20 ఏళ్ల మిస్టరీని మోసిన హిడ్మా.. ఎన్‌కౌంటర్ చుట్టూ అనుమానాలు నిజమేనా?

by Ravi |   (  Updated:2025-11-25 01:16:18  IST  )

ఆదివాసీల హీరోలు రాంజీ గోండు, కొమురం భీం, బిర్సాముండా గుండా దోర్.. ఆ త్యాగాల వీరుల పక్కన హిడ్మా తప్పక చరిత్రలో నిలుస్తారు. ఇంకా చెప్పాలంటే వీరవనితలు , దేవతలుగా మారిన సమ్మక్క సారలమ్మ

20 ఏళ్ల మిస్టరీని మోసిన హిడ్మా.. ఎన్‌కౌంటర్ చుట్టూ అనుమానాలు నిజమేనా?
X

ఆదివాసీల హీరోలు రాంజీ గోండు, కొమురం భీం, బిర్సాముండా గుండా దోర్.. ఆ త్యాగాల వీరుల పక్కన హిడ్మా తప్పక చరిత్రలో నిలుస్తారు. ఇంకా చెప్పాలంటే వీరవనితలు , దేవతలుగా మారిన సమ్మక్క సారలమ్మ మాదిరిగా హిడ్మా రేపటి తరానికి దేవుడు అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉద్యమ పోరు గడ్డ.. వికసించి పరిమళించిన పువ్వర్తి వీరయోధుడిగా చరిత్రలో అధ్యాయంగా ఆయనకు ఓ పేజీ నిలుస్తుంది.

అసలు హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు సమాచారం రాగానే కొంత ఆశ్చర్యం వేసింది. నిజమా అనే సందేహం అంతలోనే ఫోటో.. ఆ వెంట వెంటనే ఫోటోలో ఉన్నది హిడ్మానా కాదా? అనేక ప్రశ్నలు నాలో నేనే వేసుకున్న.! నాకు సందేహం కలిగిన కొద్ది సేపటికే అది హిడ్మా ఫోటోనే అని అధికారులు ప్రకటించారు. ఎందు కంటే హిడ్మా గురించి మూడు దశాబ్దాల క్రితం నుంచి నాకు తెలుసు కాబట్టి.

నమ్మశక్యంగా లేని ఎన్‌కౌంటర్..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో అణువణువు తెలిసిన హిడ్మా పక్క రాష్ట్రంలో అందులోనూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్ అయ్యాడంటే నమ్మశక్యంగా లేదు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా నేలకొరిగారు అనేది మరీ షాక్ వార్త. అదీ కేవలం హిడ్మా, అతని భార్య రాజే మరో నలుగురు సభ్యులు ఉన్న బృందం తూటాలకు బలైందన్న వార్త దావానంలా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ, పత్రికలు, జాతీయ మీడియాకు చేరింది. నేనెప్పుడు హిడ్మాను కలిశానో.. ఆరోజు ఇప్పటికీ నా కళ్ల ముందే ఉన్నది.

గణపతి ఇంటర్వ్యూ కోసం వెళ్లినప్పుడు..

అది 2003వ సంవత్సరం, నాటి పీపుల్స్ వార్ పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇంటర్వ్యూ కోసం నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఐదుగురం మిత్రులం కలిసి పోయాం. సైకిళ్ల మీద ప్రయాణం.. చర్ల నుండి మా వెంట ఉన్న కొరియర్ చెప్పినట్టు మేము చేయాలి. మధ్య‌మధ్యలో కొరియర్‌లు మారుతున్నారు. చర్ల నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన తరువాత మమ్మల్ని ఓ చోట ఉండమని చెప్పి సమీపంలో ఉన్న ఊర్లోకి వెళ్లి మరో వ్యక్తితో మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆ వ్యక్తికి అప్పగించారు.‌ అప్పటికే మధ్యాహ్నం కావస్తోంది. ఆకలి వేస్తున్నది, వెంట తీసుకెళ్లిన బిస్కెట్‌లతో ఆకలి మంట తీర్చుకుందామని మాతో ఉన్న కొరియర్‌తో చెప్పితే మరి కొద్ది దూరంలో మీకు భోజనం ఏర్పాటు చేశారని తెలిపారు.. అక్కడికి పోయే సరికి దాదాపు రెండు గంటలు కావస్తోంది. పది నిమిషాల్లోనే వేడి వేడి భోజనం వడ్డించారు. విశ్రాంతి తీసుకోమని చెప్పి మరో వ్యక్తిని మాకు పరిచయం చేసి వెళ్లాడు.

