నిమ్స్, టిమ్స్, గాంధీ, ఉస్మానియాకు అంతర్జాతీయ బ్రాండింగ్.. గ్లోబల్ హెల్త్ హబ్‌గా హైదరాబాద్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-14 02:43:36  IST  )

హైదరాబాద్ నగరం అంతర్జాతీయ పటంలో గ్లోబల్ హెల్త్‌కేర్ హబ్‌గా శరవేగంగా దూసుకుపోతోంది.

నిమ్స్, టిమ్స్, గాంధీ, ఉస్మానియాకు అంతర్జాతీయ బ్రాండింగ్.. గ్లోబల్ హెల్త్ హబ్‌గా హైదరాబాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరం అంతర్జాతీయ పటంలో గ్లోబల్ హెల్త్‌కేర్ హబ్‌గా శరవేగంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ (పశ్చిమ ఆసియా) దేశాల నుంచి ఏటా వేలాదిమంది రోగులు నాణ్యమైన వైద్యం కోసం సిటీని ఎంచుకుంటున్నారు. ఐరోపా, అమెరికా వంటి పాశ్చాత్య దేశాలతో పోలిస్తే అత్యంత చౌకైన ధరలకే ఇక్కడి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రపంచ స్థాయి వైద్యం అందుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇప్పటివరకు కేవలం ప్రైవేటు రంగానికే పరిమితమైన ఈ మెడికల్ టూరిజం అవకాశాలను ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులకూ విస్తరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ దవాఖానాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తూ, విదేశీ రోగులను ఆకర్షించడం ద్వారా విదేశీ మారకద్రవ్యంతో ఆయా సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.

మెడికల్ టూరిజం కాపిటల్‌గా..

హైదరాబాద్‌ను గ్లోబల్ హెల్త్‌కేర్ డెస్టినేషన్‌గా మార్చే ప్రయత్నంలో భాగంగా త్వరలోనే ఒక అంతర్జాతీయ మెడికల్ టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సదస్సులో నిమ్స్, టిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న రోబోటిక్ సర్జరీలు, అత్యాధునిక ల్యాబ్‌లు, వైద్య సేవలను అంతర్జాతీయ ప్రతినిధులకు ప్రత్యక్షంగా చూపించి బ్రాండింగ్ చేయనున్నారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం కాపిటల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో విదేశీయులకు సైతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందించేందుకు వీలుగా అధ్యయనం చేసేందుకు టీజీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ ఉప్పల్, టీజీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ పి.గౌతమి, నిమ్స్ మాజీ డైరెక్టర్ డా. బీరప్ప సభ్యులుగా ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ మెడికల్ అండ్ వెల్‌నెస్ టూరిజం ప్రమోషన్ బోర్డుతో సమన్వయం చేసుకుంటూ ఈ కమిటీ నెలరోజుల్లోగా నివేదిక సమర్పించనుంది.

టిమ్స్ సనత్‌నగర్‌లో ఇంటర్నేషనల్ బ్లాక్..

ప్రభుత్వ పరిధిలో విదేశీ రోగులకు ప్రత్యేక సేవలు అందించేందుకు వీలుగా టిమ్స్ సనత్‌నగర్‌లో ఒక ప్రత్యేక ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం బ్లాక్ ఏర్పాటుపై ఈ కమిటీ ప్రధానంగా అధ్యయనం చేయనుంది. అలాగే విదేశాల నుంచి వచ్చే రోగులకు కమ్యూనికేషన్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్స్ సేవలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా దేశాల సంస్కృతి, రోగుల అలవాట్లకు అనుగుణంగా ప్రత్యేక ఆహారం, అటెండెంట్లకు వసతి సౌకర్యాలను కల్పించే అంశాలపై కమిటీ సిఫార్సులు చేయనుంది. సనత్‌నగర్ టిమ్స్‌లో విదేశీయులకు వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా ఓ బ్లాక్‌ను సిద్ధం చేస్తున్నారు. మొత్తం హాస్పిటల్‌లో కనీసం 5 నుంచి 10శాతం వరకు విదేశీయులకు వైద్యం అందించేందుకు కేటాయింపులు చేయాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ధరల విధానంపై కసరత్తు..

