మానవ హక్కులు.. ప్రతి మనిషి జీవితానికి ప్రాణవాయువు

by Ravi |   (  Updated:2025-12-10 01:16:03  IST  )

మనిషి పుట్టిన క్షణం నుంచే అతడికి సహజంగా కొన్ని హక్కులు సమకూరుతాయి. అవే మానవ హక్కులు.. ఇవి ఎవరో ఇచ్చే వరాలు కావు, పాలకుల దయవల్ల లభించిన హక్కులు కావు.. మనిషి మనిషిగా జీవించడానికి అవసరమైన స్వేచ్ఛ, గౌరవం, భద్రత, సమానత్వం అవకాశాలు.

మానవ హక్కులు.. ప్రతి మనిషి జీవితానికి ప్రాణవాయువు
X

మనిషి పుట్టిన క్షణం నుంచే అతడికి సహజంగా కొన్ని హక్కులు సమకూరుతాయి. అవే మానవ హక్కులు.. ఇవి ఎవరో ఇచ్చే వరాలు కావు, పాలకుల దయవల్ల లభించిన హక్కులు కావు.. మనిషి మనిషిగా జీవించడానికి అవసరమైన స్వేచ్ఛ, గౌరవం, భద్రత, సమానత్వం అవకాశాలు. ఇవి లేకపోతే మనిషి జీవితం బానిసత్వంగా మారుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులకు అత్యున్నత స్థానం లభిస్తోంది.

మానవ హక్కులు అంటే కేవలం చట్టాల్లో మాత్రమే కనిపించే పదాలు కావు. అవి మనిషి జీవన విధానానికి ప్రాణాధారాలు.. జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, విద్య హక్కు, ఉపాధి హక్కు, ఆరోగ్యం పొందే హక్కు, సమానత్వం, వివక్ష రహిత జీవితం, న్యాయం పొందే హక్కు, సమాచారం తెలుసుకునే హక్కు ఇవన్నీ మానవ హక్కుల పరిధిలోకి వస్తాయి. ఈ హక్కులు జాతి, కులం, మతం, లింగం, భాష, ఆర్థిక స్థితి ఆధారంగా ఎవరికీ తగ్గించ‌లేనివి. ప్రతి మనిషికీ ఇవి సమానంగా వర్తిస్తాయి.

యుద్ధ బీభత్సం నుంచి హక్కుల పుట్టుక..

రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచం మానవ హక్కుల విలువను తీవ్రంగా గ్రహించింది. కోట్ల మందిని బలి తీసుకున్న యుద్ధాలు, అమానుష హింస, వర్ణ వివక్ష, బానిసత్వం వంటి దుర్ఘటనలు మానవత్వాన్ని కలచి వేశాయి. ఈ నేపథ్యంలోనే 1948లో ఐక్యరాజ్యసమితి ‘సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన’ను ప్రకటించింది. దీని ద్వారా ప్రపంచంలోని ప్రతి మనిషికి కొన్ని మౌలిక హక్కులు అంతర్జాతీయంగా గుర్తింపును పొందాయి. భారత‌దేశం కూడా అదే స్ఫూర్తితో రాజ్యాంగంలో మౌలిక హక్కులను పొందుపరిచింది. భారత రాజ్యాంగంలోని మూడో భాగం పౌరులకు సమానత్వం, స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, దోపిడీ నుండి రక్షణ, రాజ్యాంగ పరిహారాల హక్కు వంటి కీలక హక్కులను తెలియజేస్తోంది.

అమలు కాని హక్కులకు.. చట్టాలు ఎందుకు?

చట్టాలు ఉన్నాయని చెప్పుకుని మానవ హక్కులు సమాజంలో పూర్తిస్థాయిలో అమలవుతున్నాయా? అంటే స్పష్టంగా ‘లేదు’ అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మహిళలపై హింస, బాల కార్మిక వ్యవస్థ, కస్టడీ మరణాలు, రైతుల ఆత్మహత్యలు, దళితులపై దాడులు, గిరిజనుల భూములు లాక్కోవడం, వలస కార్మికుల దోపిడీ, మత విద్వేషాలు, భావప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు.. ఇవన్నీ నేటికీ మన కళ్ల ముందే జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలే.. ఈ మానవ హక్కులు ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల జీవితాల్లోకి రాలేదనే చేదు నిజాన్ని వెల్లడిస్తాయి.

