- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూళ్లలో ‘షుగర్ బోర్డులు’ పెడితే చాలదు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ 2025 ఆగస్ట్ 21 నాడు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల అన్నింటిలో షుగర్ బోర్డులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ 2025 ఆగస్ట్ 21 నాడు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల అన్నింటిలో ‘షుగర్ బోర్డులు' పెట్టాలని ఒక ఆదేశాన్ని జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ CBSE బోర్డు మే 14న విడుదల చేసిన సర్క్యులర్ అమలులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బోర్డులు పెట్టేందుకు పూనుకుంటున్నారు. అయితే పిల్లలలో ఊబకాయానికి, మధుమేహానికి దారి తీస్తాయన్న హెచ్చరికలతో స్కూళ్లలో ‘ షుగర్ బోర్డులు’ పెట్టడంతో సరిపోతుందా? అన్నది ప్రశ్న!
మన పిల్లలను శారీరక, మానసిక సమర్థులుగా రూపొందించే చర్యలన్నింటినీ చేపట్టడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అందుకే కేంద్ర ప్రభుత్వం పంచదార అధిక మోతాదులో ఉన్న జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఈ తరం పిల్లల్లో ఊబకాయం, మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరిగిన రీత్యా, పంచదార అధిక సేవనం వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించి, సీబీఎస్‌ఈ ఆ మేరకు హెచ్చరికలు జారీ చేయడాన్ని స్వాగతించదగినదే. రోజు వారీగా పిల్లలు తీసుకుంటున్న కేలరీలలో పంచదార నుండి వచ్చే కేలరీలు 5 శాతానికి మించకూడదన్నది వైద్య వర్గాల సూచన కాగా మన పిల్లలు తీసుకుంటున్న ఆహారంలోని కేలరీలలో 13 నుంచి 15 శాతం ఉన్నట్లు గుర్తించారు.
జంక్ ఫుడ్స్‌పై నిషేధం!
నిజానికి ఈ అధిక పంచదార వినియోగం బాల్యంలోనే మన భావి భారత పౌరులను రోగ గ్రస్తులుగా చేసే దుస్థితి రావడం విచారకరం. 2010లోనే ఢిల్లీ హైకోర్టులో ఉదయ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసి జంక్ ఫుడ్స్‌ను నిషేధించమని కోరడంతో ఈ చర్చ మొదలైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), భారతీయ ఆహార సంరక్షణ ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI), జాతీయ పోషకాహార సంస్థ (NIN) వంటివి కోర్టు ముందుకు వచ్చి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 2015లో కోర్టు ఇచ్చిన తీర్పులో ఇందుకు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను రూపొందించమని పై సంస్థలను ఆదేశించింది. 2013లోనే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని జంక్ ఫుడ్స్ అమ్మకాలను స్కూళ్లలో నిషేధించమని అదే కోర్టు కోరింది. 2019లో తమిళనాడు ప్రభుత్వం చిప్స్, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచి ప్రైస్, ఫ్రైడ్ చిప్స్, సమోసా, చోలా భటూర, గులాబ్ జాం, మిఠాయిలు, నూడిల్స్, కూల్ డ్రింక్స్ (కోకాకోలా, పెప్సీ, వగైరాలు)ను స్కూళ్లలో నిషేధించింది. స్కూల్ అసెంబ్లీలలో పిల్లల చేత జంక్ ఫుడ్స్ జోలికి పోకుండా ఉంటామని ప్రతిజ్ఞలు చేయించింది.
అన్ని స్కూళ్లూ ఆటల్ని వదిలేశాయి..
