిపించాలని ఈ పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ఇది తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు తాజా హెచ్చరిక లాంటిది.
ఎన్నోసార్లు ఉసిగొల్పినా..
భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్తాన్‌కు కొత్త కాదు. 1947 నుండి ఇప్పటికి నాలుగుసార్లు యుద్ధానికి తెగబడినా, లెక్కకు మిక్కిలి సార్లు భారత్‌పైకి ఉగ్రవాదుల్ని ఉసిగొల్పినా భారత్ సంయమనం కోల్పోలేదు. ఆయా యుద్ధాల్లో విజయం సాధించినా, పాకిస్తాన్‌ని కట్టడి చెయ్యడం వరకే పరిమితమైంది తప్పితే, ఇంకా ముందుకు పోయి పాదాక్రాంతం చేద్దామని భావించలేదు. అంతర్జాతీయ నియ మాల్ని, నీతిని తప్పి ప్రవర్తించలేదు. కానీ ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే పహల్గాంలో జరిగిన దాడి మామూలు దాడి కాదు. ఎంతో దుర్బుద్ధితో జరిగినది. కశ్మీరులో సాధారణ స్థితి నెలకొన్న వేళ, పర్యాటకులపై విరుచుకుపడి 26 మంది ప్రాణాలు తీయడం అంటే కేవలం అప్పటికప్పుడు జరిగిన ఉగ్రవాద చర్య కాదు. దేశ సార్వభౌమత్వాంపై జరిగిన దాడి. ఈ దాడి ద్వారా అటు స్థానిక, దేశీయ ఆర్థికంపై తక్షణ దాడి చెయ్యడమే కాకుండా, మారిన ప్రపంచ వాణిజ్య చిత్రం నేపథ్యంలో భారత్ వైపు చూస్తున్న పరిశ్రమలు రాకుండా చెయ్యడం, సురక్షితం కాదని నిరూపించి భారత్ ఎదుగుదలకు అడ్డం పడడం ఆ ఉగ్రవాదులకు, వెనుక నుండి నడిపిస్తున్న పాకిస్తాన్‌కున్న ఏకైక వ్యూహం. అందుకనే ఈ సారి భారత్ మరింత సీరియస్‌గా స్పందించింది.
ఇప్పటికీ తీరు మార్చుకోకపోతే..
గతంలో జరిగిన బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్, ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ ఈ రెండు సార్లు దాయాదిని ఏమార్చి.. అత్యంత పకడ్బందీగా దాడుల ప్రణాళికలను మన దేశం అమలు చేసింది. 1971 తర్వాత తొలిసారిగా మూడు సైనిక దళాలు కలిసి నిర్వహించిన ఆపరేషన్ ఇది. పాకిస్తాన్‌లో, పాక్ ఆక్రమిత కశ్మీరులో తొమ్మిది చోట్ల ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసి వందమంది ముష్కరులను మట్టు బెట్టాయి. వారి స్థావరాలను, పరికరాన్ని ధ్వంసం చేసి విజయవంతంగా తిరిగి వచ్చాయి. ఇదంతా భారత భూభాగం దాటకుండా నిర్వహించడమే కాకుండా, సూటిగా, టార్గెట్ ఛేదించడం, పౌరులకు నష్టం కలిగించకపోవడం భారత్ నీతికి, సామర్థ్యానికి నిదర్శనం. అందుకనే ప్రపంచ దేశాలు కూడా మద్దతుగా ఉన్నాయి. పాకిస్తాన్ సైనిక, పౌర పాలకులు ఇకనైనా తమ తీరు మార్చుకోకపోతే, మరింత తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందన్న హెచ్చరిక ఈ సైనిక చర్యలో ఉంది. ఆ సందేశం అర్ధం చేసుకుని ఉగ్రవాదుల్ని వదులుకోవడమా, లేదా భారత్‌తో తలపడి సర్వ నాశనాన్ని కొనితెచ్చుకోవడమా అన్నది ఆ దేశం విజ్ఞతపై ఆధారపడి ఉంది. ఆపరేషన్ సిందూర్ విజయానికి కారణమైన ప్రభుత్వానికి, సైన్యానికి సెల్యూట్.
డా. డి.వి.జి. శంకరరావు,
94408 36931






