- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిన్నింటి 'వీసాలు' లెక్కబెడుతున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, హెచ్‌వన్-బి వీసా ఫీజుని ఒకేసారి ఆరు రెట్లు పెంచి వెంటనే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించడం భారతదేశంలో

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, హెచ్‌వన్-బి వీసా ఫీజుని ఒకేసారి ఆరు రెట్లు పెంచి వెంటనే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించడం భారతదేశంలో తీవ్ర ప్రకంపనలు రేపింది. అమెరికాలో ఉన్న కంపెనీలు ఆ దేశ పౌరులు కాని తమ ఉద్యోగుల్ని అక్కడ ఉండి పని చేసు కోడానికి ఉద్దేశించి ఇప్పించే పర్మిట్‌లే హెచ్‌వన్-బి వీసాలు.. అమెరికా వాటిని మూడు సంవత్సరాల వ్యవధికి ఇస్తుంది. తర్వాత అవసరమైతే ఇంకో మూడేళ్లు పెంచుతుంది. ఆ ఫీజు సంవత్సరానికి లక్ష డాలర్లు అంటే ఎనభై లక్షల రూపాయలుగా అధ్యక్షుడు పెంచినట్లు ప్రకటన మొదట వచ్చింది. తర్వాత అది సంవత్సరానికి కాదు, వన్ టైమ్ కట్టాల్సింది. అదీ కొత్త దరఖాస్తుదారులకే అని వివరణ రావడం కొంత ఊరటనిచ్చే విషయం. అయితే ట్రంప్ పెంచిన ఈ ఫీజుతో భారతదేశంలో మాత్రమే అలజడి మొదలైంది. ఎందుకంటే, ఆ తరహా వీసాదారుల్లో డెబ్భై శాతం మంది మన దేశం వారే.. అందులోనూ ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే.. అమెరికా దేశాన్ని తమ ఉద్యోగ క్షేత్రంగా ఆశించే యువత ఆశలపై ఇది నీళ్లు జల్లడమే. ప్రపంచీకరణ యుగంలో మేధో వలసల్ని ప్రోత్సహించడం, ఆకర్షించడం ద్వారా పలు దేశాల బుద్ధి జీవుల వల్ల అమెరికా ప్రగతి సాధించింది. ఇప్పుడు ఏదో పేరుతో వారిని దూరం చేసుకుంటోంది. నిపుణుల కోసం ఉద్దేశించిన విధానాలు, నైపుణ్యం అవసరం లేని వారు కూడా వాడుకోవడం వల్ల తమ పౌరుల్లో నిరుద్యోగం పెరిగిందని చెప్తోంది. వారి వల్ల తమ యువతకు, ప్రగతికి నష్టం వాటిల్లు తుందని శాపనార్థాలు పెడుతూ, సామాజిక వైముఖ్యాన్ని పెంచుతోంది. ఈ నిర్ణయం ఖచ్చితత్వంతో అమలైతే మాత్రం బహుళజాతి కంపెనీలు అమెరికా బయటకు తమ కార్యస్థలాల్ని మార్చుకోవడమో, లేదా అక్కడి స్థానికుల్ని నియమించుకోవడమో చేస్తాయి. ఏదైతేనేమి అది వారి ఇష్టం. అందుకే మన దేశం ఇతర దేశంపై ఆధారపడకుండా మన యువత శక్తిని సంపూర్ణంగా వాడుకొనేటట్లు తయారు కావాలి. ఆ దిశగా నూతన విధానాలు, దేశీయ పరిస్థితులను చక్కదిద్దాలి. రానున్న పాతికేళ్లు యువశక్తి మెండుగా ఉన్న మన దేశానికి ఎంతో కీలకం. విద్యావిధానం, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పనలపై దృష్టి పెడితే ప్రపంచ దేశాల అస్థిరపు విధానాల ప్రభావం తగ్గుతుంది.
-డా. డి.వి.జి. శంకరరావు,
94408 36931






