ఈ ప్రశ్నకు బదులుందా?

by Ravi |   (  Updated:2026-07-15 01:15:46  IST  )

స్వాతంత్ర్యం తర్వాత ఆధునిక భారత నిర్మాణంలో తొలి తరాల నాయకుల పాత్ర, శాస్త్రీయ దృక్పథం, ప్రజారంగ సంస్థలు, ఆనకట్టలు, విద్యా సంస్థల వారసత్వాన్ని నేటి రాజకీయ, సామాజిక పరిస్థితులతో పోలుస్తూ..

ఈ ప్రశ్నకు బదులుందా?
X

గోచీ గుడ్డ లేని మీ తాత .. దేశ విభజన ఎదుర్కొన్నాడు, చైనా వార్ ఎదుర్కొన్నాడు, బుడ్డి దీపాలతో పిల్లల జీవితాలలో వెలుగులు కోసం పరితపించాడు, IIT, AIIMS, IIMలు, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లంటూ ఆధునిక దేవాలయాలను నిర్మించాడు, కరువు నేలల్లో బాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జునా సాగర్ లాంటి జలాశయాలులు, భిలాయ్, రూర్కెలా లాంటి పారిశ్రామిక వాడలతో, ONGC, IOC, LIC లాంటి ప్రభుత్వరంగ సంస్థలతో నిరుద్యోగాన్ని ఎదిరించాడు, ఆకలిని జయించాడు.

మనువాదానికి కాలం చెల్లిందంటూ ఆడపిల్లల హక్కులకోసం హిందూ కోడ్‌ను అందించాడు. అసలీ దేశం నిలుస్తుం దా? కులాల, మతాలు, భాషల పేరుతో ముక్కలౌతుందని వెక్కిరించిన వాళ్ళ ముందు తలెత్తుకుని నిలబడ్డాడు, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక్కటే అని నిరూపించాడు...

మీ నాన్న ....

పోక్రాన్ అణు విస్పోటనాలతో అగ్రరాజ్యాలకు దీటుగా నేనున్నానని ప్రకటించారు, మిడిసి పడ్డ పాకిస్తాన్ నడ్డి విరగ్గొట్టి స్వతంత్ర బంగ్లాలో భారత త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా ఎగరేసి ప్రపంచానికి మేము సైతం అంటూ సవాలు విసిరిండు, మీజిల్స్, కలరా, మలేరియా, పోలియో అంటూ ఎన్నెన్ని రోగాలు మీదపడ్డా బెదిరిపోలేదు, దేవుని మీద భారం వేసి దీపాలు వెలిగించలేదు, శవాల దిబ్బలు ఏర్పడకుండా ప్రతి ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రపంచం ఆర్థక మాంద్యంతో విలవిలలాడుతున్నా తనదైన శైలిలో జాతిని ముందుకు నడిపించాడు, మెటా నుండి అమెజాన్ వరకు CEOల నందిస్తూ గర్వంగా మీసం మెలిపెట్టాడు.

మరి ఇవాళ నువ్వు ...

అడుగడుగునా అలసిపోతున్నావు, రాజీపడి మూలుగుతున్నావు, ప్రపంచంలో ఏ మూల అలజడి చెలరేగినా బెంబేలెత్తిపోతున్నావు. చదువుల భారాన్ని తలచుకుంటే నీ గుండెలు జారుతున్నాయి, రోగమొస్తే చాలు అప్పుల ఊభిలో కూరుకు పోతున్నావు. కరోనాను ఎదుర్కోలేక శవాల కుప్పలతో జాగారం చేసినావు, చివరాఖరుకు ఆక్సీజన్ దొరక్క అలల్లాడిపోయినవ్, ప్రపంచం వెక్కిరిస్తుందేమోనని చావులెక్కలు దాచిపెట్టి మేకపోతు గాంభీర్యంతో బతుకుతున్నావు, తాత నిర్మించిన కార్మిక దేవాలయాలను ఒక్కొక్కటిగా అమ్ము కుంటూ, తాత ముందు చూపుతో తీర్చిదిద్దిన ఆధునిక దేవాలయాల్లో నీ ఫోటోలు పెట్టుకుంటూ భజన చేయించుకుంటున్నావు. ప్రాజెక్టులు కట్టి తాత అందించిన నీళ్ళతో నారు మల్లను తడుపుకుంటూ నాకేమిచ్చావని ఆయన్నే నిందిస్తున్నవు. చదువుల కోసం, ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తున్న పిల్లలకు తాతను, తండ్రిని వేలెత్తి చూపిస్తూ నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నావు. దేశ విభజనలో సైతం మీ తాతకు కానరాని మత పిశాచి, పాకిస్తాన్ యుద్దంలో సైతం మీ నాన్నకు అడ్డురాని మతోన్మాదం ఆధునిక యుగంలో నీకు మాత్రం కనిపిస్తున్నది, భయంతో బెంబేలెత్తిస్తున్నావు.

సైంటిఫిక్ టెంపర్ నుంచి గో మూత్రం దాకా..

