- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్య చరిత్ర గతిని మార్చిన ఎక్స్ రే
వైద్య చరిత్రలో ఎక్స్ రే ఆవిష్కరణ ఓ అద్భుతం. అది వైద్య చరిత్రలో ఓ గొప్ప మలుపు, మైలురాయి. 1895, నవంబర్ 8న జర్మన్ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త సర్ విల్హెమ్ కాన్రాడ్ రాయెంట్జన్

వైద్య చరిత్రలో ఎక్స్ రే ఆవిష్కరణ ఓ అద్భుతం. అది వైద్య చరిత్రలో ఓ గొప్ప మలుపు, మైలురాయి. 1895, నవంబర్ 8న జర్మన్ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త సర్ విల్హెమ్ కాన్రాడ్ రాయెంట్జన్ తన ఉత్సర్గ నాళ ప్రయోగాల్లో భాగంగా కేథోడ్ కిరణాల ధర్మాలను పరిశీలించే దశలో ఆకస్మికంగా ఈ కిరణాలను కనుక్కోవడం జరిగింది. తాను ఈ ప్రయోగాలు జరుపుతున్న దశలో తన టేబుల్ ప్రక్కనే ఉన్న ప్లాటినో సయనైడ్ ఫలకంపై తన చేయి ఎముకల ప్రతిబింబం దర్శనం ఆయనను ఆశ్చర్యపరచింది. మళ్లీ మళ్ళీ ప్రయోగం చేశాడు. ఆ చీకటి గదిలో ఏవో కిరణాలు ఉత్సర్గ నాళం నుండి ప్రసరిస్తూ తన చేత నుండి ప్రయాణం చేస్తూ చేతి ఎముకల గుండా పోలేక వాటి నీడలను ఏర్పడుతున్నట్టు గ్రహించాడు. మనం సహజంగా గణితంలో తెలియని దానిని X ( ఎక్స్) అనుకోవడం ఆ ఎక్స్ విలువ కనుక్కోవడం పరిపాటి. అలాగే సరిగ్గా ఏ కిరణాలో తెలియని సందర్భంలో, ఆ కంటికి కనిపించని కిరణాలకు ఎక్స్ కిరణాలుగా పేర్కొన్నారు. ఆ ఎక్స్ కిరణాలు శాశ్వితంగా అదే పేరుతో పిలవబడుతున్నాయి నేటికీ.
ఈ ఎక్స్ కిరణాల ఆవిష్కరణ వైద్య చరిత్ర దశ దిశను మార్చి ఎన్నో నూతన ఆవిష్కరణలకు, అధునాతన రోగ నిర్ధారణ, నివారణ, చికిత్స పద్ధతులకు బీజం వేసింది. ఎక్స్ కిరణాలు కనుకున్న రాయెంటజెన్‌కు 1901లో మొదటి నోబెల్ బహుమతిని భౌతిక శాస్త్ర విభాగంలో ఇవ్వడం జరిగింది. తొలినాళ్లలో కేవలం ఎముకల పగుళ్లను గుర్తించడానికి మాత్రమే ఉపయోగించిన ఈ కిరణాలను రానురానూ శాస్త్ర సాంకేతిక విప్లవం పుణ్యానా ఎన్నో కొత్త రోగ నిర్ధారణ యంత్ర పరికరాలను కనుక్కోవడం జరిగింది. ఈనాడు వైద్య రంగంలో రోగ నిర్థారణ అంత్యంత సులువు, కచ్చితత్వం, శీఘ్ర గతిన కోలుకోవడానికి అలాగే శస్త్ర చికిత్సలు నివారించడానికి ఈ ఎక్స్ కిరణాలే మూలం.
ఈ కిరణాల ఆధారంగా పనిచేసే రోగ నిర్థారణ పరికరాలు..
ఒకప్పుడు కేవలం సంప్రదాయ ఎక్స్ - రే కేవలం గుండె, ఊపిరితిత్తుల రోగ నిర్ధారణకు ఛాతి ఎక్స్ రే, ఎముకల పగుళ్ల గుర్తించడానికి వాటి ఎక్స్‌రేలు మాత్రమే అందుబాటులో ఉండేవి. శాస్త్రీయ విజ్ఞానం పెరగడంతో ఎన్నో అధునాతన ప్రక్రియలు జోడై శరీరంలోనే ఏ అవలక్షణాలను అయినా నిర్ధారించే కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT Scan), స్పైరల్ సిటీ, మల్టీ డిటెక్టర్ సిటీ (MDCT), రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామోగ్రఫీ, సంప్రదాయ నలుపు తెలుపు ఫిల్మ్, ఎక్స్ రే స్థితి నుండి డిజిటల్ చిత్రాలు రూపొందించే కంప్యూటెడ్ రేడియోగ్రఫీ, డిజిటల్ రేడియోగ్రఫీ, ఆపరేషన్ థియేటర్‌లో శస్త్ర చికిత్సలో ఉపయోగ పడే సి-ఆర్మ్, ఓ-ఆర్మ్, రక్త నాళాల అడ్డంకుల నిర్ధారణకే కాకుండా ఎలాంటి శస్త్ర లేకుండా చిన్న గాటు ద్వారా శరీరంలోని ఏ భాగానికైనా వెళ్లి చికిత్సను ఇంటర్వెన్షనల్ రేడియోగ్రఫీ ప్రక్రియకు ఉపకరించే డిజిటల్ సబ్ట్రాక్షన్ అంజియోగ్రఫీ, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే లీనియర్ యాక్సిలరేటర్, రేడియోధార్మిక రసాయనాలను శరీరభాగాల్లోకి పంపించి ఆ యా భాగాలు వెదజల్లే రేడియో ధార్మిక కిరణాలను సంగ్రహించి రోగ నిర్ధారణ చేసే గామా కెమెరా, పోసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET), 3D చిత్రాలను అందించే సింగిల్ పోసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, (SPECT), సిటి మరియు పెట్ కాంబినేషన్ PET CT, PET మరియు MRI ల కాంబినేషన్ PET MRI రోగ నిర్థారణలో అంత్యంత విలువైన, ఖచ్చితమైన సమాచారాన్ని అందించే యంత్ర పరికరాలు.
