యుద్ధం ప్రారంభించాలంటే ఈ వ్యూహం సిద్ధం చేసుకోవాల్సిందే!

by Ravi |   (  Updated:2025-04-30 01:15:24  IST  )

ప్రపంచ చరిత్రను తిప్పి చూస్తే, యుద్ధాలు ఎన్నిసార్లు జయాలు అందించినా, వాటి దీర్ఘకాలిక ప్రభావాలే ఆ దేశాల

యుద్ధం ప్రారంభించాలంటే ఈ వ్యూహం సిద్ధం చేసుకోవాల్సిందే!
X

ప్రపంచ చరిత్రను తిప్పి చూస్తే, యుద్ధాలు ఎన్నిసార్లు జయాలు అందించినా, వాటి దీర్ఘకాలిక ప్రభావాలే ఆ దేశాల భవిష్యత్‌ను రూపుదిద్దాయి. గెలిచిన దేశాలకూ, ఓడి పోయిన దేశాలకూ రెండింటికీ తగిన గుణ పాఠాలే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో, భారత్ పాక్‌పై యుద్ధం ప్రారంభించాలంటే, తాత్కాలిక విజయానికి మాత్రమే కాదు.. భవిష్యత్ భద్రతా, ఆర్థిక, సామాజిక స్థిర త్వానికి కూడా దోహదపడేలా వ్యూహం సిద్ధం చేసు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యుద్ధం ప్రారంభించే ముందు విజయం ఎలా కనిపించాలి, శాంతి ఎలా సాధించాలి అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు సిద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే, యుద్ధం విజయవంతం అవుతుంది. లేదంటే అది మరో అంతులేని సమస్యల చక్రవ్యూహంగా మారిపోతుంది. యుద్ధం తాత్కాలిక గర్వాన్నిచ్చి, దీర్ఘకాలికంగా దేశాన్ని క్షీణింపజేసే ప్రమాదం సైతం కూడా ఉంటుంది.

యుద్ధం తాత్కాలిక గర్వాన్నిచ్చినా..

యుద్ధం అనేది ఒక చక్రం.. ప్రారంభించినప్పుడు మాత్రమే కాదు, దాన్ని ముగించి, విజయాన్ని సుస్థిరం చేయడం కూడా సమాన ప్రాధాన్యం గలది. భారత్‌కు పాక్‌పై యుద్ధం ప్రారంభించడం కేవలం ఆగ్రహానికి ప్రతిస్పందనగా మాత్రం కావొద్దు. అది ఒక జాతీయ భద్రతా వ్యూహం తుది దశ. అందుకే, ప్రతీ అడుగు, ప్రతీ నిర్ణయం, దీర్ఘకాలిక దృష్టితో, ప్రణాళిక బద్ధంగా తీసుకోవాలి. క్షణిక విజయాలు కాక, శాశ్వత స్థిరత లక్ష్యంగా ముందుకెళ్లాలి. యుద్ధం ప్రారంభించే ముందు విజయం, శాంతి ఎలా సాధించాలనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు సిద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే, యుద్ధం విజయవంతం అవుతుంది. లేదంటే అది మరో అంతులేని సమస్యల చక్రవ్యూహంగా మారిపోతుంది.

నిర్దిష్ట లక్ష్యం స్పష్టంగా లేకపోతే..

భారత్ ఎప్పటికీ ఆక్రమణ దురుద్దేశంతో కాక, అవసరమైన పక్షాన మాత్రమే శస్త్రాన్ని ఎత్తుకున్న దేశంగా పేరుగాంచింది. కానీ పాకిస్తాన్ మిలిటరీ తరచూ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ, ఎక్కడో ఒకచోట సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో, భారత్‌కి తగిన ప్రతి చర్య తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. ఈ దశలో యుద్ధం ప్రారంభించటమే సరైనదా కాదా? యుద్ధం ప్రారంభించిన తర్వాత మన లక్ష్యాలు ఏమిటి? దానికి మనం సిద్ధమా? అనే దానిపై స్పష్టత ఉండాలి. యుద్ధ ప్రారంభానికి ముందే కీలక వ్యూహాలు రచించుకోవాలి. యుద్ధం ఎందుకు చేస్తున్నామో స్పష్టంగా నిర్దిష్ట లక్ష్యంతో నిర్వచించాలి. ఆ నిర్దిష్ట లక్ష్యం స్పష్టంగా లేకపోతే, యుద్ధం అనవసరంగా పరిణమిస్తుంది, లక్ష్యచ్యుతమవుతుంది. యుద్ధం వల్ల సాధించదలచుకున్న లక్ష్యాన్ని ఖచ్చి తంగా నిర్వచించాలి. ఒకవేళ భారత్ పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం, ఉగ్రవాద మౌలిక కేంద్రాలను ధ్వంసం చేయడం, పాకిస్తా‌న్ మిలిటరీ శక్తిని నాశనం చేయడం, అంతర్జాతీయంగా పాక్‌ను బహిష్కరించాలనే పరిస్థితి తేవడం వేరు.. యుద్ధం చేయడం వేరు.