అతడే కొరియర్ హిడ్మా

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇద్దరు కొరియర్‌లు మారారు. భోజనాలు చేయడంతో కొంతమందిమి నిద్ర పోయాం. మేమున్న చోటకు మరొక వ్యక్తి వచ్చి మమ్మల్ని అతని వెంట కాలి నడకన తీసుకుపోవడం మొదలు పెట్టారు. ఆ ప్రయాణంలో మాతో ఉన్న వ్యక్తిని నీ పేరు ఏంటి అని అడిగితే దేవా అని చెప్పాడు. ఇంకా ఎంత దూరం పోవాలంటే ఇక్కడే... ఇక్కడే అంటూ నాలుగు గంటల పాటు నడిచి వెళ్తే గమ్యం చేరుకుంటాం అని చెప్పి కొంత దూరం వెళ్లి మరో వ్యక్తితో కలిసి వచ్చి మమ్మల్ని అతనికి అప్పంచిన వ్యక్తే నేటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడావి హిడ్మా.

సెక్యూరిటీగా విధులు నిర్వహించి..

పీపుల్స్ వార్ పార్టీలో చేరిన తొలినాళ్లలో హిడ్మా తన తండ్రి పేరుతో పని చేశారు. 2003లో తన వయసు 20 సంవత్సరాలు అని చెప్పాడు. మేము వెళ్లిన ఇంటర్వ్యూ స్థలంలో సెక్యూరిటీ‌గా విధులు నిర్వహించారు. మాకు ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పిన పెద్దాయన భద్రతా కారణాల దృష్ట్యా ఆ సమయంలో అక్కడికి రాలేకపోయారు. పీపుల్స్ వార్ పార్టీ అదే ఏడాదిలో మావోయిస్టు పార్టీలో విలీనం సందర్భంగా ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని భావించి ఉండొచ్చు. ఆయన రాకపోవడంతో సోనూ దాదా, రామన్న, సుజాత అక్కల ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఆరు గంటలకు మొదలైన ఇంటర్వ్యూ నాలుగు గంటల పాటు జరిగింది. నాడు ఇంటర్వ్యూలో ఉన్న ముగ్గురిలో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ, సుజాతక్కలు లొంగి పోయారు. రామన్న అనారోగ్యంతో మృతి చెందారు..

నాడు దళ సభ్యుడు.. నేడు సీసీఎం

నాడు ఇంటర్వ్యూ స్థలానికి విలేకరుల బృందాన్ని తీసుకు‌పోయిన మడావి హిడ్మా, మేము చూసిన ఓ దళ సభ్యుడు ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యుడు కావడం మాకే విస్మయం కలిగించింది. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగింది. నేటి మావోయిస్టు పార్టీ అంతటికి మొన్నటి వరకు ఆయనే ఓ రక్షణ కవచం. మావోయిస్టు పార్టీకి కాబోయే కేంద్ర కమిటీ కార్యదర్శి అనే ప్రచారం లేకపోలేదు. హిడ్మా ఇలా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందుతాడని మేమెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే గత రెండున్నర దశాబ్దాలుగా అతని గురించి వింటున్నాము.

జవాన్‌ని వదిలేసిన హిడ్మా

20 సంవత్సరాల తర్వాత మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడావి హిడ్మా వ్యూహాత్మక దాడికి పాల్పడిన ఘటనలో 22 మంది సీఆర్పీ‌ఎఫ్ బెటాలియన్ జవాన్లు అమరులయ్యారు. 2022 ఏప్రిల్ 3న జరిగిన ఎన్‌కౌంటర్ సందర్భంగా ఒక జవాన్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.. సామాజిక కార్యకర్తలు, పత్రికా విలేకరుల చొరవతో కిడ్నాప్ చేసిన జవాన్‌ను ప్రజా‌కోర్టులో హాజరు పరిచి అందరి సమక్షంలో విడుదల చేశారు. మావోయిస్టుల అదుపులో ఉన్న జవాన్‌ను మావోయిస్టులు విడుదల చేస్తారనే సమాచారం నాకు అందింది. చర్ల నుండి కొంత మంది విలేకరులతో కలిసి ఘటనా స్థలానికి పోయి విడుదల వార్తలు లైవ్ ప్రోగ్రాం చేశాం.

ఆరుగురితో ఎలా దొరికాడు..?

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మావోయిస్టుల చెర నుంచి ఐదు రోజుల తర్వాత విడుదల అయిన జవాన్ చెప్పిన మాటలు వింటే మీరే ఆశ్చర్యపోతారు. జవాన్ రాకేశ్వర్ మాన్ సింగ్ ఏం చెప్పాడంటే.. హిడ్మా వద్ద అత్యంత బలశాలులు 20 మందికి పైగా అతనికి గన్‌మెన్‌లుగా ఉన్నారని, వారు కాకుండా మరో 50 మంది మూడంచెల భద్రతలో హిడ్మా ఉంటాడని తెలిపారు. అలాంటి హిడ్మా కేవలం ఆరుగురితో ఎలా దొరికారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

-దొడ్డా ప్రభుదాస్

జర్నలిస్టు

95508 45550

Next Story