నేరం జరిగితే.. వేళ్లన్నీ దళితులవైపేనా?

by Ravi |   (  Updated:2025-08-07 01:00:51  IST  )

ఆడుతూ పాడుతూ పెరిగే బాల్యం కసాయిల చేతిలో బలైతే.. అమాయక దళిత, గిరిజనులేమో ఆధిపత్య సమాజం

నేరం జరిగితే.. వేళ్లన్నీ దళితులవైపేనా?
X

ఆడుతూ పాడుతూ పెరిగే బాల్యం కసాయిల చేతిలో బలైతే.. అమాయక దళిత, గిరిజనులేమో ఆధిపత్య సమాజం, చట్టాల చేతిలో బలవుతున్న సంఘటనలు కనబడుతున్నాయి. పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వారి అమాయకత్వం కారణమైతే.. దళితులపై జరుగుతున్న దాడులకు వారి సామాజిక వెనుకబాటుతనం, బలహీనతలు కారణమవుతున్నాయి. పగ ప్రతీకారాలు, వ్యక్తిగత కక్షలు, డబ్బుల కోసం చిన్నారులను దుండగులు హతమార్చుతున్నారు. తల్లిదండ్రులకు గుండె కోతను మిగుల్చుతున్నారు. సమాజంలో నేడు అటు పసిపిల్లలపై, ఇటు దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలు సమాజంలో మాయని మచ్చలుగా మిగులుతున్నాయి.

ఇటీవల జగిత్యాల జిల్లా, కోరుట్ల పట్టణంలోని స్థానిక ఆదర్శ నగర్‌ కాలనీలో హితీక్ష అనే ఐదు సంవత్సరాల పాప హత్యనే ఇందుకు నిదర్శనం. సాయంత్రం పాఠశాల అనంతరం ఇంటికి వచ్చి ఆడుకునేందుకు బయటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు పాప ఇంటి చుట్టుపక్కల వెతికారు. ఆ ఇంటి పక్కనే నివసిస్తున్న విజయ్‌ అనే దళిత వ్యక్తి ఇంటి ఆవరణలోని స్నానాల గదిలో బాలిక విగత జీవిగా కనిపించింది. ఈ సంఘటనలో మెజార్టీ మీడియా, సామాన్య జనం, రాజకీయ నాయకులు, సామాజిక మాధ్యమాల్లో విజయ్‌ని నిందితుడిగా అనుమానించారు. ఈ దారుణ ఘాతుకానికి ఒడిగట్టిన వాడిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ హత్య వెనుక అసలు కారణాలను జగిత్యాల ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేయగా ఆ పాప సొంత చిన్నమ్మే నేరస్తురాలని తేలింది.

ఎక్కడ నేరం జరిగినా..

ఈ విషయంలో కోర్టు తీర్పులు ఏ రకంగానైనా రావచ్చు. కానీ క్షేత్ర స్థాయిలో సమాజం మాత్రం దళితులను దోషులుగా చిత్రీకరిస్తోంది. దళితుల సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక నేపథ్యం కారణంగా సమాజం నేరగాళ్లుగా చిత్రీకరిస్తున్నట్లు ఈ కేసులో స్పష్టం అవుతుంది. వాస్తవంగా విజయ్ అనే దళితుడు తాగుడుకు బానిసయ్యాడు. ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు. అతడికి పెళ్లయినా భార్య, కుమార్తె వదిలివెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. ఈ నెపంతో అందరు అతడే హత్యకు పాల్పడ్డారని ఆరోపణ చేశారు. కానీ పోలీసుల దర్యాప్తు అనంతరం బాలిక పిన్ని గొంతు కోసి హత్య చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికీ ఎక్కడైనా నేరం లేదా హత్య జరిగితే అగ్రవర్ణ సమాజం, పోలీసు వ్యవస్థ మొదట అమాయక దళితులను నేరస్తులుగా చూస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఈ సమాజం కూడా వారినే వేలెత్తి చూపుతుంది. మెజార్టీ పోలీస్ కేసులు, కోర్టు శిక్షలకు దళితులే బలౌతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

సమాజ దృష్టికోణం మారాలి!

వేల సంవత్సరాల నుంచి దళితులను పేదరికం, అస్పృశ్యత, అంటరానితనం వేధిస్తోంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ వీరు ఆత్మగౌరవంతో బతకలేపోతున్నారు. కుల వివక్షతో కనీస మానవ హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఇంకా దళితులపై అమానవీయ దాడులు, పరువు హత్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కుట్ర పూరితంగా అగ్రకులాలు మరో కులంపై ఎగదోస్తూ నేరస్తులను చేస్తున్నారు. కొన్నిసార్లు వ్యక్తిగత పగతో మూక దాడులకు పాల్పడుతున్నారు. అయితే గ్రామాల్లో ఎలాంటి దాడులు జరిగినా పోలీసులు మొదట దళితుల్ని విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లలో చిత్రహింసలకు గురిచేస్తూ నేరాన్ని ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తూ వాళ్ల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నారు. ఒకానొక దశలో ఎలాంటి విచారణ లేకుండానే వారిపై నేర ముద్ర వేస్తున్నారు. గతంలో ఇలాంటి ఆరోపణలు, అనుమానాలు రాగానే విచారణ జరగకుండానే దళితులను ఎన్‌కౌంటర్‌లో చంపిన సందర్భాలున్నాయి.

అమాయకులు.. నేరస్తులు కాకూడదంటే

మనదేశంలో న్యాయం జరగాలంటే కులం, రాజకీయ నేపథ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయానికి విరుద్ధం. ఈ క్రమంలో దళితుల పట్ల సమాజ దృక్పథం మారాల్సిన అవసరం ఉంది. నేరం జరిగినప్పుడు దళితులపై ఆరోపణలు వస్తే పోలీసులు జాగ్రత్తగా దర్యాప్తు చేయాలి. లేదంటే అమాయక దళితులు నేరస్తులయ్యే అవకాశం ఉందని కోరుట్ల బాలిక హత్య ఉదంతం తెలుపుతుంది. ఇక్కడ పోలీసుల అప్రమత్తతే ఒక దళిత కుటుంబాన్ని కాపాడింది. కావున ప్రజల ఆరోపణలు, భావోద్వేగాలకు, ఒత్తిడికి తావు లేకుండా పోలీసులు శాస్త్రీయంగా విచారణ జరిపి నిందితులను తేల్చాలి. దళిత, గిరిజనుల పట్ల కొనసాగుతున్న వివక్షపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే వారి సాధికారతకు బీజం పడుతుంది.

సంపతి రమేష్ మహారాజ్

79895 78428

Next Story