- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్వాడీలు మన నెత్తికెక్కారా.. మనం ఎక్కించుకున్నామా?
తెలంగాణలో మార్వాడీ వ్యతిరేక నినాదాలు ఎప్పటినుంచో జరుగుతు న్నాయి. అయితే ఇంత పెద్ద ఎత్తున కాదు. అది స్థానికంగానే

తెలంగాణలో మార్వాడీ వ్యతిరేక నినాదాలు ఎప్పటినుంచో జరుగుతు న్నాయి. అయితే ఇంత పెద్ద ఎత్తున కాదు. అది స్థానికంగానే సమిసిపో యేది. కానీ ఈ మధ్య పార్కింగ్ వివాదంలో మార్వాడీ వ్యక్తులు స్థానికులను కొట్టడంతో ఈ వివాదం పెరిగింది. మార్వాడీ వ్యాపారుల వల్ల గ్రామీణ తెలంగాణలోని చిరు వ్యాపారులు నష్టపోతున్నారంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ సమస్య ముదిరి బంద్ దాకా వెళ్లింది. ప్రస్తుతం ఈ ఆందోళన వ్యాపార పరిధిని దాటి రాజకీయ, మత పరమైన అంశంగా మారింది.
‘మార్వాడీలు ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నారు. మన సంస్కృతిలో కలిసిపోయారు’ అంటున్నారు కొందరు పార్టీ నేతలు.. కానీ ‘మార్వాడీలు ఎప్పుడూ ఇక్కడి సంస్కృతిలో కలిసి పోలేదు. వారు ఇక్కడి సంస్కృతితో మమేకం కాలేదు’ అంటున్నారు ఉద్యమ కారులు. నిజానికి మార్వాడీలు ఈ సంస్కృ తిలో ఎప్పుడూ కలిసిపోలేదు. తెలుగు మాట్లాడేవారు మార్వాడీ షాపులోకి వెళ్లినప్పుడు, హిందీ మాట్లాడేవారు ఆ షాపులోకి వెళ్లినప్పుడు ఆ మార్వాడీ యజమాని చూపించే తేడా ఇందుకు చక్కని ఉదాహరణ.
వాళ్ల సంస్కృతిని ఎన్నడూ మనపై రుద్దలేదే?
పెట్టుబడి బలం ఉన్నవారు, వ్యాపార తత్వం ఉన్న మార్వాడీలు భారతదేశం నలుమూలలకూ పాకినట్లే తెలంగాణలోనూ పాతుకుపోయారు. అంతమాత్రానా గో బ్యాక్ అనే పిలుపు దీనికి పరిష్కారం కాదేమో? అందరూ ఆలోచించాలి. నా ప్రశ్నేమిటంటే, నిజంగా ఒకరు మరొకరి సంస్కృతిలో కలిసిపోవాలా? అది అత్యవసరమా? సంస్కృతిలో కలిసిపోకుండా ఇక్కడి వారితో కలిసి ఉండటం కుదరదా? ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భావన మూలం ఇదే కదా? అలాంటప్పుడు మార్వాడీలు మన సంస్కృతిలో కలిసిపోవాలని కోరడం కరెక్టేనా? మార్వాడీలు ఇక్కడి వారితో పెళ్లిళ్లు చేసుకున్నా సరే, లోలోపల వారి సంస్కృతే కొనసాగుతూ ఉంటుంది. అది తప్పని మనమెందుకు అనుకోవడం? మన సంస్కృతి మనకెలా గొప్పో, వాళ్ల సంస్కృతి వాళ్లకు గొప్పగా ఉంటుంది కదా? దాన్ని కాదనడానికి మనమెవరం? వాళ్లు ఎన్నడూ తమ సంస్కృతిని మనపై రుద్దలేదు. మనమే వాళ్ల పెళ్లి పద్దతులను, పెళ్లి సంబరాలను మనకు మనం అరువు తెచ్చుకున్నాం. పెళ్లిళ్లలో ఎన్నడూ లేని ఆర్భాటపు ఖర్చులు, సంపద ప్రదర్శనలు, డాబుసరి డ్యాన్సులు వాళ్ల నుంచి మనం స్వీకరించినా ఇది మర్చిపోయి మార్వాడీలు ముంచేశారు అంటే ఎలా?
మనం అరువు తెచ్చుకున్నాం..
