యథా ప్రజా తథా రాజా

by Disha edit |
యథా ప్రజా తథా రాజా
X

పోలీసు శాఖ మొత్తం అలాగే ఉన్నారని చెప్పుకోవడానికి వీలులేదు. అంకిత భావంతో పని చేయుచున్న అధికారులు అన్ని హోదాలలో ఉన్నారు. కనుకనే ధర్మం అలా కొనసాగుచున్నది. కాకపోతే, అటువంటి వారి శాతం దినదినం తగ్గుతున్నదని చెప్పుకోవలసి ఉంటుంది. రాజకీయ నాయకులలో సైతం నిజాయితీ పరులున్నారు. కానీ, వారు ఓటర్ల ఆమోదాన్ని పొందలేని అశక్తులుగా నిలబడిపోతున్నారు. రాజ్యాంగ రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న న్యాయస్థానాలు పరిపాలనలో జోక్యం చేసుకొనలేని పరిస్థితి. వజ్రాయుధం తమ చేతిలో ఓటుతో ఉందని పౌరసమాజం గుర్తించగలగాలి. 'యథా రాజా తథా ప్రజా' అను నానుడిని తిరగరాసి 'యథా ప్రజా తథా రాజా'గా మార్చి సత్తా చాటాలి.

క్రిమినల్, జస్టిస్ వ్యవస్థలో తన వంతు పాత్రను పోషించుటకు పోలీసు శాఖ నేడు అతి క్లిష్టమైన, కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ఎదుర్కొంటున్న సమస్యలలో ఒక దానిని పూరిస్తూనే మరొక సమస్యలో చిక్కుకుంటున్నది. వ్యక్తిగతంగా, శాఖాపరంగా ఒడిదుడుకులు ఎదురైననూ దేశ భద్రత, సామాజిక బాధ్యతల దృష్ట్యా తమ కర్తవ్యాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పోలీసు అధికారులు ముందుకు సాగుచున్నారు. వలస పాలకుల అప్రజాస్వామిక పోలీసు వాసనలను వదిలి రాజ్యాంగానుసారంగా పని చేయుచున్న పోలీసు శాఖకు ప్రజలే పాలకులు.

రాజకీయ పదాధికారులు, చాలకులు. ఆ చాలకుల ఓట్లతో పాలకులు పుట్టుకొచ్చి వారికి ప్రతినిధులుగా చలామణి అవుతున్నారు. అయితే, వారి పాలనాకాలం మాత్రం పరిమితమైనదే! కాలంతోపాటు పాలకుల ఆలోచనలు సైతం పరిమిత కక్ష్యలోనే తిరుగాడుచున్నవి. పర్యవసానంగా అప్రకటిత కుటుంబ పాలనా విధానం అమలు చేయు దిశగా పయనిస్తున్నది. తత్కారణంగా విలువలుడిగిన పాలన వికృత రూపంతో వెర్రితలలు వేయుచున్నది. అన్ని అవస్థలకు కారణభూతులైన నేటి పాలకుల శైలిని పరిశీలించవలసిన అవసరమెంతైనా ఉంది.

పాలకులంటే?

ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో ప్రజా ప్రతినిధులే పాలకులని' అర్థం చేయిస్తుంది మన రాజ్యాంగం. కానీ, వర్తమాన సమాజంలో పాలకుడవ్వాలంటే మొదలు కండలు పెంచుకోవడం, అది సాధ్యపడకపోతే పెంచుకున్నవారిని వెంట తిప్పుకోవడం, ఒక బలమైన దండును అండగా ఎంచుకోవడం. ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకుంటున్న వ్యాపార సంస్థలు, భూముల లావాదేవీలలో తమ అనుయాయులను జొప్పించి ఆదాయ వనరులు పెంచుకోవడం. ప్రముఖ సెంటర్‌లో ఒక కార్యాలయాన్ని ఆవిర్భవింపజేసుకోవడం. చూడగానే కండ్లు మిరుమిట్లు గొలిపే వాహన సముదాయాన్ని సమకూర్చుకోవడం.సాయంత్రం కాగానే ప్రభుత్వాధికారులను మందు పార్టీలకు పిలిపించుకోవడం.

డబ్బు పంపకాల లావాదేవీలలో చర్చల ద్వారా సెటిల్‌మెంట్‌లు చేయడం. జన్మదిన శుభాకాంక్షల బ్యానర్లు, ఆయా మతాలకు సంబంధించిన వేషధారణ ఫొటోలతో అన్ని కూడళ్లలో తగిలింపజేసుకోవడం. ఢిల్లీ నుండి పెద్ద నాయకులు విచ్చేయు సమయములందు వారికి ఆహ్వానం పలుకుతూ పెద్ద పెద్ద బ్యానర్లు ప్రదర్శించడం, అవకాశం ఉన్నంత మేరకు అన్ని సెంటర్‌లను జెండాలమయం చేయడం. టీవీ ఛానళ్ల చర్చలలో పాల్గొని, అడిగేదొకటైతే చెప్పేదొకటిగా ప్రసిద్ధి కెక్కిపోవడం. అవకాశం దొరికిన ప్రతి చోటా ప్రారంభోత్సవాలు, సమ్మేళనాలలో పాల్గొంటూ వచ్చీరాని భాషలో, ఉచ్ఛ నీచాలెరుగకుండా తమ వాగ్థాటిని ప్రదర్శించుకోవడం. పత్రికలలో తాటికాయంత అక్షరాలతో, గుమ్మడి కాయంత ముఖంతో ఫోటోలు వేయించుకొని విరివిగా ప్రచారాలు చేయించుకోవడం కొనసాగుతున్నది.