ఆర్థిక ప్రణాళికలు..

యుద్ధం వల్ల ఏర్పడే ఆర్థిక భారం ఎలా భరించాలన్న దానిపై ముందస్తు ప్రణాళిక ఉండాలి. యుద్ధం ఖర్చులు ఎంత ఉండబోతున్నాయో కచ్చితంగా అంచనా వేయాలి. ఒక్క యుద్ధ సంవత్సరం ఖర్చు కనీసం 8-9 లక్షల కోట్లు. ఇది జీడీపీకి సుమారు 3% అదనపు భారం. రక్షణ, పునర్నిర్మాణ వ్యయాలు, భద్రతా వ్యయం పెరుగుదల మొదలైన వాటిని సమర్థవంతంగా నిర్వహించే దిశగా ప్లాన్ ఉండాలి, దీనికి ముందస్తుగా బడ్జెట్ సిద్ధం చేయాలి, అవసరమైన చోట పెట్టుబడులు మళ్లించాలి.

దాడి జరిగితే..

దేశంలో ప్రజల సహనం, మద్దతు, దేశభక్తిని నిలబెట్టుకునేలా ప్రభుత్వాలు ముందస్తుగా కార్యక్రమాలు రూపొందించాలి. విపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించేలా సమన్వయం కావాలి. దేశీయంగా మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రజలను జాగ్రత చేయాలి. రేషన్ పంపిణీ, విద్యుత్, నీటి సరఫరాలపై ముందస్తు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. యుద్ధ ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఇతర ప్రాంతాలకు సురక్షితంగా తరలించేందుకు ప్లాన్లు సిద్ధం చేయాలి. రేషన్ పంపిణీ వ్యవస్థ, వైద్య సేవలు, ప్రజల గమనికల కోసం ప్రత్యేక చర్యలు (జనరల్ మొబిలైజేషన్ ప్లాన్) సిద్ధంగా ఉండాలి. యుద్ధ సమయంలో నగరాలు, పరిశ్రమలు, విద్యుత్, నీటి సరఫరాలపై దాడులు జరిగితే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండాలి. సరిహద్దు రక్షణను బలపరచాలి. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) ద్వారా ముమ్మరంగా ఆక్రమణ ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రత్యేక దళాల్ని ఉగ్రవాద మౌలిక కేంద్రాలపై దాడులకు సిద్ధం చేయాలి.

యుద్ధం తర్వాత వ్యూహం ముఖ్యం!

విజయం సాధించిన తర్వాత కూడా పరిసర దేశాల్లో విధేయ ప్రభుత్వాలు ఏర్పరచడం, శాంతి నిలుపుదల దళాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. లేకపోతే శూన్యతలో తిరిగి ఉగ్రవాద సంస్థలు, మిలిటెంట్లు విస్తరిస్తారు. పాకిస్తాన్ మిలిటరీ లేదా ఉగ్రవాద తిరుగుబాట్లు, పీఓకేలో స్వతంత్ర ఉగ్ర దళాల తిరుగుబాట్లు, పాక్ మిలిటరీ ఎత్తుగడలు తట్టుకోవడానికి ముందస్తు చర్యలు అవసరం. చైనా పాక్‌కు మద్దతుగా ముట్టడి చర్యలు తీసుకుంటే, ద్విపక్ష సంబంధాలు మరింత క్షీణించవచ్చు. ఆ ప్రమాదాన్ని తట్టుకోగల సన్నద్ధత ఉండాలి. యుద్ధం కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని, మందగించిన వృద్ధిని తిరిగి నిలబెట్టుకోవడానికి, ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడుల పునర్నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అవసరం.

డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీ.

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.

85010 61659

Next Story