దుష్ప్రభావాలు, జాగ్రతలు..
ఎక్స్ కిరణాలు మానవాళికి ఎంత మేలు చేస్తున్నాయో అయితే విచక్షణ రహితంగా వాడితే అంతే విపరీత పరిణామాలు సంభవిస్తాయి. నిజానికి ఎక్స్ రే కమ్ముకున్న రాంటిజెన్, అతడి భార్య బెర్త రోంటజెన్, రేడియో ధార్మిక శక్తిని కనుగొన్న మేడం క్యూరీ రేడియేషన్ గురి అయి మరణించారు. రేడియేషన్ దుష్పరిణామాలు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అయోనైజేషన్ రేడియేషన్ ఉదా: ఎక్స్ రే, ఆల్ఫా, బీటా, గామా కిరణాలు.. రెండోది నాన్ ఆయోనిజింగ్ రేడియేషన్. ఉదా అల్ట్రా వైలెట్, కాంతి తరంగాలు ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రో వేవ్స్ మొదలైనవి. ఎక్స్ కిరణాలు రేడియో ధార్మిక కిరణాలు అయినందున శరీర కణజాలం నుండి ప్రయాణించే క్రమంలో శరీర అవయవాల కణజాలంతో అయనీకరణం చెందడం వల్ల ఎక్స్ రే కిరణాలు శక్తిని డిపాజిట్ చేయడం ద్వారా కణజాల నిర్మాణంలో మార్పులు సంభవించవచ్చు. క్రోమోజోముల నిర్మాణంలో తేడాలు ఏర్పడవచ్చు. ఎక్స్ కిరణాలు వాటి శక్తి ఏక రీతిలో ఉండదు. వివిధ శక్తి స్థాయిలు కలిగి ఉంటాయి. తక్కువ శక్తి గల కిరణాలు శరీరం నుండి చొచ్చుకొని పోలేక శరీరంలోనే నిక్షిప్తమౌతాయి. తద్వారా శక్తి మార్పిడి జరిగి శరీర కణజాలం మార్పులకు గురి అవుతుంది. తద్వారా రేడియేషన్‌కు గురి అయిన ఆ వ్యక్తిలోనే కాకుండా జన్యుపర సమస్యలు తరువాతి తరంలో కూడా సంభవించవచ్చు.
రేడియేషన్ మోతాదుకు మించకుండా..
రేడియేషన్ ద్వారా సంభవించే పరిణామాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని సుశిక్షితులు సమక్షంలో ఆయా పరీక్షలు నిర్వహిస్తారు. రేడియేషన్ దుష్పరిణామాలు నివారించడానికి దేశంలో అటామిక్ ఎనర్జీ రెగ్యులేటర్ బోర్డు పని చేస్తుంది. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్, సాంకేతిక నిపుణులు రిజిస్టర్ అయి ఉండాలి. రేడియేషన్ నుండి కాపాడడానికి డిస్టన్స్ (వీలైంనంత దూరం ఉండడం), షీల్డింగ్ (రక్షక కవచాలు లెడ్ ఏప్రాన్స్, గ్లౌస్, గాగుల్స్ ధరించడం) టైమ్ (వీలైనంత తక్కువ సమయం కేటాయించడం) అనే మూడు ముఖ్య ప్రమాణాలు పాటిస్తారు. అందుకే రేడియేషన్ మోతాదులు మించకుండా ALARA (as low as reasonable achievable) అనే ప్రధాన సూత్రాన్ని నిపుణులు పాటిస్తూ వివిధ పరీక్షలలో రేడియేషన్ మోతాదులను నిర్ణయిస్తారు. మాటి మాటికి ఎక్స్ రేలు, సిటీ స్కాన్ పరీక్షలను డాక్టర్ సిఫారసు లేకుండా చేయించుకోకూడదు. అవసరమైతే అల్ట్రా సౌండ్, మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ మరియు ఇతర పరీక్షలు సిఫారసు చేయవచ్చు.
(ఎక్స్-రే కనుక్కొని 130 ఏండ్లు)
-శిరందాస్ శ్రీనివాస్
94416 73339