నిజానికి పంచదార దట్టించిన ఆహారాలు పిల్లల్లో ఊబకాయం, మధుమేహాలనే గాక దంత క్షీణత, గుండె జబ్బులు, బి.పి., మతి మరుపు, మెదడు పనితనం దెబ్బతినడం, మానసిక కుంగుబాటు (డిప్రెషన్) వంటి అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నట్లు అనేక పరిశోధనల్లో నిర్ధారణ అయింది. అనారోగ్య సమస్యలతో పిల్లలు క్లాస్ రూముల్లో అభ్యసనంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. మరోవైపు మన స్కూళ్లన్నీ ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారు చేసేలా ర్యాంకులు సాధించాలనే హడావిడి పెట్టి ఆటలనీ, వ్యాయామాలనీ వదిలి వేశాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ పిల్లల శారీరక సామర్థ్యాలను పెంచాలన్న స్పృహను కోల్పోయాయి.
షుగర్ బోర్డులపై ప్రధాని పిలుపు..
2025 మే 25న మన ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన 'మన్ కీ బాత్' కార్య క్రమంలో షుగర్ బోర్డుల విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించి 'ఫిట్ ఇండియా' (పటుత్వం/దేహదారుఢ్యం గల పౌరులతో కూడిన భారత్)ను నిర్మించాలని పిలుపు ఇచ్చారు. 'మద్యపానం ఆరోగ్యానికి హానికరం', 'పొగతాగడం ప్రమాదం' లాంటి హెచ్చరికలు చేస్తూనే సినిమాల్లో, టీవీలలో వాటిని మరింత ఎక్కువగా చూపుతున్నారు. 'షుగర్ బోర్డులు' కూడా ఇలాంటి మొక్కుబడి కార్యక్రమం కాకూడదు. పిల్లల ఎదుగుదలలో ఎంతో ప్రభావం చూపే వీటిని స్కూల్ ఆవరణలోనూ, 50 మీటర్ల దూరం వరకు వీటి అమ్మకం నిషేధిస్తేనే సరిపోదు. ప్రమాదకరమైన ఈ ఆహారాల తయారీనే కట్టడి చేయాలి/నిషేధించాలి. పోషకాహార అంశాల్ని స్కూల్ సిలబస్‌లో భాగం చేయాలి. ఆహారం వండే/తయారు చేసే వర్కు షాపులు కనీసం వారానికొకటి పిల్లలచే చేయించాలి. తల్లి దండ్రులకు, ఉపాధ్యాయులకు పోషకాహార పరిజ్ఞానం తప్పనిసరిగా అందించాలి.
బయోక్లాక్‌కి విరుద్ధంగా ఈట్ స్ట్రీట్‌లు..
సాధారణంగా మన శరీరాలకు బయో క్లాక్ ఉంటుంది. ఇది హార్మోన్లు విడుదలయ్యే క్రమానికి అనుగుణంగా ఆహార వేళలు, నిద్ర వేళలు ఉండాల్సిన అవసరాన్ని చెప్పడమే గాదు, అమలు పరచాలి. అర్ధరాత్రి వరకు 'ఈట్ స్ట్రీట్'లకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి. అక్కడ అమ్ముతున్న వాటిలో అత్యధికం అనారోగ్యకరమైనవే. అలాగే స్కూల్‌లో ఆటాడుకునే స్థలం తప్పని సరిగా ఉండాలన్న నియమాన్ని అమలు పరచాలి. ఆటలకు, వ్యాయామానికి తగిన సమయం స్కూల్ టైమ్ టేబుల్‌లో కేటాయించాలి. వ్యాయామ విద్య చదువులో అంతర్భాగం కావాలి. దేహ దారుఢ్యంతో, మనో వికాసం ముడిపడి ఉందన్న అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజారోగ్య రంగంలో పని చేస్తున్న వైద్యులుగా, పిల్లల సమగ్ర అభివృద్ధి పట్ల శ్రద్ధ ఉన్న వారిగా మేం ఈ విజ్ఞాపన చేస్తున్నాం. పై చర్యల అమలు కోసం పూనుకోవాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు- ఆరోగ్యకర పిల్లలతో కూడిన దేశ నిర్మాణం కోరేవారంతా మాతో గొంతు కలపాలని కోరుతున్నాం.
-డాక్టర్ కె. శంకర్
NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం,
94406 73953