భయపెడుతూ, వెంట తిప్పుకుంటూ

ఎలక్షన్లు వచ్చినప్పుడు వ్యాపార సంస్థల నుంచి చందాలు వసూలు చేసుకోవడం, తోక చుక్కలుగా మారిన ప్రభుత్వధికారులను, స్థాన చలన వేటును భయంగా చూపిస్తూ వెంట తిప్పుకోవడం, కల్లు, సారా, మద్యం ప్రతి ఓటరుకు చేరవేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం, ప్రజలను సామాజిక సంఘాల పరంగా విడగొడుతూ, కలుషిత ప్రచారంతో వారి మతులను చెదరగొట్టడమూ పరిపాటిగా మారింది. ఓట్ల సాధనకు డబ్బులు పంపిణీ చేసుకోవడం, ఎన్నికలలో గెలిచి ఊరేగింపులు, సంబరాలు చేసుకోవడం, సన్మానాలు కామన్‌గా మారిపోయింది.

తన నీడను తానే నమ్మకుండా, తనకు పోటీగా మరొక నేత ఎదగకుండా చూసుకోవడమూ జరుగుతున్నది. కుటుంబ సమేతంగా అమెరికా, యూరప్ దేశాలకు టూరిస్టుగా వెళుతూ, వెళ్లిన చోటల్లా ఫోటోలు, వీడియోలు తీయించుకోవడం కొనసాగుతున్నది. స్థిరాస్థులు కొనుక్కోవడం, అసెంబ్లీ సమావేశాలలో అన్ని రోజులకు ఒక్కసారే హాజరు సంతకాలు ఒత్తేసి రావడం, మీడియాతో సంబంధాలు మెరుగుపరచుకొనుటకు ఘనంగా విందులను ఏర్పాటు చేయడమూ చూస్తూనే ఉన్నాం. హోదా పెంచుకొనుటకు గన్‌మెన్‌ను నియమించుకుంటున్నారు. ప్రజల మదులలో కదలాడుటకు పిలిచినా, పిలవకపోయినా పెండ్లిళ్లకు, పేరంటాలకు, నామకరణాలకు, చావులకు, తద్దినాలకు తరచుగా వెళుతూ శభాష్ అనిపించుకోవడమూ రాజకీయమే.

వజ్రాయుధాన్ని ఉపయోగించాలి

రాని మంత్రి పదవి కోసం మరీ మరీ ప్రయత్నం చేసుకోవడం, ప్రభుత్వాధికారులు, పోలీసు అధికారులు తనకు వంత పాడుతుంటే, అవసరం తీరగానే వారిని బొంతపురుగుల్లాగా ఏరివేసి చేతులు దులుపుకోవడం రాజకీయులకు అలవాటుగా మారింది. తెల్లడబ్బును భారత బ్యాంకులలో, నల్ల డబ్బును స్విస్ బ్యాంకులో పదిలపరచుకోవడం. ఇదంతా నవలా రాజకీయం అనుకుంటున్నారా? కానే కాదండి మన రాజకీయ నాయకుల అసలు రూపం. పాలకులు తమ కోర్కెల సాధనకు ప్రభుత్వాధికారులను తమ కనుసన్నలలో నిలుపుకుంటున్నారను అభియోగాలు నిత్యం విమర్శల రూపంలో వినబడుతూనే ఉన్నాయి. దాని వేడి పోలీసు శాఖపై ఎక్కువగా పడినట్లు తోచుచున్నది.

పోలీసు శాఖ మొత్తం అలాగే ఉన్నారని చెప్పుకోవడానికి వీలులేదు. అంకిత భావంతో పని చేయుచున్న అధికారులు అన్ని హోదాలలో ఉన్నారు. కనుకనే ధర్మం అలా కొనసాగుచున్నది. కాకపోతే, అటువంటి వారి శాతం దినదినం తగ్గుతున్నదని చెప్పుకోవలసి ఉంటుంది. రాజకీయ నాయకులలో సైతం నిజాయితీ పరులున్నారు. కానీ, వారు ఓటర్ల ఆమోదాన్ని పొందలేని అశక్తులుగా నిలబడిపోతున్నారు. రాజ్యాంగ రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న న్యాయస్థానాలు పరిపాలనలో జోక్యం చేసుకొనలేని పరిస్థితి. వజ్రాయుధం తమ చేతిలో ఓటుతో ఉందని పౌరసమాజం గుర్తించగలగాలి. 'యథా రాజా తథా ప్రజా' అను నానుడిని తిరగరాసి 'యథా ప్రజా తథా రాజా'గా మార్చి సత్తా చాటాలి.

పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి

94400 11170


Next Story

Most Viewed