ఇంకోటి.. మార్వాడీలు మన సంస్కృతిని నీచంగా చూస్తున్నారన్న ఆరోపణ. ఎలా? ఏ అంశాన్ని బట్టి ఈ నిర్ధారణకు వస్తున్నాం? నిజానికి మనమే వాళ్ల సంస్కృతిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నాం. 20 ఏళ్ల క్రితం పెళ్లిళ్లలో అమ్మాయి, అబ్బాయి అందరూ చూస్తుండగా మంగళ స్నానాలు చేసే పద్ధతి లేదు. పసుపు రాసి స్నానానికి పంపేవారు, లేదా ఓ చెంబు తల మీద పోసి ఊరుకునేవారు. ఇప్పు డు తల మీద పసుపు నీళ్లు, పాలు, కొబ్బరి నీళ్లు, బీరు, విస్కీ. అన్నీ పోస్తున్నారు. అదంతా మన సంస్కృతా? ఎవరు ఎవరి సంస్కృతిని తక్కువ చేసినట్లు? ఎవరు ఎవరిని నెత్తిన పెట్టుకున్నట్లు? గతంలో పెళ్లికి ముందు రోజు పందిరి, పెళ్లి, ఆ తర్వాత రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉండేవి. ఇప్పుడు హల్దీ అని, మెహందీ అని, బ్యాచిలర్ పార్టీ అని, బారాత్ అని, నెత్తిన పగిడీ అని..అన్నీ వచ్చి చేరాయి. ఆ ప్రకారం, సమస్త డబ్బు దండగ కార్యక్రమాలను మనం ఓన్ చేసు కున్నాం. మార్వాడీలకు డబ్బుంది. చేసుకుంటా రు. మరి మనకేం మాయరోగం? ఎందుకంత ఖర్చు?
‘తాళి’ని కూడా ‘మంగల్‌సూత్ర్’ అంటున్నాం!
వాళ్లేదో వాళ్ల దగ్గరున్న డబ్బుల్ని ఖర్చుపెట్టి, వాళ్ల సంస్కృతిలో భాగంగా పెళ్లి చేసుకుంటుండగా, మనం అతిథులుగా అక్కడ దూరి, ఆ రంగులు, జిగేలు చూసి చంకలు గుద్దుకుని, మన పెళ్లిళ్లలో బలవంతంగా అవి పాటించేసి, ఈవెం ట్ మేనేజర్లకు అవే అలవాటు చేసి, చివరకు ‘తాళి’ని కూడా ‘మంగల్‌సూత్ర్’ అని పిలిచే స్థితికి చేరాక.. ఇప్పుడొచ్చి ‘మార్వాడీలు మన సంస్కృతి లో కలిసిపోలేదు’ అని అంటే ఎవరికి నష్టం? ఎవరిది తప్పు? వాళ్ల సంస్కృ తిని మనం నెత్తికెక్కించుకొని ఊరేగాం తప్ప వాళ్లు మన మీద రుద్దారా? తుల్జామాత, భవానీ మాత అని వాళ్లు గుడులు కడితే వెళ్లాం కానీ, మన పోలేరమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ గుళ్లకు వాళ్ల రాకపోకలు గమనించామా? వాళ్లొచ్చి బతుక మ్మ పేర్చడం ఏనాడైనా చూశామా? పోతురాజు గావు పట్ట డం, మేక జడ్తి ఇవ్వడం వాళ్లు ఏనాడైనా వచ్చి పరిశీలించారా?
ఏ సంస్కృతిలోనూ వాళ్లు కలవరు..
మార్వాడీలు మన సంస్కృతిలో కలవరు. ఇక్కడే కాదు, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎక్కడికి వెళ్లినా వారు స్థానిక సంస్కృతిలో కలి సినట్లు కనిపిస్తారు కానీ కలవరు. స్థానిక భాష మాట్లాడినా అది హిందీలాగే వినిపిస్తుంది. అయితే మన తెలుగువాళ్లం మాత్రం మార్వాడీ ల సంస్కృతిని వదలం. మన చుట్టూ ఉండే మార్కెట్ కూడా దాన్ని వదలనివ్వదు (దానికి డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి). రేపు మన ఇళ్లల్లో పెళ్లిళ్లలో మెహందీకోరోజు, హల్దీకోరోజు పెట్టి గ్రాండ్‌గా వేడుకలు చేస్తాం. మన నలుగును, గోరింటాకును, పారాణిని దూరం పెడతాం. తెలుగు సీరియల్స్‌లో బట్టలు, నగ లతో సహా సాంస్కృతికంగా పక్క వాళ్లను కాపీ కొడుతున్న మనకు ‘మీ సంస్కృతి మా మీద రుద్దారు’ అని మార్వాడీలను అనే హక్కు ఉందా? లేదా అని ఒకసారి ఆలోచించుకోండి.
ఆటు ఆధిపత్యం.. ఇటు ఆత్మన్యూనత!
ఆధిపత్య ధోరణి మార్వాడీల ప్రవర్తనలో కాదు, 'మనం తక్కువ.. మన సంస్కృతి తక్కువ' అనే మనలోని భావనలో ఉంది. ఎవరి సంస్కృతిని అయినా వెంటనే అలవర్చుకునే, అరువు తెచ్చుకునే, సొంతం చేసుకునే తత్వం మనది. అది పోనంతకాలం ఎవరు పోయినా, వచ్చినా ఏమీ మారదు.
- విశీ (వి.సాయివంశీ)
రచయిత, సమీక్షకులు
90108 66078






