నేతన్న నెత్తిపై జీఎస్‌టీ బండ

by Bhoopathi Nagaiah |

పత్తి ఉత్పత్తిలో దేశంలోనే మూడో స్థానంలో ఉంది తెలంగాణ. గుజరాత్‌, మహారాష్ట్ర తరువాత తెలంగాణాలోనే పత్తి ఎక్కువ ఉత్పత్తి అవుతోంది.

నేతన్న నెత్తిపై జీఎస్‌టీ బండ
X

మోదీ ప్రభుత్వ విధానాలు బడా కార్పోరేట్‌ సంస్థలకు మేలు చేసేలా ఉంటున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్ట్స్‌టైల్‌ రంగమే ఇందుకు ఉదాహరణ. వస్త్రోత్పత్తిలో చిన్న పరిశ్రమలకూ అదే 5శాతం జీఎస్‌టీ వసూలు చేయడం వల్ల బడా కార్పోరేట్‌ కంపెనీలతో పోటీ పడలేక పోతున్నారు నేతన్నలు. దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తిలో టెక్ట్స్‌టైల్‌ రంగం13 శాతం వాటా కలిగి ఉంది. ఇందులో 45 మిలీయన్లకు పైగా గ్రామీణ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సగానికి పైగా ఎంఎస్‌ఎంఈలపై అధార పడి పొట్టబోసుకుంటున్న వారే ఉన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో బడా కార్పోరేట్‌ సంస్థలూ మన దేశంలో వస్త్రోత్పత్తులు కొనసాగిస్తున్నాయి. వాటితో పేద, మధ్య తరహా చేనేత, పవర్‌ లూమ్‌ పరిశ్రమలు పోటీ పడలేక చితికిల పడుతున్నాయి.

కుటీర పరిశ్రమకు ప్రోత్సాహమేది

2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా టెక్ట్స్‌టైల్‌ ద్వారా జీఎస్‌టీ రూపేణా 22 లక్షల కోట్లు వసూలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. కేంద్రానికి వచ్చిన ఆదాయంలో చిన్న, మధ్యతరహా వస్త్ర పరిశ్రమలకు అందిస్తోన్న ప్రోత్సాహకాలు ఎక్కడా కనబడడం లేదు. ఒకవైపు 5శాతం జీఎస్‌టీ వసూలు చేయడం.. మరోవైపు కార్పోరేట్‌ సంస్థ ఉత్పత్తులతో పోటీ పడలేక నేతన్నలు చితికి పోతున్నారు. చేనేత సహకార సంఘాలు, కార్మికులకు ఇన్సెంటీవ్స్‌, మార్కెట్‌ పోటీని తట్టుకునేలా శిక్షణ, ఎగ్జిబిషన్స్‌ లాంటివి ఏర్పాటు చేయడం లేదు. దీనివల్ల చారిత్రాత్మక చేనేత కుటీర పరిశ్రమ కుదేలౌతోంది.

ఇక్కడి పత్తి..ఇతర రాష్ట్రాలకు..!

పత్తి ఉత్పత్తిలో దేశంలోనే మూడో స్థానంలో ఉంది తెలంగాణ. గుజరాత్‌, మహారాష్ట్ర తరువాత తెలంగాణాలోనే పత్తి ఎక్కువ ఉత్పత్తి అవుతోంది. అయినప్పటికీ ఇక్కడ ఆ స్థాయిలో స్పిన్నింగ్‌ మిల్లులు లేవు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న పత్తిలో కేవడం 20 శాతం మాత్రమే స్థానిక జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లులకు వెళ్తోంది. సిరిసిల్ల, అంతర్గాం, సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌..లాంటి ప్రాంతాల్లో ఎంతో నాణ్యమైన నూలు అందించిన స్పిన్నింగ్‌ మిల్లులు మూత పడడం పరిశ్రమ తిరోగమనానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఇక్కడి పత్తి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తోంది. డిమాండ్‌ లేక పత్తి ధర పడిపోవడంతో ఇటు రైతులు నష్టపోతుండగా.. సంబంధిత పరిశ్రమలు ఏర్పడక తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాలూ కరువయ్యాయి.

మార్కెట్‌ పోటీని తట్టుకోలేక..

తెలంగాణలో యేటా సుమారు 65 బిలియన్‌ మీటర్ల వస్త్రోత్తి జరుగుతోంది. ప్రధానంగా చేనేత, పవర్‌ లూమ్‌ పరిశ్రమ ద్వారా వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఎక్కువ శాతం టెస్కో ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలకు సరఫరా అవుతున్నాయి. బహిరంగ మార్కెట్‌ పోటీని చేనేత వస్త్రాలు తట్టుకోలేక పోతున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్‌లా హంగులు, ప్రచార ఆర్భాటాలు పబ్లిసిటీ చేయలేక పోతున్నారు నేతన్నలు. దీంతో సిరిసిల్లలో తయారు అవుతున్న చీరల ఉత్పత్తిలో సగం వరకు జీఎస్‌టీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోన్నా..మరో సగం వరకు మాక్‌ సొసైటీలు భరించాల్సి వస్తోంది.

మేక్‌ ఇన్‌ ఇండియా నినాదాన్ని పదే పదే చెబుతున్న మన ప్రధాన మంత్రి.. ఆ స్థాయిలో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం సైతం..వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా కృషి జరిగితేనే తెలంగాణ రైజింగ్‌`2047కు సార్థకత ఉంటుంది.

-చిలగాని జనార్దన్

81219 38106

Next Story