హోలీ ఆనందాల రంగుల కేళి

by Disha edit |
హోలీ ఆనందాల రంగుల కేళి
X

కుల, మత, లింగ, వయో భేదాలు లేకుండా, పేద, ధనిక, మధ్యతరగతి అనే భేదభావం లేకుండా ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ హోలీ. చిగురించే ఆకులు వికసించే పుష్పాలతో వసంత రుతువు ఆగమనంతో ప్రకృతి అంతా రంగురంగుల పూలతో నయనానందకరంగా ఉంటుంది. మనిషి జీవితంలో కూడా కష్టసుఖాల కలబోత అని మనిషి జీవితం రంగుల మయం కావాలని ప్రకృతి ఇచ్చే సంకేతంగా దీన్ని చెప్పుకోవచ్చు.

హోలీ అంటే అగ్ని. అగ్నితో పునీతమైంది అని అర్థం. హోలీ నే కాముని పున్నం డోలికోత్సవం, రంగుల పండుగ, వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ చేసుకునే పండుగ కాబట్టి దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమిరోజున ఈ పండుగ జరుపుకుంటాం.

పురాణ కథల ప్రకారం..

ఈ పండుగ గురించి పురాణాలలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం రాక్షసరాజైన హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు కావడంతో తన శత్రువైన విష్ణుమూర్తిని కొలవడం ఇష్టం లేని హిరణ్యకశిపుడు తన కొడుకుని చంపడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలం ఐనాయి. దాంతో తన చెల్లెలు హోలికను పిలిచి ఒక వస్త్రం ఇచ్చి దీన్ని కప్పుకొని ప్రహ్లాదుడిని తీసుకొని మంటల్లో దూకమన్నాడు. హోలిక కప్పుకున్న వస్త్రం గాలికి కొట్టుకు పోయింది దానితో హోలిక మంటల్లో తగలబడిపోయింది. శ్రీమహావిష్ణువు అనుగ్రహం వలన ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడ్డాడు. హోలిక దహనానికి గుర్తుగా మనం హోలీ పండుగను జరుపుకుంటున్నాం.

దక్షయజ్ఞం సమయంలో అగ్నికి ఆహుతి అయిన సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన పరమేశ్వరుడు హిమాలయాల్లో తపో దీక్షలో ఉండగా మన్మధుడు పూలబాణం వేసి దీక్ష భగ్నం చేశాడు. ఆగ్రహించిన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథుడిని (కాముడు) భస్మం చేశాడు. రతీదేవి కోరికమేరకు మన్మధుని బతికించి ఎవరికీ కనపడకుండా కేవలం రతీదేవికి మాత్రమే కనిపిస్తాడని వరమిచ్చాడు. కామ దహనం చేసిన తర్వాత రోజున హోలీని జరుపుకుంటున్నాం.

శ్రీకృష్ణుని నల్ల వాడని రాధ హేళన చేయగా ఆమెను ఆటపట్టించడానికి సరదాగా రంగులు పూస్తూ గోపికలతో పాటు రంగుల పండుగ జరుపుకున్నట్లు పురాగాథల ద్వారా తెలుస్తుంది. మనలో ఉన్న చెడును దహనం చేసి నిర్మలమైన స్వచ్ఛమైన మనసుతో ఎదుటి వారికి ప్రేమను పంచడం వారితో సంతోషాలు పంచుకోవడం ఇందులోని పరమార్థం.

హోలీ పండుగకు సంబంధించి హాలుని గాధా సప్తశతిలో పాల్గుణ ఉత్సవం, మధనోత్సవం అని, దండి దశకుమార చరిత్రలో వసంతోత్సవం అనే పేర్లు దానికి సంబంధించిన వర్ణణ మనకు కనిపిస్తుంది..

సహజ రంగులు ఉపయోగిద్దాం..

ప్రాచీన కాలంలో చెట్ల ఆకులు పూలతో ముఖ్యంగా మోదుగ పువ్వులను ఉడికించి రసం చేసి ఆ ద్రవాలను ఒకరిపై ఒకరు చల్లుకునే వారు. తరువాత తరం వారు పసుపు కుంకుమ నీళ్లలో కలిపి రంగులు చల్లుకునే వారు. ఇప్పటి తరం వారు ఇంకొక అడుగు ముందుకేసి రసాయనాలతో కలిపిన రంగులు కోడిగుడ్లు, బురద ఇంకా విషపూరితమైన ద్రావణాలతో హోలీని జరుపుకుంటున్నారు. ఒక్కరోజు సరదా కోసం జరిగిన పండుగ ప్రభావం రెండు మూడు నెలల వరకు రంగుల ప్రభావం మనపై పడుతుంది, క్యాన్సర్ కారకాలైన రసాయనాలు ఉపయోగించడం ద్వారా చర్మ సంబంధమైన వ్యాధులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావడమే కాకుండా ప్రకృతిలో కాలుష్యం కూడా ఏర్పడుతుంది.

ఒక్కో రంగు మనిషి జీవితంలో ఒక్కో అనుభూతిని కలిగిస్తుంది. ప్రకృతి సిద్ధమైన రంగుల వలన మానవ శరీరానికి మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. సృష్టిలో ఒక్కో రంగు ఒక్కో ఆకర్షణ మన ఆలోచనల పైన మన మనస్సు పైన ఎంతో ప్రభావం చూపుతుంది. తెలుపు స్పష్టతకు స్వచ్ఛతకు ప్రతీక సున్నితత్వం ప్రశాంతతను కూడా వస్తుంది. ఆకుపచ్చ రంగు జీవ చైతన్యాన్ని పెంపొందిస్తుంది. ఎరుపు రంగుకు ఆకర్షించే గుణం ఎక్కువ ఉత్సాహానికి ఉద్వేగానికి ప్రతీక నీలం దివ్యత్వానికి ప్రతీక, మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను చురుకుదనాన్ని ఇస్తుంది. నలుపు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి చెడు శక్తులను తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. అందుకే మన ఆచార సాంప్రదాయం ప్రకారం సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి ఆనందంగా సంతోషంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో హోలీ పండుగను జరుపుకుందాం.. పర్యావరణ పరిరక్షణకు మన వంతు కృషి చేద్దాం.

(నేడు హోలీ పండుగ)

కొమ్మాల సంధ్య,

తెలుగు అధ్యాపకురాలు

91540 68272

Next Story

Most Viewed