యాప్స్ పేదరికాన్ని పెంచుతున్నాయా?

by Ravi |   (  Updated:2025-08-05 01:15:35  IST  )

మన సమాజంలో ఏనాడూ లేని అసంఖ్యాక మైన యాప్స్‌తో నేడు మన జీవితం పెన వే‌సుకుంది. వివిధ రకాల యాప్‌లు వచ్చి మన

యాప్స్ పేదరికాన్ని పెంచుతున్నాయా?
X

మన సమాజంలో ఏనాడూ లేని అసంఖ్యాక మైన యాప్స్‌తో నేడు మన జీవితం పెన వే‌సుకుంది. వివిధ రకాల యాప్‌లు వచ్చి మన ప్రైవసీకి పెద్ద అఘాతం కలిగిస్తున్నా యి. నేడు అసంఖ్యాకమైన యాప్స్ మన మొబైల్లో మన చేతే ఇన్‌స్టాల్ చేయించి మనల్ని తనిఖీ చేయించే టెక్నాలజీ మన చేతుల్లోనే ఉంచారు.

ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఎన్నో యూపీఐ యాప్స్ మనల్ని ఒకవైపు ఆపద్బాంధవుల్లా కాపాడుతూ మరోవైపు, మనల్ని అప్పుల్లో కూడా ముంచేస్తున్నాయి. వీటన్నింటిని ఉచితం అంటూనే మనకు అలవాటు చేసి యూపీఐ యాప్స్ కంపెనీలు సైతం తమ చార్జీల్లో మార్పులు చేశాయి.

ప్రపంచీకరణకు ఇదే కావాలి!

మనం నోట్లతో ట్రాన్సాక్షన్ చేసినంత కాలం మన డబ్బులు ఎలా ఖర్చవుతున్నాయో తెలిసేది. నేడు స్కానర్ కోడ్‌ని స్కాన్ చేయడం, పే చేయడం సెకండ్లలో జరిగిపోతోంది. దీనివల్ల చాలాసార్లు అనవసరమైన ఖర్చులు పెడుతున్నట్టు ఇటీవల వచ్చిన చాలా పరిశోధనలూ, సర్వేలూ తెలియ జేస్తున్నాయి. కరెన్సీ నుండి డిజిటల్ ఎకానమీకి రూపాంతరం చెందడం మారుతున్న కాలానికి సంకేతం. ప్రపంచీకరణకు కూడా ఇదే కావాలి. కానీ, ఆ టెక్నాలజీని అర్థం చేసుకోకుండా ఉపయోగించేటప్పుడు సమస్యలు ఉంటాయి.

అప్పుల్లో ముంచెత్తుతున్న యాప్‌లు..

స్మార్ట్ ఫోన్లో యూపీఐ యాప్‌లు నేటి యువతరాన్ని అప్పుల్లోకి ముంచేస్తున్నట్టు చాలామంది ఆర్థిక నిపుణులు అంటున్నారు. గోరుచుట్టు మీద రోకటి పోటులా క్రెడిట్ కార్డుల మాయాజాలం పక్కనే ఉంది. క్రెడిట్ కార్డుల కంపెనీలు అందించే డబ్బు మనం శ్రమించి సంపాదించిన డబ్బు కాదు. కానీ, క్రెడిట్ కార్డు కంపెనీలు వారి ఆల్గోరిథమ్స్ ఎలా తీర్చిదిద్దుతారంటే ప్రతి ఒక్కరూ వారి మాయలో పడాల్సిందే. బిల్లు రాగానే మినిమం అమౌంట్ ఫలానా అమౌంట్ కట్టేస్తే చాలు అని ఒక డేట్ ఇస్తారు. అక్కడే అసలు మాయాజాలం ఆరంభమవుతుంది. మనం ముఫ్ఫై వేల రూపాయలు క్రెడిట్ కార్డులలో ఖర్చు పెట్టి ఏదైనా వస్తువు కొని ఉంటే మూడు వేలు కడితే చాలు అని మినిమం అమౌంట్ డ్యూ‌లో చూపించి క్రెడిట్ కార్డు కంపెనీలు మనతో ఆడుకుంటాయి. మిగిలిన అప్పు మీద విపరీతమైన వడ్డీ వేసి, రకరకాల చార్జీలు వేసి కన్జ్యూ‌మర్ నడ్డి విరుస్తారు. కొనుగోలుదారుడు ఆ అప్పు ఉండగానే మరలా మరో నెల మరి కొంచెం వాడతాడు.

