మనిషి తెలివి.. ఏ సాంకేతికతకూ లేదు!

by Ravi |   (  Updated:2025-06-21 00:46:11  IST  )

మనిషి బుద్ధిజీవి, సృజనకారుడు కూడా.. యంత్రానికి వేగం ఎక్కువ, ఖచ్చితత్వమూ ఎక్కువే.. మనిషిలోని సుగుణాల్ని

మనిషి తెలివి.. ఏ సాంకేతికతకూ లేదు!
X

మనిషి బుద్ధిజీవి, సృజనకారుడు కూడా.. యంత్రానికి వేగం ఎక్కువ, ఖచ్చితత్వమూ ఎక్కువే.. మనిషిలోని సుగుణాల్ని యంత్రానికి ఆపాదిస్తే వచ్చిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తనకు ఎదురైన అనుభవాలు, తనకున్న జ్ఞాపకాల ఆధారంగా మనిషి నిర్ణయాలు తీసుకుంటాడు.. కానీ యంత్రానికి అనుభవాలు జ్ఞాపకాలు ఉండవు. డేటానే సర్వస్వం. ఎంత డేటా ఇవ్వగలిగితే, అంత ఖచ్చితత్వం సాధ్యం. ఇక డీప్ లెర్నింగ్ టెక్నాలజీతో యంత్రాల విశ్లేషణ సామర్థ్యం బాగా పెరిగిపోయింది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్.. ఏ భాషనైనా చదివి అర్థం చేసుకునే శక్తినీ, ఏ గొంతునైనా విని విషయాన్ని ఆకళింపు చేసుకోగలిగే నైపుణ్యాన్ని ప్రసాదించింది. కంప్యూటర్ విజన్‌కు తోడు ఇంకో అడుగు ముందుకేసి ఏఐకి సహాయంగా కొత్త కొత్త టూల్స్ తయారు చేసుకుంది. ఇంకేముంది సాంకేతికత చేయలేని అద్భుతమంటూ ఉంటుందా?

ప్రయోజనమా.. ప్రమాదమా?

నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం ఎంతగానో పెరిగిపోతోంది! ప్రస్తుతం ప్రపంచానికి ఇది ప్రయోజనమనీ కొందరు, ప్రమాదమని ఇంకొందరు భయపెడుతున్నారు.. ఏఐ కొత్త అవకాశాలకు దారులు చూపుతున్న సాంకేతిక పరిజ్ఞానం. ఇది ఇప్పటికే పలు సంస్థలకు సులువుగా పనిచేసి పెడుతూ, చాలామంది ఉద్యోగాలకు ఎసరు పెడుతుందని పలువురు గ్రాడ్యుయేట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ తమ ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుందని, 70 శాతం మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. సీఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన శాంపిల్ సర్వేలో ఈ విషయం తేలింది. అలాగే మరికొందరేమో.. ఈ ఏఐ విషయంలో సానుకూల అభిప్రాయాన్ని వెల్లడించారు.. ఏఐ లేదా ఆటోమేషన్ టూల్స్‌లో నైపుణ్యం పొందడం ద్వారా తమ కెరీర్ అవకాశాలు మెరుగుపడటానికి దోహదం చేస్తుందని మరికొందరు అంటున్నారు. అయితే చాలామంది తాము ఏఐను ప్రభావవంతంగా ఉపయోగించగలమని విశ్వాసాన్ని వెల్లడించారు. సంబంధిత సాఫ్ట్ స్కిల్స్‌ను కలిగి ఉండటమే కాకుండా ఏఐ నైపుణ్యాలు కలిగి ఉంటే ఉద్యోగ మార్కెట్లో మంచి అవకాశాలు లభిస్తాయని 46 శాతం మంది విశ్వసిస్తున్నారు..

చట్టపరమైన ఇబ్బందులు వస్తే..

ఏఐ కొంతమందికి ఆందోళనను, మరికొంత మందికి కొత్త ఆశను కలిగిస్తున్నది. అయితే, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వినియోగించుకునే విధానాన్ని బట్టి దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయని నిపుణులు మేధావులు చెప్తున్నారు. ఏఐ రాకతో పలు టెక్ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయనీ, రాబోయే కాలంలో దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని ఇప్పటికే పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలనీ, ఏఐ విపరీత వినియోగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.. అందుకే దీనికి కొన్ని పరిమితులు అవసరం. సమాజం ఏఐ ప్రయోజనం, ఇబ్బందులూ రెండింటిని ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్నిసార్లు మేధోపరమైన సమస్యలు ఎదురు కావచ్చు, చట్టపరమైన తలనొప్పులు వచ్చినప్పుడు ఎవరిని బాధితుల్ని చేయాలనేది జవాబు లేని ప్రశ్న. ఈ కృత్రిమ మేధ అనే కాదు, ఏ పెను మార్పూ ఒంటరిగా రాదు. వస్తూ వస్తూ తన వెంట వివాదాలనూ, ప్రయోజనాలను మోసుకొస్తుంది. కొంత కాలానికి గొడవలు సద్దుమణుగుతాయి. మార్పు స్థిరపడిపోతుంది. ఏఐకి ఈ సూత్రమే వర్తిస్తోంది. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. మనిషిని మింగే శక్తి ఏ సాంకేతికతకూ లేదు.. మనిషే కోరి కోరి ఆ టెక్నాలజీ నోట్లో తలపెడితే తప్పించి!

మేకిరి దామోదర్,

95736 66650

Next Story