గ్రూప్-2 తీర్పు చరిత్రాత్మకం..

by Bhoopathi Nagaiah |

గ్రూప్–2 నోటిఫికేషన్‌పై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. వాటిలో తొమ్మిది కేసులు మెయిన్స్ పరీక్ష పూర్తయిన తరువాత, నోటిఫికేషన్ రద్దు కోరుతూ దాఖలయ్యాయి.

గ్రూప్-2 తీర్పు చరిత్రాత్మకం..
X

న్నో రోజులుగా తీర్పు కోసం ఎదురుచూస్తున్న గ్రూప్–2 అభ్యర్థుల ఉత్కంఠకు గత మంగళవారం నాడు తెరపడింది. గ్రూప్–2 నోటిఫికేషన్‌లో రిజర్వేషన్ అంశాల్లో తప్పులు ఉన్నాయంటూ, నోటిఫికేషన్ రద్దు కోరుతూ దాఖలైన అన్ని వ్యాజ్యాలను కొట్టివేస్తూ జస్టిస్ న్యాపతి విజయ్ గారి ధర్మాసనం ఇచ్చిన తీర్పు అభ్యర్థులకు శుభపరిణామం. ఈ తీర్పు, తమకు సంబంధం లేకపోయినా అనవసరంగా కేసులు వేస్తూ నియామక ప్రక్రియకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించే వారికి చెంపపెట్టు లాంటిదిగా మారింది.

కేసు నేపథ్యం

2023 డిసెంబర్‌లో జారీ చేసిన గ్రూప్–2 నోటిఫికేషన్ మొదటి నుంచీ అనేక అడ్డంకులను ఎదుర్కొంది. 2024 ఫిబ్రవరి 25న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 4.70 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ప్రిలిమ్స్‌కు ముందే నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఒక వ్యాజ్యం దాఖలవడం గమనార్హం. ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం కఠినంగా ఉందని అభ్యర్థులు వినతిపత్రాలు ఇవ్వడంతో, ఎపిపియస్సి 1100 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసింది. దీని ఫలితంగా 150 మార్కుల్లో కేవలం 18 మార్కులు వచ్చిన అభ్యర్థులు కూడా మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇది ఎపిపియస్సి చేసిన పెద్ద విధానపరమైన పొరపాటుగా భావించవచ్చు.

ఆ తరువాత ప్రభుత్వం మారడం, అప్పటి చైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఖాళీ కారణంగా నియామక ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. మెయిన్స్ పరీక్ష తేదీలు రెండుసార్లు మారడం, ఫిబ్రవరిలో జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గారు పరీక్ష వాయిదాకు నిరాకరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ దశలో “నోటిఫికేషన్‌లో తప్పులు ఉన్నాయి, ఇది నిలబడదు” అంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందిన పుకార్ల వల్ల అభ్యర్థులు తీవ్రంగా అయోమయానికి గురై, మెయిన్స్ పరీక్షకు ముందు రోడ్డెక్కాల్సి వచ్చింది. విచారణ జరిపిన న్యాయమూర్తి నోటిఫికేషన్‌పై ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ అనామకుల ప్రసంగాలు, పోస్టులు నమ్మి తప్పుదోవ పట్టడం అత్యంత విచారకరం.

కేసులతో అడ్డుకునే ప్రయత్నాలు

గ్రూప్–2 నోటిఫికేషన్‌పై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. వాటిలో తొమ్మిది కేసులు మెయిన్స్ పరీక్ష పూర్తయిన తరువాత, నోటిఫికేషన్ రద్దు కోరుతూ దాఖలయ్యాయి. 2023 డిసెంబర్‌లో జారీ చేసిన నోటిఫికేషన్‌లో తప్పులున్నాయంటూ, పరీక్షలన్నీ పూర్తయ్యాక 2025 మార్చిలో కేసులు వేయడం హాస్యాస్పదమే. తప్పులు ఉంటే సరిదిద్దాలని కోరాలి. కానీ ఉన్నపళంగా నోటిఫికేషన్‌ను రద్దు చేయమని ప్రతి పిటిషన్‌లో అడగడం ఎంతవరకు సమంజసం? దీనిపై ఇప్పటికైనా సంబంధిత పిటిషనర్లు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. “ఎన్ని కేసులు వేస్తే అంత లాభం” అనే భావన ఈ సందర్భంలో పూర్తిగా బూమరాంగ్ అయింది. పద్మవ్యూహాల పేరుతో పెద్ద సంఖ్యలో కేసులు దాఖలు చేసి, ఏదో ఒక విధంగా స్టే తెచ్చి నోటిఫికేషన్‌ను ఇరుకున పెట్టాలని చూసిన ప్రయత్నాలను ఇంప్లీడ్ పిటిషన్ల ద్వారా అడ్డుకోవడం సాధ్యమైంది. ఈ తీర్పు నియామక ప్రక్రియల విషయంలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. తమకు సంబంధం లేకపోయినా, లాభం ఉండదని తెలిసినా కేసులు వేసి డబ్బులు దండుకోవాలని చూసే వారి ఆటలను అడ్డుకునే దిశగా ఇది ఒక కీలక అడుగు.

