తెలంగాణలో విగ్రహ రాజకీయాలు.. ఎవరి వారసత్వానికి ప్రాధాన్యం?

by Ravi |   (  Updated:2025-12-07 01:00:40  IST  )

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా, విగ్రహాల చుట్టూ ప్రాంతీయత, సాంస్కృతిక ప్రాతినిధిత్వంపై వాదనలు ఇంకా ముగియ లేదు. ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు భాష, యాస, సంస్కృతికి

తెలంగాణలో విగ్రహ రాజకీయాలు.. ఎవరి వారసత్వానికి ప్రాధాన్యం?
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా, విగ్రహాల చుట్టూ ప్రాంతీయత, సాంస్కృతిక ప్రాతినిధిత్వంపై వాదనలు ఇంకా ముగియ లేదు. ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు భాష, యాస, సంస్కృతికి న్యాయం చేయాలన్న దృఢ సంకల్పమే మలి దశ తెలంగాణ ఉద్యమానికి పునాది. కానీ ఈ రోజు, అదే గడ్డపై ఆంధ్ర ప్రాంత ప్రముఖుల విగ్రహాల ప్రతిష్టాపన మళ్లీ చర్చకు దారి తీస్తోంది..

రోశయ్య, ఎన్టీఆర్, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి వ్యక్తుల విగ్రహాలు తెలంగాణలో ఎందుకు? రాష్ట్ర విభజన తర్వాత కూడా సాంస్కృతిక ప్రాధాన్యం ఎవరి చేతుల్లో ఉందన్న ప్రశ్న మళ్లీ ముందుకు వస్తోంది. ప్రాంతీయత పైన, కళల పైన కుల, వర్గ ఆధిపత్యం ఎంతగా ముద్ర వేసిందనే ప్రశ్నలు ఈ వివాదాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి..

రోశయ్య విగ్రహంతో మొదలయ్యి..

అనాడు తెలంగాణాలో ఇక్కడి ప్రముఖుల విగ్రహాలకు సరైన స్థానం ఇవ్వలేదని వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. అయినప్పటికీ ఈ గడ్డపై విగ్రహాల వివాదం మళ్లీ చర్చ మొదలైనది. కాంగ్రెస్ ప్రభుత్వం లక్డీకాపూల్‌లో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహం ఆవిష్క‌రించినప్పుడే తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయినా ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇప్పుడు రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు, మరోవైపు అమీర్‌పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతామని సీఏం, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతం వారి విగ్రహాలు ఏర్పాటు చేయడమేంటన్న ప్రశ్నలు ఇక్కడి ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. బాలసుబ్రమణ్యం సమైక్య వాదాన్ని కోరుకున్నారని అందుకే జయ జయహే తెలంగాణ పాటను పాడలేదని విమర్శ ఉంది. ఇదిలా ఉండగా కళాకారులకు కుల, ప్రాంతీయ భేదాలు అంటగట్టడం ఏంటని ఇరు రాష్ట్రాల కళాభిమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి విగ్రహాలు ఉండాలి? ఎవరు కళలకు కేంద్ర బిందువనేది చర్చించుకోవాల్సిన సందర్భం.

సాంస్కృతిక పునర్జీవనం కోసం..

ప్రతి జాతి తమ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, కళల వారసత్వాన్ని పునర్జీవింపచేసుకోవడానికి విగ్రహాలు పెట్టు కుంటారు. ఈ విగ్రహాలు పెట్టే సంస్కృతి బుద్ధుని కాలంలోనే వజ్రయాన శాఖ నుంచి మొదలైనది. ఆ తర్వాత అగ్రవర్ణాలు ఈ సంస్కృతిని అనుకరించాయి. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ క్రమంలో తెలుగు వాళ్లను ఏకం చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1980 దశకంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున, ట్యాంక్ బండ్ రోడ్డు వెంబడి తెలుగు వైతాళితుల విగ్రహాలను పెట్టారు. వీరంతా సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు. అయితే ఇందులో ప్రాంతీయ, కుల వివక్షత స్పష్టంగా ఉన్నది. అక్కడ పెట్టిన 33 విగ్రహాలలో 26 ఆంధ్రా వారివైతే, తెలంగాణలో వారివి కేవలం 7 మాత్రమే.. ఇవన్నీ అగ్రకులాల విగ్రహాలే కావడం గమనార్హం. అందుకే ఉద్యమ సమయంలో ఆ విగ్రహాల ధ్వంసం కూడా జరిగింది.

ఈ డిమాండ్ ఎందుకు చేయరు?

చారిత్రకంగా భారతీయ సాంస్కృతిక కళారూపాలు బహుజనుల నుంచి ఆవిర్భవించాయి. ముఖ్యంగా సంగీతం, పాటలకు, రంగస్థల నాటకాలకు వారే వారసులు.. క్రమ క్రమంగా అవి ఆధునికరించబడి సినిమా రంగంలోకి ప్రవేశించి పెద్ద మార్కెట్‌గా మారాయి. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమల్లో అగ్రకుల ఆధిపత్యం వలన బహుజన కళారూపాలు విధ్వంసం అయ్యాయి. బుర్రకథ, యక్షగానం, గంగిరెద్దుల ఆట, గోసంగి, ఒగ్గు కథ, ఇంద్రజాల కళ , బైండ్ల కథలు, గిరిజన నృత్యాలు వంటి కళారూపాలు అంతరించిపోయాయి. ఈ కళాకారులకు అసలైన గౌరవం దక్కాలి. ఇప్పుడు తెలంగాణలో పెట్టిన, పెట్టబోతున్న విగ్రహాలు ఆధిపత్య కులాలకు చెందినవాళ్లవే.. మరి వీళ్ల విగ్రహాలను వ్యతిరేకించే బహుజన మేధావులు ప్రత్యామ్నాయంగా సాంస్కృతిక అస్తిత్వానికి కీలక పాత్ర పోషించిన బహుజన కవులు, కళాకారులు విగ్రహాలు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయరు?

ఈ దేశంలో అన్ని రంగాల్లో కుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇది కళలకు కూడా అతీతం కాదు. మరి కళలకు కుల, ప్రాంతీయత అంటగట్టమేంటనే వాళ్లు అణగారిన కులాలు కళకారులకు ఏ మేరకు గౌరవం ఇచ్చారనే ప్రశ్న వేసుకోవాలి. తెలంగాణ వచ్చాక గూడ అంజన్న, గద్దర్, అందెశ్రీ తో పాటు ఎంతోమంది బహుజన కవులు, కళాకారులకు పరాభావమే ఎదురైంది. అందుకే ఇకపై ప్రభుత్వాలు అధికారికంగా విగ్రహాలు పెట్టదలుచుకుంటే ప్రాంతాలకతీతంగా అట్టడుగు దళిత బహుజన కళాకారుల విగ్రహాలను ప్రతిష్టించాలి.

-సంపతి రమేష్ మహారాజ్

79885 78428

Next Story