Singareni: 102 యేండ్ల సింగరేణి

by Disha edit |
Singareni: 102 యేండ్ల సింగరేణి
X

సింగరేణిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త బొగ్గు బ్లాకులను కేటాయించకుంటే అభివృద్ధి, సంక్షేమం ప్రశ్నార్థకం అవుతాయనడంలో సందేహం లేదు. కేంద్రం 2021 అక్టోబర్ లో తెచ్చిన కొత్త చట్టంతో కలుగుతున్న భారీ నష్టం గురించి అందరికీ తెలియాలి. సింగరేణి లాభాలలో ఉంది నిజమే. సంస్థకు రావాల్సిన బకాయిలు వసూలు కాక క్యాష్ రిచ్ కంపెనీ కాలేక పోతున్నది. ప్రభుత్వాల నుంచి ఎలాగూ బడ్జెటరీ మద్దతు లేదు. కనీసం బకాయిలు కూడా చెల్లించకుంటే ఎట్లా? తెలంగాణ ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధి నిజాయితీతో కృషి చేయాలి. మన బొగ్గు బ్లాకులను మనం దక్కించుకోవాలి. లేదా ముందు తరాలు క్షమించవు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసారు. అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలి. చలో భాయ్ సింగరేణికో బచాలెంగే.

న్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి కార్మికుల, అధికారుల సమష్టి కృషితో నిలదొక్కుకున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి(singareni). ఇప్పుడు అది కేంద్రం విధానాల వలన ప్రైవేటీకరణకు గురికాకుండా ఉద్యమిస్తున్న త్యాగాల నల్ల నేల. 'మా బ్లాకులు మాకు కావాలని' భవిష్యత్ తరాలకోసం ఆరాట పడుతున్న నేల. 'నా బొగ్గు మీద నాకు మాత్రమే హక్కు ఉంది. తేరా జులుం క్యారే' అంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు(singareni labours), వారి కుటుంబ సభ్యులు ముందు వరుసలో నిలిచారు. తెలంగాణ కోసం 42 రోజులు సమ్మె చేసారు. నోయిడా దాకా సమ్మె ప్రభావం చూపారు. సీఎం కేసీఆర్ అరెస్టుకు స్పందించి విధులు బహిష్కరించారు. శ్రీకాంతాచారి(srikantha chary) ఆత్మహత్య చేసుకుంటే తల్లడిల్లిపోయారు. అప్పుడూ పనులు మానేశారు. ఇపుడు భవిష్యత్ కోసం పోరాడుతున్నారు.

దేశంలోనే తొలి ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉన్నది. 1889లో ఉత్పత్తి ప్రారంభించిన సింగరేణికి 132 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1920 డిసెంబరు 23న 'సింగరేణి లిమిటెడ్' కంపెనీగా(singareni collieries company limited) మారింది. ఇందులో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. 1990 దశకంలో రెండుసార్లు బీఐఎఫ్ఆర్‌ లోనికి వెళ్లి దాదాపు ఖాయిలా జాబితాలో పడినా బయటకు వచ్చింది.

ఉనికిని కాపాడుకుంటూ

'సింగరేణి లిమిటెడ్' సంస్థగా మారి ఈ డిసెంబరు 23 నాటికి 102 సంవత్సరాలు. లిమిటెడ్ కంపెనీగా మారిన నాటి నుంచి ఆవిర్భావ దినోత్సవాన్ని లెక్కలోకి తీసుకున్నారు. బొగ్గు తవ్వకాలు ప్రారంభించిన 133 సంవత్సరాలలో 1,550 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. గడిచిన ఏడేండ్లలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత 450 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పతి చేసింది. అంటే, మొత్తం ఉత్పత్తిలో 22 శాతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిందేనని సగర్వంగా పేర్కొనవచ్చు. నష్టాల నుంచి బయటపడి 1998 నుంచి లాభాలలోకి వచ్చింది. 2001-02 నుంచి కార్మికులకు తన నికర లాభాల నుంచి కార్మికులకు వాటా బోనసు చెల్లిస్తున్నది. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలలో ఎక్కడా కూడా లాభాలలో వాటా బోనస్ ఉద్యోగులకు పంచి ఇస్తున్న సంస్థ లేదు.

సింగరేణిలో(singareni coal mines) మాత్రమే రెండు దశాబ్దాలుగా కార్మికులు లాభాల వాటా పొందుతున్నారు. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ కూడా అనారోగ్యంగా ఉన్న కార్మికుల ఇన్ వ్యాలిడేషన్ అనంతరం రెండు సంవత్సరాల మిగులు సర్వీసు నిబంధనతో ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) ఆదేశం మేరకు కొనసాగిస్తున్నారు. కోల్ ఇండియాకు అదనంగా సింగరేణిలో పలు సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. కార్మికులకు ఇన్‌కం ట్యాక్స్ మాఫీ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేంద్రం నుంచి మాత్రం స్పందన లేదు. కనీసం స్లాబ్ కూడా పెరగలేదు. తెలంగాణ రాకముందు సింగరేణిలో 12 వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉండగా, 118 శాతం వృద్ధితో ఇపుడది 26 వేల కోట్ల రూపాయలకు పెరిగింది. 2019లోనే 325 శాతం వృద్ధితో 11 వందల కోట్ల రూపాయలు లాభాలను సంస్థ గడించింది.