అభ్యర్థుల ముందున్న దారి

ప్రస్తుతం 12 జాబితాలో ఉన్న అభ్యర్థులు తమ లక్ష్యానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు. ఇప్పటివరకు చూపిన అప్రమత్తతను కొనసాగిస్తూ, కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు తుది దశకు సిద్ధమవ్వాల్సిన సమయం ఇది. ఇక నుంచి ఎపిపియస్సి మరియు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రక్రియను వేగవంతం చేయాల్సిన బాధ్యత అభ్యర్థుల మీదే ఉంది. పిటిషనర్లు డివిజన్ బెంచ్‌లో ఈ తీర్పును సవాలు చేసే అవకాశమున్నా, ఎపిపియస్సి ఏమాత్రం ఏమరపాటు లేకుండా అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉంది. అదే విధంగా, ఇక ఎలాంటి ఆలస్యానికి ఆస్కారం లేకుండా అంతిమ ఫలితాలు త్వరగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలి.

కోచింగ్ మాఫియా బుద్ధి మార్చుకోవాల్సిందే!

ఈ కేసుల విషయంలో అత్యంత క్రూరమైన పాత్ర పోషించింది కొన్ని కోచింగ్ సంస్థలే. నోటిఫికేషన్ రద్దయితే అభ్యర్థులు తమ సంస్థలకు గుంపులుగా వస్తారన్న ఆశతో, కుటిల బుద్ధితో విషప్రచారం చేశారు. నాన్నలూ… కన్నలూ…” అంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టి, సందట్లో సడెమియాగా డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతో వ్యవహరించిన ఫ్యాకల్టీలకు ఈ తీర్పు ఒక హెచ్చరిక. తామే తమకు “సార్” అనే ట్యాగ్ తగిలించుకుని, కోటు ధరించి అభ్యర్థులను తప్పుదోవ పట్టించే ఈ ఆర్టిస్టులు బుద్ధి మార్చుకోకపోతే, వినియోగదారుల సంరక్షణ చట్టాన్ని ప్రయోగించాల్సిన పరిస్థితి తప్పదు.

సమయపాలన అవసరం

నెలల తరబడి సాగుతున్న నియామక ప్రక్రియను కుదించేందుకు ఎపిపియస్సి సీరియస్‌గా అధ్యయనం చేయాలి. జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్, బ్యాంకింగ్ వంటి పరీక్షలు వేగంగా పూర్తవుతుంటే, రాష్ట్ర స్థాయిలో జరిగే ఎపిపియస్సి పరీక్షలు మాత్రం నెలలు, ఏళ్ల పాటు సాగుతున్నాయి. అంతిమ ఫలితాలకు ముందు సీపీటీ వంటి పరీక్షలు పెట్టడం వల్ల సమయం, ఆర్థిక వనరులు వృథా అవుతున్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ వంటి కఠిన దశలను దాటుకుని వచ్చిన అభ్యర్థిని, కేవలం కంప్యూటర్ పరిజ్ఞానం లేదన్న కారణంతో తిరస్కరించడం ఎంతవరకు న్యాయం ఉద్యోగానికి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమే. కానీ ఉద్యోగంలో చేరిన తరువాత శిక్షణ రూపంలో అందించవచ్చు. అన్ని అర్హతలను నిరూపించుకున్న అభ్యర్థిని సీపీటీ పేరుతో ఆపడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఇలాంటి ఉపయోగం లేని సీపీటీని చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం ఆసన్నమైంది.

జీవీ సాయికుమార్ గంట

93911 42989

Next Story