- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో : ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఘటన ప్రకంపనలు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ నుంచే తమకు మీనాక్షి నోటీసు వివరాలు అందాయంటున్న బీజేపీ నేతల కామెంట్లు హస్తం పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. మీనాక్షి నామినేషన్ ఆర్వో తిరస్కరించినప్పటి నుంచి ఈ అంశంపైన ఏఐసీసీ పెద్దలు కూడా సమాచారం సేకరిస్తున్నారనే టాక్ గాంధీభవన్‌లో వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ కీలక నేతలు, రాష్ట్ర నాయకులు పలు కోణాల్లో ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపి ఏఐసీసీ పెద్దలకు ఓ నివేదికను కూడా సమర్పించే అవకాశాలు ఉన్నాయని హస్తం వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కాగా నామినేషన్ తిరస్కరణ తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ గురువారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన అంశాన్ని ముఖ్య నేతలు ఆరా తీసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన సందర్భంలోనూ నామినేషన్ తిరస్కరణ అంశంపైన చర్చ జరిగిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
లీకువీరులున్నారా?
మరోవైపు టీపీసీసీ చీఫ్మహేశ్కుమార్ గౌడ్ ఢిల్లీలో పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీతో సమావేశం కాగా వీరి భేటీలో కూడా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం చర్చకు వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ తిరస్కరణ అంశంలో లీకు వీరులున్నారా? లేదా? అనే అంశాన్ని సీఎం సమగ్రంగా విచారిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. దీంతో పార్టీ ఈ అంశంపైన సీరియస్ దృష్టి పెట్టినట్టుగా అర్థం అవుతోందని హస్తం వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ సీటును అది సులభంగా గెలవగలిగిన సీటును పార్టీ కోల్పోవడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకున్నదన్న చర్చ పార్టీలో నడుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచే పార్టీ ఇన్‌చార్జికి వ్యతిరేకంగా నేతలు పనిచేయగలుగుతారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంత రహస్యంగా ఏ నేతకూడా పనిచేసే అవకాశాలు ఉండవని, కానీ, ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు జవాబు ఇవ్వాలంటే అంతర్గతంగా పార్టీలో దీనిపై సీరియస్ విచారణ జరపాలన్న వాదన కొందరు నేతలు వినిపిస్తున్నారు.
రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ..
మరోవైపు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు షాక్‌కు గురిచేసిందని, ఆమె రాష్ట్ర ఇన్‌చార్జిగా నియమితులైన దగ్గర నుంచి తెలంగాణలో పార్టీ కేడర్‌కు దగ్గరై, పార్టీ బలోపేతానికి కృషి చేశారని, ఆమెకు రాజ్యసభ సీటు దక్కకపోవడం తమను నిరాశకు గురి చేసిందని నేతలు అంటున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా.. మున్ముందు ఈ అంశంలో ఏదైనా సమాచారం బయటకు వస్తుందా?.. వస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సాగుతోంది.