సంస్థ కెరీర్‌లో అన్నీ రికార్డులే

ఇంతటి వృద్ధి రేటును దేశంలోని ఏ ఇతర బొగ్గు సంస్థ కానీ, ప్రభుత్వరంగ సంస్థ కానీ సాధించిన దాఖలా లేదు. సింగరేణి చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డులతో దూసుకువెళ్తున్నది. ఇతర రాష్ట్రాలలోనూ బొగ్గుగనులను తీసుకొని తవ్వకాలకు సిద్ధమవుతున్నది. ఒడిశాలోని నైనీ బ్లాక్(odisha nine block)నుంచి యేటా పది మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2023 జనవరిలో ఇక్కడ నుంచి ఉత్పత్తి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని జీవిత కాలం 35 యేండ్లు కాగా, యేటా రూ.1000 కోట్ల దాకా లాభాలు ఉంటాయి. యేటా రూ. 400 కోట్ల దాకా ఒడిశాకు రెవెన్యూ వస్తుంది.

సింగరేణి స్వంతంగా మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేసింది. ఇది 30 శాతం రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీరుస్తున్నది. దీంతో సంస్థకు యేటా రూ.400 కోట్ల లాభాలు వస్తున్నాయి. 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సగం వరకు ఉత్పత్తి జరుగుతోంది. మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేసారు.

ఉపాధి కల్పనలోనూ ముందంజే

గడిచిన ఆరు సంవత్సరాలలో యువతకు ఎనిమిది వేల ఉద్యోగాలను కల్పించారు. ఉద్యోగులు ఇండ్లు నిర్మించుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం, ఏసీలు పెట్టుకునే అవకాశం కల్పించారు. సింగరేణి విస్తరించి ఉన్న జిల్లాలలో 2015 నుంచి ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్టుకు రూ.3500 కోట్ల రూపాయలు ఇచ్చారు. దీనితోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సింగరేణికి మరో 150 సంవత్సరాల భవిష్యత్ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో గోదావరి తీరంలో విస్తరించి ఉన్న సింగరేణి గుర్తించిన బొగ్గు నిక్షేపాలు పది వేల మిలియన్ టన్నులకు పైగా ఉన్నాయి. భద్రాచలాన్ని తాకుతూ చింతలపూడి ప్రాంతంలోనూ 18 బ్లాకులు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెంట్లు, పన్నులు, రాయల్టీల పేరిట యేటా ఆరువేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్న సింగరేణికి వేలంలో పాల్గొంటే తప్ప ఇప్పుడు కొత్త బ్లాకులు వచ్చే పరిస్థితి లేదు.

కోల్ ఇండియా దుస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ పరిస్థితులలో ఇటీవల సింగరేణి తవ్వాలని నిర్ణయించుకున్న ఆరు బొగ్గు బ్లాకులను ఉపసంహరించుకుంది. బొగ్గు బ్లాకుల కోసం గత యేడాది కార్మికులు 72 గంటల సమ్మె కూడా చేసారు. పార్లమెంటులో ఎంపీలు అడిగారు. కేంద్రం మాత్రం వేలంలో పాల్గొనాల్సిందే అంటున్నది. పోరు కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకుంటే తప్ప సంస్థ భవిష్యత్ ఇరకాటంలో పడుతుంది. సింగరేణి తెలంగాణకు గుండెకాయ లాంటిది. వేలాది మందికి ఉపాధి కల్పించే తల్లి లాంటిది. అలాంటి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

ప్రభుత్వాల సహకారం కావాలి

1998 నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణిలోనే గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి సింగరేణిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త బొగ్గు బ్లాకులను కేటాయించకుంటే అభివృద్ధి, సంక్షేమం ప్రశ్నార్థకం అవుతాయనడంలో సందేహం లేదు. కేంద్రం 2021 అక్టోబర్ లో తెచ్చిన కొత్త చట్టంతో కలుగుతున్న భారీ నష్టం గురించి అందరికీ తెలియాలి. సింగరేణి లాభాలలో ఉంది నిజమే. సంస్థకు రావాల్సిన బకాయిలు వసూలు కాక క్యాష్ రిచ్ కంపెనీ కాలేక పోతున్నది.

ప్రభుత్వాల నుంచి ఎలాగూ బడ్జెటరీ మద్దతు లేదు. కనీసం బకాయిలు కూడా చెల్లించకుంటే ఎట్లా? తెలంగాణ ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధి నిజాయితీతో కృషి చేయాలి. మన బొగ్గు బ్లాకులను మనం దక్కించుకోవాలి. లేదా ముందు తరాలు క్షమించవు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసారు. అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలి. చలో భాయ్ సింగరేణికో బచాలెంగే.

(నేడు సింగరేణి 102వ ఆవిర్భావ దినోత్సవం)


ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672



Next Story

Most Viewed