బడి గంట మోగింది మార్కుల కోసం కాదు... మంచి మనుషుల కోసం..!

by Ravi |   (  Updated:2026-06-14 01:15:19  IST  )

మార్కుల సాధనకే కాకుండా మానవత్వం, సమానత్వం, సహానుభూతి, రాజ్యాంగ విలువలను పెంపొందించే విద్య అవసరమని ఈ వ్యాసం వివరిస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో మంచి మనుషులను తీర్చిదిద్దే పాఠశాలల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది.

బడి గంట మోగింది మార్కుల కోసం కాదు... మంచి మనుషుల కోసం..!
X

ఒక బడిని తెరవడం అంటే ఒక జైలును మూసేయడం. భారతదేశం మారాలంటే పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయితే సరిపోదు. ప్రతి ప్రైమరీ స్కూల్‌లో 'మానవత్వం' అనే సబ్జెక్ట్ పాస్ అవ్వాలి. అప్పుడే ' మనం ' అనే భావన బతుకుతుంది, 'పరాయి' అనే మాట చస్తుంది. ఈ విద్యా సంవత్సరం మన ప్రతిజ్ఞ ఒక్కటే.. "మార్కుల కోసం కాదు, మంచి మనుషుల కోసం బడికి పంపుతున్నాం."

పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న వేళ ఇది కేవలం తరగతి గదుల మొదలు కాదు. అంతరాలు లేని సమాజానికి పునాది పడే సమయం. కాబట్టి అంతరాలు చెరిపే విద్య అవసరం. విద్యార్థి, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు అనే మూడు స్తంభాల మధ్య సమన్వయం ఉంటేనే ఆ లక్ష్యం నెరవేరుతుంది.

త్రికోణ సమన్వయం.. విజయానికి బాట

పిల్లల చదువు బాధ్యత ఒక్కరిది కాదు. ముగ్గురి భాగస్వామ్యం అవసరం. విద్యార్థి 'అడిగితే తిడతారేమో' అనే భయం వీడాలి. సందేహం రావడం తెలివికి గుర్తు. క్రమ శిక్షణ, స్నేహభావం అలవర్చుకోవాలి. టీచర్‌ని, తోటి విద్యార్థుల్ని, సహాయక సిబ్బందిని గౌరవించడం నేర్చు కోవాలి. తల్లిదండ్రుల విషయానికి వస్తే 90% మార్కులే ప్రపంచం కాదు. పిల్లల ప్రయత్నం, నడవడిక చూడాలి. నెలకొ కసారి టీచర్‌తో మాట్లాడాలి. "మా పిల్లాడు ఎలా ఉన్నాడు?" అని అడగాలి. టీవీ, ఫోన్ పక్కనపెట్టి రోజూ ఒక గంట పిల్లలతో గడపాలి. ఇంటిని మొదటి బడి చేయాలి.

ఉపాధ్యాయులు పాఠం చెప్పే యంత్రాలు కాదు..

ఇకపోతే.. ఉపాధ్యాయులు పాఠం చెప్పే యంత్రాలు కాదు. ఆకలితో ఉన్న పిల్లాడికి అల్జీబ్రా ఎక్కదు. కంప్లైంట్ కోసమే కాదు, పిల్లాడి చిన్న గొప్పతనం కూడా తల్లిదండ్రులకు చెప్పాలి. ప్రతి పిల్లాడిలో ఒక ప్రత్యేకత ఉందని గుర్తించాలి. కొందరు నెమ్మదిగా నేర్చుకుంటారు, కొందరు ఆటపాటల్లో చురుకు. సమన్వయానికి 3 సూత్రాలు తప్పనిసరి. అవేమిటంటే.. నమ్మకం.. టీచర్ మీద తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల మీద టీచర్‌కు నమ్మకం ఉంచాలి. కమ్యూనికేషన్.. వాట్సాప్ గ్రూప్ హోమ్‌వర్క్ కోసమే కాదు, ఎదుగుదల కోసం ఉప యోగించాలి. గౌరవం.. పరస్పరం నిందించుకోవడం ఆపాలి.

అంతరాలు చెరపాలంటే..

