- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్యమే మహాభాగ్యం-ఆరోగ్యకర జీవనశైలికి నేటి అవసరం!
ఆరోగ్యమే మన జీవితానికి మూలాధారం. సమతుల ఆహారం, వ్యాయామం, క్రమబద్ధ జీవనం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, జంక్ ఫుడ్ ప్రభావం, మహిళలు మరియు పిల్లల ఆరోగ్య ప్రాముఖ్యతపై ఈ వ్యాసం వివరిస్తుంది.

ఆరోగ్యం మనిషి జీవితానికి మూలాధారం. ధనం, విద్య, అభివృద్ధి అన్నీ ఆరోగ్యంతోనే అర్థవంతమవుతాయి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది. కుటుంబం బలంగా ఉంటే సమాజం సుస్థిరంగా ఉంటుంది. సమాజం సుస్థిరంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే మాట నేటికీ సత్యమే. ప్రతి ఏడాది ఏప్రిల్ 7న జరుపుకునే వరల్డ్ హెల్త్ డే మనకు ఆరోగ్య ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది. నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాం. ముఖ్యంగా మహిళలు కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం మధ్య తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సరైన పోషణ లోపం భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతుంది. మారుతున్న జీవన విధానం వల్ల ఆహారం, నిద్ర, శారీరక చలనం తగ్గిపోతున్నాయి. ఇప్పటి ఆహారపు అలవాట్లు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఆకలి లేకపోయినా తినడం, టీవీ లేదా మొబైల్ చూస్తూ తినడం వల్ల అధిక కేలరీలు తీసుకుంటున్నాం. ప్రాసెస్ చేసిన ఆహారాలు-చిప్స్, బిస్కెట్లు, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు-అధిక చక్కెర, ఉప్పు, కొవ్వుతో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవి అలవాటుగా మారి ‘ఫుడ్ నాయిస్’ సమస్యను పెంచుతున్నాయి. చిన్నారుల ఆరోగ్యం దేశ భవిష్యత్తుకు కీలకం. నేటి పిల్లలు ఆటలకు దూరమై డిజిటల్ ప్రపంచంలో మునిగిపోతున్నారు. జంక్ ఫుడ్, శారీరక చలనం లోపం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇది వారి మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిని మార్చాలంటే తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం అలవాటు చేయాలి. పాఠశాలలు, ప్రభుత్వాలు కూడా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. సమతుల ఆహారం, క్రమబద్ధ జీవనం, వ్యాయామం ఆరోగ్యానికి ముఖ్య స్తంభాలు. ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా జంక్ ఫుడ్‌కు దూరంగా, ఆరోగ్యకర జీవనశైలికి దగ్గరగా ఉండాలని సంకల్పించాలి.
(వరల్డ్ హెల్త్ డే సందర్భంగా)
-మేకిరి దామోదర్
95736 66650






