- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలూచ్ తుమ్మితే... భారత్‌పై నిందలా..?
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) నిర్వహించిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) నిర్వహించిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ దాడి తీవ్ర దుష్పరిణామాలను మిగిల్చింది. ఈ ఘటనలో 26 మంది, ప్రధానంగా భద్రతా సిబ్బంది, ప్రాణాలు కోల్పోయారు. మిలిటెంట్లు 400 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకుని ఎంచుకుని కొందరిని కాల్చివేశారు. పాకిస్తాన్ సైన్యం 33 మంది మిలిటెంట్లను హతమార్చి, 354 మందిని రక్షించినట్లు తెలిపింది. ఈ దాడికి బీఎల్ఏ పూర్తిగా బాధ్యత వహించినా, పాకిస్తాన్ ప్రభుత్వం అప్పటికప్పుడే భారత్‌పై నింద మోపడం ఆసక్తికరమైన పరిణామంగా మారింది.
పాకిస్తాన్ ఆరోపణల ప్రకారం, ఈ దాడికి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న మిలిటెంట్ గ్రూపులకు, భారతదేశానికి సంబంధం ఉందని చెబుతోంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడి వెనుక భారత హస్తం ఉందంటూ తక్షణమే ప్రకటన చేసింది. అయితే, భారత్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ “పాకిస్తాన్ తన అంతర్గత విఫలతలను కప్పిపుచ్చుకోవడానికి భారత్‌ను దోషిగా చూపే ధోరణిని కొనసాగిస్తోంది. ఉగ్రవాదం మూలం ఎక్కడుంది అనేది ప్రపంచానికి స్పష్టంగా తెలుసు” అని వ్యాఖ్యానించారు.
బలూచీ స్వేచ్ఛకోసం దశాబ్దాల పోరు..
బలూచిస్తాన్‌లో గత కొన్ని దశాబ్దాలుగా స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం కొనసాగుతోంది. ప్రకృతి సంపదలతో సుసంపన్నమైన ఈ ప్రాంత ప్రజలు మాత్రం తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. బలూచీ విప్లవకారులు తమ హక్కుల కోసం పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ పోరాటంలో కీలకంగా ఉండగా, అమెరికా సహా పాకిస్తాన్ కూడా ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. అయితే, ఈ సంస్థను భారతదేశం మద్దతు ఇస్తోందనే ఆరోపణలను నిర్ధారించే ఎలాంటి ఆధారాలను పాకిస్తాన్ ఇప్పటివరకు సమర్పించలేదు. భారతదేశంపై ఇలాంటి ఆరోపణలు చేయడం పాకిస్తాన్‌కు కొత్తేమీ కాదు. గతంలోనూ ఉగ్ర దాడులు, లోపలి రాజకీయ సంక్షోభాల సందర్భంలో, పాకిస్తాన్ తన పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్‌ను లక్ష్యంగా చేసుకుంది. కానీ, అంతర్జా తీయంగా ఈ ఆరోపణలు పట్టుబడడం లేదు. ముఖ్యంగా, బీఎల్ఏ వంటి సంస్థలు తమ ఉద్యమాన్ని బహిరంగంగా ప్రకటిస్తున్న సమయంలో, భారత్ మద్దతు ఇస్తోందని చెప్పడం భిన్న దృష్టికోణాలను రేకెత్తిస్తోంది.
సైనిక బలాన్నే నమ్మితే కష్టం
అంతర్జాతీయ సమాజం ఈ దాడిని ఖండించడమే కాకుండా, పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తోంది. పాకిస్తాన్ ఆత్మపరిశీలన చేసుకొని, బలూచీ ప్రజల అసంతృప్తిని అర్థం చేసుకోవడం, వారికి సముచిత న్యాయం చేయడం అత్యవసరం. బలూచిస్తాన్‌లోని విప్లవ పోరాటాన్ని నియంత్రించాలంటే, కేవలం సైనిక బలాన్ని మాత్రమే నమ్మడం కాకుండా, రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నించాలి. భారత్, పాకిస్తాన్ లాంటి పరస్పర ప్రత్యర్థి దేశాల మధ్య ఇలాంటి ఆరోపణలు సహజంగా మారిపోతున్నాయి. కానీ, ఇలాంటి నిరాధార ఆరోపణలు రెండు దేశాల మధ్య మరింత అసమ్మతిని పెంచుతాయి. బలూచిస్తాన్‌లో బలవంతంగా అణచి వేయడం కాకుండా, న్యాయమైన విధానాలను అవలంబించి, ప్రాంతీయ స్థిరత్వానికి పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
నిరాధార ఆరోపణలు నిష్ప్రయోజనకరం
ఈ రైలు దాడి పాకిస్తాన్‌లోని భద్రతా వ్యవస్థలోని లోపాలను, అంతర్గత విధానాల వైఫల్యాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. ఒకవేళ పాకిస్తాన్ తన అంతర్గత విభజనలను సరిచేసుకునే దిశగా పయనిస్తే, ఈ ప్రాంతానికి నిజమైన శాంతి, స్థిరత్వం కలుగుతుంది. భారత దేశంపై నిరాధార ఆరోపణలు చేయడం వల్ల పాకిస్తాన్ తన ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తప్పించుకుంటోంది. కానీ, దీని ద్వారా అసలు సమస్యలు పరిష్కారం కావు. పాకిస్తాన్ తన అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవాలని, అంతర్జాతీయ వేదికలపై నిరాధార ఆరోపణలకు మారుపేరుగా మారకుండా ఉండాలని ఈ ఘటన మరోసారి స్పష్టంగా తెలియజేస్తోంది.
డాక్టర్ కోలాహలం రామ్ కిషోర్
98493 28496






