- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతలాకుతలమవుతున్న హైదరాబాద్
తెలంగాణాలో ఆకాశానికి చిల్లులు పడినట్లుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. హైదరాబాద్‌లోని

తెలంగాణాలో ఆకాశానికి చిల్లులు పడినట్లుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. హైదరాబాద్‌లోని రోడ్లు ఒక్కసారిగా చెరువులను తలపించినట్లుగా, లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి, మృత్యు కుహరాలుగా మారి గ్రేటర్‌లోని నాలాలన్నీ వరదనీటితో మునిగిపోయాయి. అన్ని రహదారులు ట్రాఫిక్ జామ్‌తో కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితులు భారీ వర్షం వచ్చినప్పుడల్లా ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితి ప్రకృతి సిద్ధమైనప్పటీకి, దీనిలో మానవ తప్పిదాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉన్నాయి.
కాలం చెల్లిన డ్రైనేజీ కారణంగా..
హైదరాబాద్‌లో కాలం చెల్లిన డ్రైనేజీ వ్యవస్థ, ఫలితంగా నగరంలో వందల సంఖ్యలో మ్యాన్ హోళ్లు పొంగి పొర్లుతున్నాయి. ఇక రహదారులకు ఇరు ప్రక్కల కాలువలు లేకపోవడం వాన నీటి గుంతలు నిర్మించకపోవడం, నగరంలో చెరువులు, వృక్షాలు ఉండే ప్రాంతాలు రోజురోజుకు తక్కువ అవడం, భూమిలోకి వాన నీరు ఇంకిపోయే చిత్తడి నేలలు లేకపోవడం, అరకొర సిబ్బందితో పాటు నిధులు లేమితో పురపాలికలు, అధికారుల అలక్ష్యం, సమన్వయ లోపం, వరదకు సంబంధించి సరైన పర్యవేక్షణా వ్యవస్థ లేకపోవడం ఇందుకు కారణాలు..
లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు కట్టుకోకుండా..
జీహెచ్‌ఎంసీ పరిధిలో వరద నీటి కాలవల పొడవు 1302 కిలో మీటర్ల మేర ఉండగా, 390 కి.మీ. మేజర్ నాలా, మైనర్ డ్రైయిన్స్ 912 కి.మీ. మేర ఉన్నాయి. ఇక హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయ లోపం, నగరంలో రోడ్డుకు సమాంతరంగా నాలాలు ఉండడం వల్ల, వరద ముంచెత్తినప్పుడు ఓపెన్ నాలాలు కనబడక అందులో పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే హైడ్రా ముఖ్యంగా నాలాల ప్రమాదాలు జరిగే పాయింట్‌ను గుర్తించి ఆ ప్రదేశాలలో చైన్‌లింక్ మెష్, ప్రమాద నివారణకు హెచ్చరిక సైన్‌బోర్డు, ఫ్రీకాస్ట్ స్లాబ్స్ పనులు చేపట్టాలి. లోతట్టు ప్రాంతాలలో ఇళ్లు కట్టుకోవడానికి అధికారులు అనుమతించకూడదు. చెరువులు, కుంటలు, నాలాలు, కాలువలు, కబ్జాలకు గురికావడం ఆపాలి.
ప్రైవేట్ కంపెనీల సహకారంతోనైనా..
ప్రజల నిర్లక్ష్యంతో కాలువల్లో ప్లాస్టిక్, కొబ్బరి బోండాలతో పాటు ఇతర వ్యర్థాలు వేయడంతో వరద నీరు పొంగి పొర్లుతుంది. దీనిని ఆపాలి. ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా ముందుకు వస్తే నగర పరి స్థితిని మార్చవచ్చు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఉంటేనే పురపాలక సంస్థ ఇంటి పర్మిషన్‌లు ఇవ్వాలనే రూల్ తీసుకురావాలి. ప్రతి ఇంటిలో పచ్చదనాన్ని, మొక్కలను పెంచాలి. ఎక్కడికక్కడ వర్షం నీరు ఇంకిపోయే వ్యవస్థ లేక వర్షం నీరు రోడ్లమీదికి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీనిని సరిచేయాలి. ఇందుకోసం అవసరమైతే ప్రైవేట్ కంపెనీలు సీఎస్‌ఆర్ నిధుల ఖర్చుపెట్టేలా చూడాలి. ఇక ఈ ప్రాంతంలో గెలుపొందిన ప్రజా నాయకులు గెలుపే ప్రధాన ధ్యేయం కాకుండా, తమ హయంలో ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ, పేద ప్రజలకు కలకాలం గుర్తుండిపోయే మంచి పనులు చేస్తారని, దీనికి ప్రజలు సహకరించాలని ఆశిద్దాం.
భవిష్యత్‌లో ఇబ్బంది కలుగకుండా..
ఇక వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా నగరాల్లో ఏర్పడుతున్న హీట్ ఐలాండ్ కారణంగానే క్లౌడ్ బరస్ట్, మినీ క్లౌడ్ బరస్ట్ ఏర్పడుతుందని, దీనికి కండెక్టివ్ కరెంట్ తోడు కావడంతో సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుందని హైడ్రా కమిషనర్ తెలిపారు. కావున జలవనరులను, పార్కుల్ని, పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. రాజధానిలో 70 శాతం చెరువులు మాయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్న పేద వారికి సురక్షిత ప్రాంతాలలో ప్రభుత్వం ఆవాసం కల్పించి వారిని తరలించవలసిన ఆవశ్యకత ఉన్నది. భవిష్యత్‌లో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులూ లేకుండా దేశంలోనే హైదరాబాద్ ఒక ఆదర్శ నగరంగా ఉంటుందని ఆశిద్దాం!
-సి.పి.వి. ప్రసాద్
80196 08475