విదేశీ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు, ధరల విధానాన్ని తీసుకువచ్చేందుకు అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రుల కంటే తక్కువ ధరలకే, నాణ్యమైన శస్త్రచికిత్సల ప్యాకేజీలను రూపకల్పన చేయడం ద్వారా విదేశీయులను ఆకర్షించవచ్చని సర్కారు భావిస్తోంది. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల క్లినికల్ మౌలిక వసతుల మెరుగుదలకు, పరిశోధనలకు, సిబ్బంది ప్రోత్సాహకాలకు ఉపయోగించుకునే వీలుంటుంది.

మెడికల్ టూరిజం ముఖచిత్రం..

- భారతదేశానికి వైద్యం కోసం వచ్చే మొత్తం విదేశీ రోగులలో దాదాపు 25% నుంచి 30% మంది ఒక్క హైదరాబాద్‌కే వస్తున్నారు. వివిధ నివేదికల ప్రకారం.. ఏటా సగటున 1.2 లక్షల నుంచి 1.5 లక్షల మంది విదేశీ రోగులు (వారి సహాయకులతో కలిపి) చికిత్స నిమిత్తం ఇక్కడికే వస్తున్నారు.

- ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో తగినంత వైద్య మౌలిక వసతులు, నిపుణులైన డాక్టర్లు లేకపోవడంతో కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీలతోపాటు క్యాన్సర్ చికిత్స, బైపాస్ సర్జరీలు, మోకాళ్ల మార్పిడి, బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు, సంతానలేమి (ఐవీఎఫ్) సమస్యల కోసం ఇక్కడి కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

- ఐరోపా, అమెరికా దేశాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వైద్యఖర్చులు 60 నుంచి 80శాతం వరకు తక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు అమెరికాలో బైపాస్ సర్జరీకి రూ. 70 లక్షల వరకు ఖర్చవుతుండగా, ఇక్కడి కార్పొరేట్ హాస్పిటల్స్ రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల లోపు మాత్రమే చార్జి చేస్తున్నాయి. అలాగే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కు రూ. 8.3 లక్షల నుంచి రూ. 10.8 లక్షలు, లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌కు రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షలు, మోకాలి మార్పిడికి రూ. 3.3 లక్షల నుంచి రూ. 4.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి.

- చిన్నపాటి చికిత్సలు లేదా హెల్త్ ప్యాకేజీల కోసం వచ్చే విదేశీయులు సగటున రూ. 3 లక్షల నుంచి 4 లక్షలు ఖర్చు చేస్తుండగా.. మేజర్ సర్జరీలు (ట్రాన్స్‌ప్లాంట్, క్యాన్సర్) కోసం వచ్చేవారు ఒక్కొక్కరు సగటున రూ. 12 లక్షల నుంచి రూ. 33 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు.

- విదేశీ రోగుల చికిత్సల ద్వారానే హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులు ఏడాదికి రూ. 2,500 కోట్ల నుంచి రూ. 3,500 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ హాస్పిటల్స్ మొత్తం ఆదాయంలో 10 నుంచి 15శాతం విదేశీ రోగుల నుంచే వస్తుండటం గమనార్హం.

- మెడికల్ టూరిజం ద్వారా భారతదేశానికి లభిస్తున్న విదేశీ మారకద్రవ్యం ఏడాదికి దాదాపు రూ. 58వేల కోట్లు పైమాటే. ఇందులో హైదరాబాద్ వాటా అత్యంత కీలకంగా ఉంది.

- విదేశీయులు వైద్యం కోసం ఇక్కడికి రావడం వల్ల కేవలం ఆసుపత్రులకే కాకుండా హోటళ్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు, గెస్ట్ హౌస్‌ల వ్యాపారం, టాక్సీలు, లోకల్ క్యాబ్ డ్రైవర్లు, అరబిక్/ఫ్రెంచ్ భాషా ట్రాన్స్‌లేటర్స్, లోకల్ టూర్ గైడ్లు, ఫార్మసీలు, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ నడిపే స్థానిక ప్రజలకు భారీగా ఆర్థిక లబ్ధి చేకూరుతోంది.

Next Story