ఆరోగ్యం.. వ్యాపారమైపోయిన దేశం!

by Ravi |   (  Updated:2025-11-13 00:30:40  IST  )

ఆరోగ్యం.. వ్యాపారమైపోయిన దేశం!
X

సరసమైన ధరలకు మంచి ఆరోగ్య సంరక్షణ, సౌకర్యవంతమైన జీవితం పొందడం సమాజంలోని ప్రతి పౌరుని హక్కు. ఈ హక్కు పొందాలంటే నగరాలు, గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలలో తగినంత సంఖ్యలో ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు ఉండాలి. అందులో సిబ్బంది, అవసరమైన వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలు, మందులు ఉండాలి. అలాగే ఆరోగ్య సంరక్షణ ప్రదాతలైన- వైద్యులు, నర్సులు, పారా-మెడికల్ కార్మికులకు సురక్షితమైన జీవనోపాధి, సురక్షితమైన పని పరిస్థితులు, గౌరవప్రదమైన జీవన వేతనం,పెన్షన్ మొదలైనవి కలిగి ఉండాలి. అయితే వాస్తవం చాలా భిన్నంగా ఉంది. వైద్య సదుపాయాల హామీ ఇస్తున్న అత్యాధునిక ప్రైవేట్ ఆసుపత్రులలో సామాన్య ప్రజలకు అందుబాటులో లేని ఫీజులు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో అంతు లేని క్యూలు కిక్కిరిసిన వార్డులు, తగినంతగా లేని పడకలు, మందుల కొరత ఉండి దయనీయ పరిస్థితులు ఉన్నాయి. అక్కడి వైద్యులు, నర్సులు ఆరోగ్య కార్యకర్తలపై భయంకరమైన పని భారం, ప్రమాదకరమైన పని పరిస్థితులలో పని చేస్తున్నారు. ఆశా, అంగన్‌వాడి వంటి వివిధ ప్రభుత్వ పథకాల కింద పని చేసే ఆరోగ్య కార్యకర్తలు దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్నారు. అయినప్పటికీ వారిని కార్మికులుగా గుర్తించడం లేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, నర్సులు 10 సంవత్సరాలకు పైగా కాంట్రాక్టు పద్ధతిలో నెలకు కేవలం రూ.15,000-18,000 జీతంతో పనిచేస్తున్నారు. వారిలో చాలామంది ఒకేసారి 100 కంటే ఎక్కువ మంది రోగులను చూసుకోవాల్సి వస్తుంది. వారికి పెన్షన్ లేదు, బీమా సౌకర్యం లేదు. రోగులు సహజంగానే ఎక్కువ గంటలు వేచి ఉండటం పేలవమైన ఆరోగ్య సంరక్షణ సేవలతో కోపంతో నిరాశకు గురవుతూ వారి బాధితులైన వైద్యులు, నర్సులపై ఆవేశం వెళ్లగక్కుతున్నారు. అందుకే ప్రభుత్వం ప్రజారోగ్య శాఖకు అధిక నిధులు కేటాయిస్తే వైద్య సిబ్బంది జీతభత్యాలతో పాటు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే వీలు ఉంటుంది.

-ఆళవందార్ వేణు మాధవ్

86860 51752

Next Story