- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైటెక్ సీఎం @ 75 ఇయర్స్
చిత్తూరు జిల్లా నారావారిపల్లె అనే మారుమూల కుగ్రామంలో 1950 ఏప్రిల్ 20న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి

శ్రమని ఆయుధంగా మలుచుకుని, విజయాన్ని బానిసగా చేసుకుని ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ధృవతారగా నిలిచారు. దేశ రాజకీయ రంగంలో అరుదైన విశిష్ట లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఆయనను మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి కొనియాడారు. అభ్యుదయ సమాజం కోసం ఆర్థిక, సామాజిక రంగా ల్లో ప్రపంచ రూపురేఖల్ని మార్చగలిగిన కొద్ది మంది వ్యక్తుల్ని వరల్డ్ ఎకానమీ ఫోరం గుర్తించింది. ఆ సంస్థ వరల్డ్ డ్రీం కేబినెట్ కు 14 మందిని ఎంపిక చేసింది. అందులో ఆయనకు స్థానం లభించడం తెలుగువారికి దక్కిన అరుదైన గౌరవం. ఆయన జీవితంలో ప్రతి అడుగు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన 74 వసంతాలు పూర్తిచేసుకుని 75 లోకి అడుగు పెడుతున్నారు.
చిత్తూరు జిల్లా నారావారిపల్లె అనే మారుమూల కుగ్రామంలో 1950 ఏప్రిల్ 20న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, విద్యార్థి దశలోనే ప్రజా సంక్షేమాన్ని ఎంచుకొన్నారు. చిన్ననాటి నుండి కృషి, పట్టుదల, అంకితభావం, కఠోర శ్రమ అలవరుచుకున్న నాయకుడు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయం ఆరంభమైంది. స్వర్ణాంధ్ర స్వాప్నికుడు, నిర్విరామ శ్రామికుడిగా కీర్తి గడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం విజన్ 2020 డాక్యుమెంటును రూపొందించారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేసి సంపద సృష్టికి బీజం వేశారు. హైదారాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. ఐటీ ద్వారా పరిపాలనలో సంస్కరణల వేగాన్ని పెంచారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపారు. ఎలక్ట్రానిక్ పరిపాలన, సుపరిపాలనతో హైటెక్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ముద్ర పడింది. 1998లో హైటెక్ సిటీని నిర్మించి హైదరాబాద్‌ను సాప్ట్‌వేర్ రంగానికి తలమానికంగా నిలిపారు. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలినీయంగా అభివృద్ధి చెందడంతో చంద్రబాబు ఖ్యాతి అర్థమైంది.
తనే ఒక సైన్యంలా సాధన
విజన్‌తో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. విద్య, వైద్య రంగాల వికాసానికి బాటలు వేశారు. 19 ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి విద్యా సంస్థలు స్థాపించి విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. కోటి 11 లక్షల మంది సభ్యులతో డ్వాక్రాను దేశంలో మొదటి స్థానంలో నిలిపారు. జీనోమ్ వ్యాలీకి ముందుచూపుతో పునాది వేయడం ద్వారా కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనడానికి మార్గం సుగమమైంది. రాజధాని, పోలవరం నిర్మాణం, ఏపీని తిరిగి నిలబెట్టడానికి తనే ఒక సైన్యంలా యుద్ధం చేస్తున్న సాధకుడు ఆయన. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆయన ధ్యాస, శ్వాస. ఆయనొక పెర్ఫార్మర్, ఒక రిఫార్మర్. విశ్రాంతి అవసరం లేని, సమయం తెలియని నాయకుడు.
కారు చీకట్లలోనూ కర్తవ్య పాలన
రాష్ట్ర విభజన అనంతరం కారు చీకట్లలోనూ కర్తవ్య పాలన చేసి శిథిలమైన నవ్యాంధ్రను ఐదేళ్లలో శిఖరాగ్రానికి చేర్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తానే మొదటి కూలీనంటూ పరిపాలన ప్రారంభించారు. దార్శనికతతో భవ్య భవితకు బలమైన పునాది వేశారు. కష్టాల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చడానికి ఒక కర్మయోగిలా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. కూర్చోవడానికి కుర్చీ లేదు, సమావేశాలకు వేదికలు లేవు. బస్సులో పడుకొని పరిపాలన సాగించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఏపీని ఆదర్శంగా నిలిపారు. పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిపారు. ఆయన ఒక్క పిలుపునకు స్పందించి రైతులు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూములు ఇవ్వడం గర్వకారణం. ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు.
పది నెలల్లోనే వృద్ధి రేటు 8.21 శాతం
గత పాలకులు విధ్వంసం చేసిన రాష్ట్ర రూపురేఖలను వేగంగా మార్చాలన్న ఆతృత చంద్రబాబుది. ఆదాయం పెంచుకోవడానికి మౌలిక వసతుల కల్పన, మానవ వనరుల అభివృద్ధికి గల అవకాశాలను తెలుసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ పది నెలల పాలనలోనే 60కి పైగా కంపెనీలు రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఈ పరిశ్రమల ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి లభిస్తుంది. వృద్ధాప్య పెన్షన్‌ను రూ.4వేలకు పెంచారు. దీపం పథకం, అన్నా క్యాంటీన్‌లను తిరిగి ప్రారంభించారు. డీఎస్సీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పది నెలల్లోనే రాష్ట్రం 8.21 శాతం వృద్ధి సాధించడం గర్వించదగ్గ విషయం. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా వృద్ధిరేటులో దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. పి-4 విధానం ద్వారా రాష్ట్రంలోని పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమాజంలో సంపన్నులుగా ఉన్న పది శాతం మంది చేయూత ద్వారా అట్టడుగున ఉన్న ఇరవై శాతం మందిని ఆర్థికంగా పైకి తీసుకురావడమే పీ-4 విధానానికి ఆయన చేసిన విజ్ఞప్తులకు బాగానే స్పందన లభిస్తోంది.
ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా..
రాజకీయాల్లో తన భవిష్యత్‌ను తనకు తాను నిర్మించుకున్నారు. ఒక ప్రాంతీయ పార్టీని బలమైన శక్తిగా నిలిపిన ఘనత ఆయనదే. అనేకమంది నేతలతో పోలిస్తే అత్యంత ప్రజాస్వామిక వాదిగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారు. తన వయసును, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా నిత్యం ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. జాతి కోసం, ప్రగతి కోసం 47 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్న ఆ మహానాయకుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ తెలుగు ప్రజల తరపున, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
(నేడు చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం)
- మన్నవ సుబ్బారావు
గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్
99497 77727