హక్కులపై అవగాహనే చైతన్యం!

మానవ హక్కులను గురించి తెలుసుకోవడం ఒక్కటే సరిపోదు. వాటిని సరిగా సద్వినియోగం చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. హక్కుల గురించి అవగాహన ఉన్నప్పుడే మనిషి అన్యాయాన్ని ప్రశ్నించగలుగుతాడు. తనపై అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే హక్కు తనదేనని తెలిసిన వ్యక్తి భయపడడు. సమాచారం పొందే హక్కు గురించి తెలిసిన పౌరుడు ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించగలుగుతాడు. విద్య హక్కు గురించి అవగాహన ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపిస్తారు. ఈ విధంగా మానవ హక్కుల సద్వినియోగం వ్యక్తిని బలహీనుడిగా కాకుండా ధైర్యవంతుడిగా తయారు చేస్తుంది.

హక్కులకు హద్దులూ ఉంటాయ్!

అయితే హక్కుల వినియోగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నా హక్కులు ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించే స్థాయికి చేరకూడదు. మాట స్వేచ్ఛ పేరుతో ద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్ధాలను ప్రచారం చేయడం మానవ హక్కుల స్ఫూర్తికి విరుద్ధం. అందుకే హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని ప్రతి పౌరుడు గుర్తించాలి. నేను గౌరవంగా జీవించాలంటే, ఇతరులు కూడా గౌరవంగా జీవించే హక్కును గౌరవించాల్సిందే. మన సమాజంలో ఇప్పటికీ పెద్ద సమస్య ఏమిటంటే, చాలా మందికి తమకు ఎలాంటి హక్కులు ఉన్నాయో కూడా తెలియకపోవడం. ‘మనకు హక్కులు ఉంటాయా?’ అనే భావనతో జీవించే వారు ఇంకా లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ అజ్ఞానం వల్లనే వారు దోపిడీకి, వేధింపులకు, అన్యాయా లకు బలవుతున్నారు. అందుకే మానవ హక్కులపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం అత్యవసరం.

హక్కులు వ్యక్తిగత సమస్య కాదు..

మహిళల విషయంలో మానవ హక్కుల అవగాహన అత్యంత కీలకం. గృహ హింస చట్టం, వరకట్న నిరోధక చట్టం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం, ఆస్తి హక్కులపై సరైన అవగాహన ఉంటే మహిళలు తమ హక్కులను ధైర్యంగా వినియోగించగలుగుతారు.. అలాగే పిల్లల విషయంలో కూడా బాల కార్మిక వ్యవస్థ నేరమని, చిన్నా రులపై హింస శిక్షార్హమని, పిల్లలకు విద్య హక్కు ఉందని సమాజం మొత్తం తెలుసుకోవాలి. మానవ హక్కులు కేవలం వ్యక్తిగత సమస్యగా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి హక్కులు ఉల్లంఘించబడితే అది చివరికి మొత్తం సమాజంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఎవరి హక్కులు ఉల్లంఘిం చబడుతున్నా అది మనకే జరిగిందన్న భావనతో స్పందించే స్థితికి సమాజం ఎదగాలి.

మానవ జీవితానికి ప్రాణవాయువు..

మానవ హక్కులు మనిషి జీవితానికి ప్రాణవాయువులాంటివి. వాటిని తెలుసుకోవడం, సద్వినియోగం చేసు కోవడం, ఇతరుల హక్కులను గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యంగా మారాలి.. మానవ హక్కులపై అవగాహన లేకపోతే ఎంత బలమైన చట్టాలు ఉన్నా అవి ప్రజల జీవితాలను మార్చలేవు. హక్కుల గురించి తెలిసిన పౌరుడే అన్యాయానికి ఎదురు నిలబడగలడు. చైతన్యవంతమైన పౌరుడే సమాజంలో మార్పును తీసుకురాగలడు. అందుకే మానవ హక్కులు ప్రతి మనిషి జీవితంలో భాగమవ్వాలి. అప్పుడే నిజమైన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం ఈ దేశంలో పరిపుష్టమవుతాయి..

- జయప్రకాష్ రావు పి.

మానవ హక్కుల న్యాయవాది

83743 11172

Next Story