తెలంగాణ సాయుధ పోరులో సింగరేణి పాత్ర ఎంతంటే?

by Disha edit |
తెలంగాణ సాయుధ పోరులో సింగరేణి పాత్ర ఎంతంటే?
X

ఏక కాలంలో గనుల విస్తరణ ప్రభావం గ్రామాల మీద పడింది. బ్రిటిష్‌వాడి కపట నీతి, నిజాం ఫ్యూడల్ దోపిడీ కలగలిసిపోయి ఒక ప్రణాళికాబద్ధ అణచివేత, నిర్భంధకాండ అమలు జరిగింది. సింగరేణి ఏర్పడిన మొదటి 50 యేండ్లు ఎలాంటి యూనియన్ కార్యకలాపాలు లేవు. భువనగిరి ఆంధ్ర మహాసభతో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగింది. తెలంగాణవ్యాప్తంగా ప్రతిఘటన పోరాటాలు వెల్లువెత్తాయి. క్రమంగా ఇది మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా విస్తరించింది. దీని ప్రభావం సింగరేణి మీద పడింది. అప్పటి వరంగల్ జిల్లా సీపీఐ కార్యదర్శి సర్వదేవబట్ల రామనాథం మార్గదర్శనంలో దేవూరి శేషగిరి‌రావు నాయకత్వంలో 1942లో దళం ఏర్పడింది. 1945లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసారు.

తెలంగాణ సాయుధపోరాటంలో సింగరేణీయుల పాత్ర కీలకం. ఈ పోరులో వంద మంది దాకా కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు. వేలాది మంది జైలు పాలయ్యారు. సింగరేణి నుంచే ఏర్పడిన తొలి దళానికి దేవూరి శేషగిరి నాయకత్వం వహించారు. ఆయన అమరత్వం అనంతరం ప్రసాదరావు నాయకత్వం వహించారు. తన పేరుకు ముందు గిరి పెట్టుకుని గిరిప్రసాద్‌గా మారారు. ఈయన ఉమ్మడి ఏపీ సీపీఐ కార్యదర్శిగానూ పని చేశారు. శేషగిరి అమరత్వం అనంతరం ఆ దళాన్ని గిరిదళం అని పిలిచేవారు.

నల్ల నేలలోని మొదటి తరం నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసింది. మూడు తరాలుగా కార్మికులు తమ అస్తిత్వం కోసం పోరాటాలు చేసారు. తమ హక్కుల కోసం, విముక్తి కోసం, తమ నేలమీద తాము మనుషుల వలె నిలబడటం కోసం, అణచివేతలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసారు. 1889లో నిజాం కాలంలో అవతరించిన సింగరేణి నిజాం పారిశ్రామిక అవసరాలకు ముడి సరుకుగా బొగ్గునే కాదు, ఒక నూతన పారిశ్రామిక సంస్కృతి, సాంప్రదాయాలను అందించింది. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వ దశ లేదా సింగరేణిలో నిజాం ఏలుబడి ఉన్న కాలం, రెండోది ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కాలం నుంచి తెలంగాణ ఏర్పడే వరకు పరిస్థితి.

అవసరాలను గుర్తించి

పారిశ్రామిక ప్రగతికి ముడి సరుకును అందించే బొగ్గు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తించడం వలననే బ్రిటిష్ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ దక్కన్ కంపెనీ నుంచి మెజారిటీ షేర్లను నిజాం కొనుగోలు చేశారు. దేశంలోనే మొదటి ప్రభుత్వ రంగ సంస్థ గా సింగరేణికి ఖ్యాతి తెచ్చిపెట్టారు. నిజాం ఎంతటి నిరంకుశ, ఫ్యూడల్ రాజు అయినా తన స్టేట్ అవసరాలకు భంగం కలిగించలేదు. నిజాం స్టేట్‌కు పరిమితంగానే బొగ్గు తీసారు. సంస్థానంలోని రైల్వే, రోడ్ ట్రాన్స్‌పోర్ట్, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పొగాకు, వస్త్ర, సిమెంట్ పరిశ్రమల అవసరాలను ఇది తీర్చింది. ఈ సమయంలోనే దొరలు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేల దోపిడీ, దౌర్జన్యాలు తీవ్రంగా ఉండేవి. 'నీ బాంచెన్ కాల్మొక్త' అంటూ ప్రజలు అణిగిమణిగి ఉండేది. దొరల దోపిడీ, పీడనలను భరించలేక పారిపోయి వచ్చిన వారికి సింగరేణి ఉపాధి కల్పించి అక్కున చేర్చుకునేది.