డబ్బు లేదా.. అప్పు ఇప్పిస్తాం

కన్జ్యూ‌మర్ గూడ్స్ భారతదేశంలోకి ప్రపంచీకరణ తర్వాత అత్యధిక సంఖ్యలో వచ్చి పడ్డాయి. వీటి సేల్స్ పెంచడానికి భారతీయుడి దగ్గర అంతంత డబ్బు లేదని వారికి తెలుసు.. అందుకే, పక్కనే క్రెడిట్ కార్డు కంపెనీలు వీరితో చెలిమి చేసుకొని ఈజీగా మనకి అప్పులు ఇస్తున్నట్టు భ్రమ కల్గించి మనల్ని అప్పుల్లో ముంచే ఒక పథకం ఎప్పుడో ఆరంభమైంది. ఫలితంగా, కన్జ్యూ‌మర్ గూడ్స్ అమ్మే కంపెనీలు మూడు పువ్వులూ, ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. టీవీ ఉండగానే ఎక్స్‌చేంజ్‌లో మరో టీవీ, మొబైల్ బాగా పనిచేస్తుండగానే మరో మొబైల్ కొనేలా ప్రలోభ పెడుతున్నాయి. దీనివల్ల క్రెడిట్ కార్డు కంపెనీలు ముఫ్ఫై, నలభై శాతం వడ్డీలు కూడా గుంజుకుంటున్నాయి.

కాబూలీవాలా అప్పుల మాయాజాలం

మరోవైపు, యాప్‌లలో ప్రవేశించిన కన్జ్యూ‌మర్ ఫలానా క్రెడిట్ కార్డ్ కంపెనీ నో కాస్ట్ ఈఎంఐ ఇస్తుందని ప్రలోభ పెట్ట డం ద్వారా ఆ కార్డు ఉపయోగిస్తారు. పేరుకే నో కాస్ట్ ఈఎంఐ. కానీ ప్రాసెసింగ్ ఫీ, ఇంట్రెస్ట్ అన్నీ కూడా వారు దంచేస్తారు. సమయానికి చెల్లించకపోతే, విపరీతమైన పెనాల్టీలు కూడా గుంజుతారు. ఇలా భారతదేశంలోని మధ్య తరగతి రెండేసి, మూడేసి క్రెడిట్ కార్డులు ఉంచుకొని ఒక క్రెడిట్ కార్డు బిల్లు మరో క్రెడిట్ కార్డు సాయంతో తీర్చడం, ఇలా మూడేసి క్రెడిట్ కార్డు ట్రాప్‌లలో పడి ఎవరి అప్పు కూడా తీర్చలేని కాబూలీవాలా అప్పుల మాయాజాలంలో ఇరుక్కుంది.

సేవింగ్స్ కాదు.. ఖర్చుల ఎకానమీ

టెక్నాలజీలో వచ్చిన అభివృద్ధి ముఖ్యంగా కార్పొరేట్ వర్గానికీ, ఆన్లైన్ వర్గానికీ, పనికొచ్చింది. గతంలో 2016లో నోట్ల రద్దు కూడా వీటికి ఒక ఎంట్రీ గేట్ అందించి దారిని సుగమం చేసింది. ఈ రోజు అనూహ్యంగా అభివృద్ధి చెందిన మన డిజిటల్ టెక్నాలజీ, యాప్‌ల పరిశ్రమ, క్రెడిట్ కార్డు పరిశ్రమ, యూపీఐ అన్నీ కూడా మన జీవితాలను సుఖవంతంగా మార్చేస్తున్నట్టు భ్రమ కలిగిస్తూ, మధ్యతరగతినీ, యువతరాన్నీ అప్పుల్లో ముంచేసే దిశలో పయనిస్తున్నాయి. గతంలోని సేవింగ్స్ ఎకానమీ నేడు ఖర్చుల ఎకానమీగా మారిపోయింది.

ఈ యాప్స్‌తో బద్ధకస్తులు తయార్

దీనికి తోడు పది నిమిషాల్లో సరుకులు అందించే డెలివరీ యాప్స్ యువతరాన్ని బద్దకస్తులుగా మార్చాయి. ఒబేసిటీకి దారితీసే జంక్ ఫుడ్స్ అలవాటు చేశాయి. ఆన్‌లైన్‌లో పది నిమిషాల్లో సరుకులు అందించే ఈ యాప్స్ వాటి అల్గో రితంని ఎలా రూపొందించుతాయంటే మనకు అవసరం లేని వస్తువులు మనం ఎక్కువేసి కొనేలా చేసి మన ఖర్చుల్ని పెంచేస్తూ అవి తమ పొట్టను నింపుకుంటున్నాయి. మనం రెండు, మూడు రకాల సరుకులు కొనడానికి ఆ యాప్‌లోకి అడుగుపెట్టేటప్పుడు అవి మరికొన్ని సరుకులు మనకు చూపిస్తూ చాలా తక్కువ ధరకు అందుతున్నాయని భ్రమ కలిగిస్తూ రెండు కొంటే మూడు కొంటే ఇంకా తక్కువ ధరకు దొరుకుతాయని భ్రమను మరింత పెంచేస్తూ, మన ఖర్చుల్ని పెంచుతూ మన పాకెట్‌ని కొట్టేస్తున్నాయి. ఫలితంగా, బడ్జెట్ కంటే ఖర్చుల్ని పెంచుతూ అప్పుల్లో మునిగిపోతున్న యువతరం నేడు పెరుగుతోందని మనీ నిపుణులు రాస్తున్నారు. కాబట్టి కొత్తగా వచ్చిన ఈ డిజిటల్ ఎకానమీతో అవి అందించే సౌకర్యాలని అందుకుంటూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

-కేశవ్

ఆర్థిక సామాజిక విశ్లేషకులు

98313 14213

Next Story