- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికసిత భారత్ ఆవిష్కరణ ఎలా?
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిం చాలనేది అందరి సంకల్పం. అదే అంతిమ లక్ష్యం. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో

భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిం చాలనేది అందరి సంకల్పం. అదే అంతిమ లక్ష్యం. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో మన దేశం ఎన్నో విజయాలను సాధించింది. ఎన్నో మైలురాళ్లను నెలకొల్పింది. అదే సమయంలో నేటికీ మన దేశం అనేక రంగాల్లో వెనుకబడి ఉంది. ఎన్నో లోటుపాట్లున్నాయి. మనకంటే చిన్న దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సమూల మార్పులతో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికతోనే దేశం పురోగమిస్తుంది.
దేశ స్థూల జాతీయోత్పత్తి 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరి.. మనదేశం జపాన్‌ను అధిగమించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందు ఉన్నాయి. అయితే ఈ దేశం ఈ ఘనత సాధించినప్పటికీ ఇంకా 24 కోట్ల మంది పేదరికంలోనే ఉన్నారు.. 11.8 శాతం మందికి పౌష్టికాహారం అందడం లేదు. 11.3 శాతం మందికి తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు అందు బాటులో లేవు. 13.9 శాతం జనాభాకు వంటగ్యాస్ అందు బాటులో లేదు. 13.6 శాతం మందికి ఇళ్లు లేవు. పేదలకు వైద్యసేవలు పెనుభారంగా మారాయి. ప్రజలు తమ 10 శాతం ఆదాయాన్ని వైద్యపరంగా వెచ్చించే దుస్థితి దేశంలో ఉంది. విద్య సైతం వ్యాపారంగా మారింది.
నిరుద్యోగం ఓ పెనుభూతం
దేశానికి అతిపెద్ద సమస్యగా, దీర్ఘకాలిక ఆర్థిక సవాలుగా నిరుద్యోగం ఉంది. ఇది ఆదాయం, వృద్ధి, జీవన నాణ్యతను ప్రభావితం చేస్తోంది. పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారికి ఉద్యోగాలు లభించకపోవడం ప్రభుత్వాల వైఫల్యమే.. ప్రస్తుత నిరుద్యోగిత రేటు 4.9 శాతంగా ఉంది. 15 నుంచి 29 సంవత్సరాల యువతలో 17 శాతం మందికి ఎలాంటి ఉద్యోగాలు లేవు.. చైనా, జపాన్, మలేసియా, సింగపూర్ వంటి దేశాలు ఉపాధి కల్పనకు పెద్దపీట వేయడం వల్ల అక్కడ నిరుద్యోగం సమస్య కాలేదు.. చైనాలో బాలలకు ఆరో ఏట నుంచే ఉపాధి ఆధారిత విద్యాబోధన చేపట్టడం ద్వారా ప్రపంచదేశాలకు మార్గదర్శకంగా ఉంది. మన దేశంలో ఇప్పటికీ పాలకులు ఈ వైపుగా దృష్టి సారించడం లేదు.. డిగ్రీ తర్వాతే ఉద్యోగం అనే భావనే దేశంలో ఉంది. సింగపూర్, మలేసియా దేశాలకు ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు వరంగా మారాయి. 80 శాతం ఉపాధి వాటి ద్వారానే కలుగు తోంది. నైపుణ్యాభివృద్ధి ప్రతీ విద్యార్థి అవసరంగా గుర్తించే ప్రక్రియను ఇంకా మన దేశంలో చేపట్టనేలేదు.
ఉద్యోగాల భర్తీ ఎలా సాధ్యమంటే..?
మన రాష్ట్రంలో, మన దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగం. ఈ ఆర్థిక సామాజిక సమస్యని పరిష్కరించాలంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని చేపట్టాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి సంవత్సరంలో ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగుల్లో ఇంతవరకు కేవలం పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. ఇప్పటికీ ఇంకా రెండు లక్షల ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఉన్నాయి.. అయిదేళ్లలో మొత్తం అయిదు లక్షల ఉద్యోగాల కల్పన చేయవచ్చు. రెండు లక్షల మంది ఉద్యోగులు పదవీ విరమణ అవుతారు.. ఈ ఖాళీలను గానీ పూరించగలిగితే, మిగిలిన ఒక లక్ష ఉద్యోగాలు కల్పించడం సమస్య కాదు. ప్రైవేటు రంగంలో పది లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇలా మొత్తం పదిహేను లక్షల ఉద్యోగ కల్పన చేయాలి. ప్రస్తుతం మన దేశంలో ప్రతి వెయ్యి మందిలో పదిహేను మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. దీన్ని ముప్పైకి పెంచితే నిరుద్యోగ సమస్య సులభంగా తీరుతుంది.
మౌలిక వసతుల లోపం..
మౌలిక వసతుల లేమితో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 18 శాతం గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేదు. ప్రజా రవాణా సౌలభ్యం 68 శాతం మందికే అందు బాటులో ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ప్రజలు ఆసుపత్రులు, విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు.. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నా ఓడ రేవులు అక్కడక్కడే ఉన్నాయి. వైమానిక రంగంలోనూ వెనకబాటు కనిపిస్తోంది. అమెరికాలో 5170 విమానాశ్రయాలు ఉంటే మన దేశంలో 487 మాత్రమే ఉన్నాయి. దేశమంతటా తాతల కాలం నాటి రైల్వే లైన్లే ఇప్పటికీ ఉన్నాయి. కొత్త రైళ్ల నిర్మాణం అరుదుగా మారింది. స్టేషన్లను నవీకరిస్తూ మార్గాల విస్తరణను విస్మరిస్తున్నారు. దేశంలోని సహజ వనరుల వినియోగం అతి తక్కువగా ఉంది.
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో...
వ్యవసాయం దేశానికి జీవనాడిగా ఉన్నా అది పెను సవాళ్లు ఎదుర్కొంటోంది. ఆహార భద్రతను కల్పించే అన్నదాతలకు భరోసా లేదు. పెట్టుబడులకు అనుగుణంగా రాబడులు లేవు. రెట్టింపు ఆదాయం కల్పిస్తామని పాలకులు చెబుతున్నా కనీస ఆదాయం కలగానే ఉంది. మార్కెటింగ్ విధానం లోపభూయిష్టంగా మారింది. రైతుకు, వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ ప్రబలంగా పాతుకుపోయింది. పశుపోషణ, మత్స్య రంగం వంటివి ప్రగతికి దూరంగా ఉన్నాయి.
ముందడుగు ఎలా?
2047 నాటికి అగ్రగామి దేశంగా అవతరించాలంటే సమూల మార్పులతో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికతోనే దేశం పురోగమిస్తుంది. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం అందించాలి. చిన్ననాటి నుంచే శిక్షణ, నైపుణ్యాల అవపోసన ద్వారా మానవ వనరుల సత్వర వినియోగంతో నిరుద్యోగ నివారణకు ప్రభుత్వాలు నడుం బిగించాలి. దేశంలో ప్రతి ఇంటికీ తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలను కల్పించాలి. మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడం, సామాజిక సంక్షేమ పథకాలను విస్తరించడం, ఆర్థిక వృద్ధిని నడిపించడం, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం, సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడం వంటివి లక్ష్యాలు కావాలి. ప్రస్తుత విధానాలు కొనసాగితే వికసిత భారత్ లక్ష్యాలు చేరడం అసాధ్యమే.
డాక్టర్. బీఎన్‌రావు
98668 34717