బొగ్గు గనులలోనూ పని పరిస్థితులు అధ్వానంగా ఉన్నప్పటికీ, ఊరిలో దొరతనం భరించలేని వారిని సింగరేణి ఆకర్షించింది. నిజాం స్టేట్‌లోని ఇతర పారిశ్రామిక ప్రాంతాల కన్నా ఎక్కువగా బొగ్గు గనుల ప్రాంతాలకే వలసలు పెరిగాయి. మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించే బ్రిటిష్ అధికారుల పెట్టుబడిదారి స్వభావం కారణంగా నూతన పారిశ్రామిక సంస్కృతికి అంకురార్పణ జరిగింది. ఇదే తదనంతర కాలంలో కార్మికవర్గ చైతన్యానికి నాంది పలికింది.

నిరంకుశాన్ని ఎదిరించి

ఏక కాలంలో గనుల విస్తరణ ప్రభావం గ్రామాల మీద పడింది. బ్రిటిష్‌వాడి కపట నీతి, నిజాం ఫ్యూడల్ దోపిడీ కలగలిసిపోయి ఒక ప్రణాళికాబద్ధ అణచివేత, నిర్బంధకాండ అమలు జరిగింది. సింగరేణి ఏర్పడిన మొదటి 50 యేండ్లు ఎలాంటి యూనియన్ కార్యకలాపాలు లేవు. భువనగిరి ఆంధ్ర మహాసభతో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగింది. తెలంగాణవ్యాప్తంగా ప్రతిఘటన పోరాటాలు వెల్లువెత్తాయి. క్రమంగా ఇది మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా విస్తరించింది. దీని ప్రభావం సింగరేణి మీద పడింది. అప్పటి వరంగల్ జిల్లా సీపీఐ కార్యదర్శి సర్వదేవబట్ల రామనాథం మార్గదర్శనంలో దేవూరి శేషగిరి‌రావు నాయకత్వంలో 1942లో దళం ఏర్పడింది.

1945లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసారు. మొదటి మహాసభ అదే యేట జూన్ 16 న జరిగింది. ముగ్దుమ్ మొహియుద్దీన్, పర్స సత్యనారాయణ, రాజ్‌బహద్దూర్ గౌర్, కేఎల్ మహేంద్ర, మన బోతుల కొమురయ్య, జె.కుమారస్వామి, భాశెట్టి గంగారాం, కాసిపేట దుర్గయ్య లాంటి నేతలు సాయుధ పోరులో, సింగరేణి కార్మిక సంఘంలో పని చేసినవారే. బొగ్గు గనుల కార్మికుల జీవితాల బాగు కోసం కృషి చేస్తూనే, నిర్బంధాలను ఎదుర్కుంటూనే శేషగిరి కృష్ణా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో 30 మందితో ఏర్పడిన గెరిల్లా శిక్షణ శిబిరంలో చేరారు. అనంతరం అది 60 మందితో కూడిన రైతాంగ పోరాట దళంగా రూపు దిద్దుకుంది. దళం కమాండ‌ర్‌గా బొంబాయి ప్రసాద్ ఉండేవారు.

తుపాకులు గుంజుకుని

కృష్ణా జిల్లా నందిగామ వద్ద పరిటాల నిజాం పోలీస్ కేంద్రంపై ఈ దళం దాడి చేసి ఆయుధాలు గుంజుకుంది. ఈ 60 మంది దళంలో 18 మంది బొగ్గు గని కార్మికులే. గొల్ల ఆనందం, కొమురయ్య, కంగాల బుచ్చయ్య, పాపయ్య తదితర కార్మికులు ఉండేవారు. ఖమ్మం, మదిర, బోనకల్లు, నేల కొండపల్లి, కల్లూరు, వైరా క్యాంపుల నుంచి నుంచి గ్రామాల మీద రజాకారుల దాడులు జరిగేవి. దళం ఈ క్యాంపులను పథకం ప్రకారం ధ్వంసం చేసింది. రజాకారులను, భూస్వాములను మట్టుబెడుతూ, క్యాంపులను నేలకూల్చుతూనే బొగ్గు గని కార్మికులతో శేషగిరి సమావేశాలు పెట్టేవారు.

1948 మే 15న అనుచరులు ఒంటెద్దు రంగయ్య, పాపయ్యతో కలిసి తుమ్మలచెరువు అటవీ ప్రాంతం దాటుతుండగా నిజాం పోలీసులు దేవూరి శేషగిరి సహా ముగ్గురిని కాల్చి చంపారు. శేషగిరి పాతిన విప్లవ బీజం మొలకెత్తి వివిధ సమస్యల మీద నిర్భంధాల లోనూ పోరాటాలు, ఉద్యమాలు చేయడం నల్ల నేలకు నేర్పింది. తెలంగాణ సాధనలో గని కార్మికులు ముందు వరసలో నిలవడానికి స్ఫూర్తిని నింపింది.

Also Read : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమైక్యత దినోత్సవం జరపడం వెనుక కథేంటి?

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223



Next Story

Most Viewed