మ్యాథ్స్, సైన్స్ వల్ల ఉద్యోగం వస్తుంది. కానీ మనిషిని మనిషిగా చూడాలంటే ఈ 5 విద్యలు కావాలి. సహానుభూతి విద్య: పక్క బెంచ్ వాడిని చూసి నవ్వడం కాదు, వాడి పరిస్థితి అర్థం చేసుకోవడం. 'నువ్వు వాడి స్థానంలో ఉంటే ఎలా?' అని ప్రశ్నించుకోవాలి. కులం, డబ్బు, రంగు వల్ల మనుషుల్ని తక్కువగా చూడకూడదని చిన్నప్పుడే చెప్పాలి. శ్రమ గౌరవం: డాక్టర్ గొప్ప, పారిశుధ్య కార్మికుడు తక్కువ అనే భావన పోవాలి. బడి ఊడ్చే అతన్ని, మిడ్ డే మీల్ వండే ఆయమ్మని పిల్లలు పలకరించాలి. ప్రతి పనికీ గౌరవం ఉందని ప్రత్యక్షంగా చూపించాలి. ప్రశ్నించే తత్వం: 'పుస్తకంలో ఉంది కాబట్టి కరెక్ట్' అని గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకు? ఏమిటి? ఎలా?అని ప్రశ్నించాలి. ఆలోచించే సమాజమే సమానత్వం వైపు నడుస్తుంది. జట్టుగా నేర్చుకోవడం: ఫస్ట్ ర్యాంక్ కోసం పోటీ కాదు, అందరూ కలిసి పైకి రావాలి. గ్రూప్ ప్రాజెక్ట్స్‌లో వెనుకబడిన వాడికి తెలిసినవాడు చెప్పాలి. నాకు వచ్చు కాదు, మనకు వచ్చు అనే మాట రావాలి. రాజ్యాంగ విలువలు: స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం పాఠాలు కాదు, బతుకులో పాటించాల్సిన విలువలు. రాజ్యాంగ ప్రవేశిక ప్రతి తరగతిలో ఉండాలి, ప్రతి రోజూ చర్చ జరగాలి.

బడి నుంచే భారతం మారాలి..

పాఠశాల అంటే గోడలు, బెంచీలు కాదు. దేశ భవిష్యత్తును తయారుచేసే ఫ్యాక్టరీ. ఇక్కడే కులం, మతం, ధనిక-పేద అనే అంతరాలకు మొదటి దెబ్బ పడాలి. ఒక పేద విద్యార్థి, ఒక ధనవంతుని కొడుకు ఒకే బెంచ్ మీద కూర్చుని పెన్సిల్ పంచుకున్నప్పుడు సమానత్వం జీవితంగా మారు తుంది. మిడ్ డే మీల్ ప్లేట్‌లో అన్నం కలిపి తినేటప్పుడు 'ఎక్కువ-తక్కువ' అనే ప్రశ్నే పుట్టదు. ఒకే గ్రౌండ్‌లో కబడ్డీ ఆడేటప్పుడు గెలిచేది 'నేను' కాదు, 'మనం' అవుతుంది. బడిలో నేర్చుకునే 'గుడ్ మార్నింగ్', 'థ్యాంక్ యూ', 'సారీ' అనే మాటలు మనిషిని సంస్కారవంతుడిని చేస్తాయి. తోటి విద్యార్థి పెన్ను పోతే వెతికి ఇవ్వడం, ఆకలితో ఉన్న స్నేహితుడితో బాక్స్ పంచుకోవడం - ఇవే రేపటి పౌరుడి లక్షణాలు.

విద్యార్థి కళ్లలో కనిపించే కలల్ని చదవాలి..

నేటి తరగతి గదిలో 'జై భీమ్' (జ్ఞానం)తో పాటు ' జై హింద్' కూడా ఒకే ఊపిరితో వినిపించాలి. హక్కులే కాదు, బాధ్యతలు కూడా వల్లె వేయించాలి. 'నా దేశం కోసం నేనేం చేశాను?' అని ప్రశ్నించుకునేలా పిల్లల్ని తయారు చేయాలి. ఉపాధ్యాయుడు పాఠం చెబితే సరిపోదు. విద్యార్థి కళ్లలో కనిపించే కలల్ని చదవాలి. ఆటో డ్రైవర్ కొడుకు డాక్టర్ అవ్వాలన్నా, రైతు కూతురు కలెక్టర్ అవ్వాలన్నా 'నువ్వు సాధించగలవు' అని భుజం తట్టాలి. ఆ నమ్మకమే రేపటి భారతాన్ని నిర్మిస్తుంది. అందుకే అంటారు - "ఒక బడిని తెరవడం అంటే ఒక జైలును మూసేయడం". భారతం మారాలంటే పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయితే సరిపోదు. ప్రతి ప్రైమరీ స్కూల్‌లో 'మానవత్వం' అనే సబ్జెక్ట్ పాస్ అవ్వాలి. అప్పుడే 'మనం' అనే భావన బతుకుతుంది, 'పరాయి' అనే మాట చస్తుంది. ఈ విద్యా సంవత్సరం మన ప్రతిజ్ఞ ఒక్కటే.. "మార్కుల కోసం కాదు, మంచి మనుషుల కోసం బడికి పంపుతున్నాం."

-దేవులపల్లి గిరిబాబు

ఉపాధ్యాయులు

91779 65653

Next Story