- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12 ఏళ్ల పనిచేసినా.. మాకు గుర్తింపు ఉండదా?
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను నమ్ముకొని ఏళ్లుగా పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్ల భవిష్యత్తు వీధిన పడింది.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను నమ్ముకొని ఏళ్లుగా పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్ల భవిష్యత్తు వీధిన పడింది. పోస్టు గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ లాంటి ఇతర ఉన్నత కోర్సులు చదివి 12 ఏళ్లుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్య అభివృద్ధికై రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్లతో సమానంగా పనిచేసినా, వారితో పాటు సమానంగా విద్యార్హతలు ఉన్నా.. గెస్ట్ లెక్చరర్లకు కనీస గుర్తింపు కూడా లేకుండా పోయింది. ఇన్ని రోజుల మా శ్రమ నిరుపయోగంగా మారింది. ఏ ప్రభుత్వాలు మా గోడును పట్టించుకోవడం లేదు.
మేం పేరుకే గెస్ట్ లెక్చరర్లు అయినా త్రిమెన్ కమిటీల ద్వారా ఎంపికై జూనియర్ కాలేజీల్లో అమలవుతున్న నిర్ణీత టైం టేబుల్ ప్రకారం బయోమెట్రిక్ హాజరు ద్వారా ఉదయం నుంచి సాయంత్రం దాకా విధులు నిర్వహించాం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరగడంతో పీజీ పట్టాలు చేతపట్టినా ఏదో ఓరోజు తమ ఉద్యోగాలకు భద్రత వస్తుందేమోనన్న ఆశతో కూలీల కంటే దయనీయ జీవితాలను మేం గడుపుతున్నాం. కానీ చివరకు 12 ఏళ్ల పాఠాలు చెప్పిన అనుభవం, గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగాలు గాలిలో దీపంగా మారి అధి కారులు, ప్రజా ప్రతినిధుల నిర్ణయాలతో నడిరోడ్డున పడుతుండడం అత్యంత బాధాకరం.
ప్రభుత్వాలు మారినా..
రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సుమారు 12 ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల తలరాతలు ప్రభుత్వాలు మారి నా ఏమాత్రం మారడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ప్రభుత్వ శాఖల్లోనూ కాంట్రాక్ట్, గెస్ట్, ఔట్ సోర్సింగ్ అనే పదాలు లేకుండా ఉద్యోగాలు ఉంటాయని ఆనాటి ప్రభుత్వ పెద్దలు చెప్పిన హామీలు నీటి మూటలయ్యాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తమ రాజకీయ లబ్ధికోసం కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసింది. కానీ గెస్ట్ లెక్చరర్లను గాలికి వదిలేసింది. ప్రస్తుతం వీరు పీరియడ్‌కు రూ.390 చొప్పున ప్రతినెలా 72 పీరియడ్లు మించకుండా నెలకు రూ.28,080 చెల్లిస్తున్నారు. అవి కూడా కేవలం 10 నెలలకే చెల్లించడం విశేషం. గత విద్యా సంవత్సరం పనిచేసిన గెస్ట్ లెక్చరర్లకు ఇంకా ఆరు నెలల జీతాలు 2025 ఆగష్టు నాటికి కూడా చెల్లించలేదంటే వీరి దయనీయ పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా గత విద్యాసంవత్సరం టీజీపీఎస్సీ ద్వారా 1654 మంది జూనియర్ లెక్చరర్లను కొత్తగా నియమించడంతో ఇది వరకు పనిచేసిన గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగాలకు శాపంగా మారింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మెనిఫెస్టోలో గెస్ట్ లెక్చరర్లకు నెలకు రూ.42 వేల వేతనంతో 12 నెలలకు వేతనాలు చెల్లి స్తామని హామీనివ్వడంతో పాటు వారిని రెగ్యూలర్ చేస్తామని అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేస్తామని వారు హమినివ్వడంతో గెస్ట్ లెక్చరర్లు ప్రస్తుత మంత్రుల, ఎమ్మెల్యేల, ఇంటర్ బోర్డు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా వారి హామి ఇప్పటి వరకు ఎలాంటి కార్యరూపం దాల్చడం లేదు.
ఆర్థిక శాఖ కొర్రీలతో సతమతం...
గత విద్యా సంవత్సరం కొత్తగా నియామకమైన 1256 మంది రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లకు నచ్చిన జూనియర్ కాలేజీలను ఎంచుకుని జాయిన్ అయ్యారు. దీంతో ఎక్కడైతే రెగ్యులర్ లెక్చరర్లు జాయిన్ అయ్యారో అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. కొన్ని జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్లు జాయిన్ కాకపోవడంతో ఆ స్థానంలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు బ్రతుకు జీవుడా అంటూ కొనసాగుతున్నారు. రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం మంజూరైన జూనియర్ కాలేజీల్లోకి జాబ్ కోల్పోయిన గెస్ట్ లెక్చరర్లను సీనియారిటీ ప్రాతిపదికన 2025 జూన్ నుంచి ఆయా జిల్లాల డీఐఈఓలు నామమాత్రంగా నియమించారు. కానీ ఇప్పుడు 1654 మంది గెస్ట్ లెక్చరర్లలో రెగ్యులర్ లెక్చరర్లు రావడంతో డిస్టర్బ్ అయిన వారిని గాలికి వదిలేశారు. కొన్ని కాలేజీల్లో ఇంటర్ బోర్డు అధికారుల నోటి మాటలతో డీఐఈఓలు తాత్కాలికంగా నియమించి పని చేయించుకుంటున్న వారికి జీతాలు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ కొర్రీలు పెట్టడం విశేషం. అసలే అరకొర వేతనాలు, అవికూడా వస్తాయో, రావో తెలియని పరిస్థితుల్లో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు దినదినగండంగా మారింది.
ఇద్దరూ పట్టించుకోకపోవడంతో..
ఇదిలా ఉండగా కొత్తగా నియామకం అయిన రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు తమకు నచ్చిన జూనియర్ కాలేజీల్లో పనిచేసేందుకు ఓడీ (ఆన్ డ్యూటీ) పేరుతో మరో కొత్త సమస్య తెరమీదికి తీసుకువచ్చారు. ఇప్పుడు పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పని చేసేలా ఆదేశాలు ఇవ్వాలని తమకు మాత్రం తమకు అనుకూలంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో ఓడీ సౌకర్యం కల్పించాలని ఇంటర్ బోర్డు అధికారులపై ఒత్తిడి తెస్తుండడం గెస్ట్ లెక్చరర్లకు మరింత సమస్యగా మారింది. ఉన్నత విద్య చదివిన గెస్ట్ లెక్చరర్లను అటు ఇంటర్ బోర్డు అధికారులు గాని ఇటు ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని గెస్ట్ లెక్చరర్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇంటర్ విద్య కోసం కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం అందులో పాఠాలు చెప్పే లెక్చరర్ల విషయంలో కనీస పట్టింపు లేకుండా గాలికి వదిలేయడంపై వారు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇప్పటికైనా పాఠాలు చెప్పే గురువులను గుర్తించాలని వేడుకుంటున్నారు. వారి సమస్యలను పరిష్కరించి గతేడాది ఆరు నెలలు, ఈ ఏడాది పెండింగ్ వేతనాలను సైతం ఇప్పించాలని కోరుతున్నారు.
-ముంత శివలీల,
గెస్ట్ లెక్చరర్
93906 52845