అజ్ఞానంలో బతికిన మీ తాత సైంటిఫిక్ టెంపర్ కోసం ఆరాటపడ్డాడు, సంధికాలంలో బ్రతికిన మీ నాన్న అక్షరాస్యత కోసం, ఆధునిక జీవనశైలి కోసం ఆరాటపడ్డాడు, ఆకాశమే హద్దుగా ముందుకు ఉరకాల్సిన నువ్వు మాత్రం మూఢ విశ్వాసాలతో, చేదు జ్ఞాపకాలతో ముందుకు నడవాలని ఆరాట పడుతున్నావు. ప్రపంచ యుద్ధాలతో చతికిలపడ్డ మీ తాత చూపిన తెగువలో పావలా వంతు కూడా వసుదైక కుటుంబంలో జీవిస్తున్న నువ్వు చూపలేకున్నావు. ఏమీ లేని కాలంలో కూడు గూడు గుడ్డ అన్నాడు మీ తాత, కారుచీకట్లు కమ్ముకున్న వేళ గరీబీ హటావో, జై జవాన్ జై కిసాన్ అంటూ పిలుపిచ్చాడు మీ నాన్న, అన్నీ కుదురుకున్న వేళ నువ్వేం చేస్తున్నావు, మతాన్ని వేలెత్తి చూపిస్తూ, మందిరాల్లోనే పరి పూర్ణతను ఆశిస్తూ, గో ఆర్గ్యం కోసం వెంపర్లడుతూ మన తాతల తండ్రుల పరిణతిని అపహాస్యం చేస్తున్నావు. నాడు మన తాతలు నమ్ముకున్నది ఆధునిక దేవాలయాలను నిర్మించిన నాయకుణ్ణి, మన తండ్రులు జై కొట్టింది రాజీప డకుండా ప్రపంచానికి మన సత్తా చాటిన అపర కాళీని, మరి నువ్వు నమ్ముతున్నదెవరిని అబద్దాలతో, అపవాదులతో నిన్ను నమ్మిస్తున్న మేక వన్నె పులిని కాదంటావా?

జలాశయాలు.. అణ్వాయుధాలు...

మనతో చెప్పడానికి మీ తాతకు బాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జునా సాగర్ డ్యాం లున్నాయి, IIT, IIM లు ఇస్రోలు .. ఉన్నాయి, సస్యశ్యామలమైన లక్షలాది ఎకరాల భూములున్నాయి, గాయాలు మానిపోయి కలిసిపోయిన పంజాబ్, బెంగాల్ ప్రజలున్నారు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రా జ్యాన్ని ఎదిరించిన చరిత్ర ఉన్నది, 500 ముక్కలను ఒక్కటిగా చేసి నిర్మించిన సువిశాల భారతదేశం ఉన్నది. చెప్పుకోడానికి మీ నాన్నకు చీకట్లు తొలగించుకుని వెలుగులు చిందిన లక్షలాది గ్రామాలున్నాయి, పాకిస్తాన్ వెన్ను విరిచి నిలబెట్టిన స్వతంత్ర ఢాకా ఉన్నది, జమీందారులను ఎదిరించి రాజా భరణాలు రద్దు చేసి, లక్షలాది ఎకరాలను నిరుపేదలకు పంచిన తెగింపు ఉన్నది, వెల్లివిరిసిన మతసామరస్యం ఉన్నది, టీకాలతో రోగాలను రూపుమాపిన ఘనత ఉన్నది, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన గుర్తింపు ఉన్నది, అగ్రరాజ్యాలను కాదని అణ్వాయుధాన్ని తయారుచేసిన ఖలేజా ఉన్నది.

జెన్ జీలు ముంగిట్లోకొస్తే ఏం చేస్తావు?

జెన్ జీ లమంటూ చెలరేగుతున్న రేపటి తరానికి చెప్పుకోడానికి నీ దగ్గరేమున్నది. తాతలు తండ్రులు కూడబెట్టిన ఆస్తులు అమ్ముకున్నానని చెప్పుకుంటావా? ఇస్రోకు, IITలకు, IIMలకు రంగులు మార్చినావని చెప్పుకుంటావా? కార్పోరేట్లకు కట్టుబానిసనని కాలరెగురేస్తావా? అమెరికా ఆస్ట్రేలియాలతో కాదు, ఇంకా నేను పాకిస్తాన్ తోనే పోటీపడుతున్నానని గర్వపడతావా? స్వదేశీ నినాదం చతికిలపడింది, చైనా దిగుమతులతో దేశాన్ని ముంచేస్తున్నానని సంబరపడతావా? విశ్వాసంగా పడివుండే బంగ్లా, కుందేలు పిల్ల లాంటి నేపాల్ కూడా బౌ బౌ మంటూ బెదిరిస్తున్నాయని వాపోతావా? హత్యాచారాలను, నిరుపేదల హాహాకారాలను, ఆలయ ఆస్తుల స్వాహాకారాలను మతం పరదాల చాటున దాచిపెడుతున్నానని సిగ్గు పడతావా? నాడు ప్రధానులను సైతం బోనేక్కించిన న్యాయవ్యవస్తను నిర్వీర్యం చేస్తున్నానని కాలరెగురేస్తావా? మొన్న శ్రీలంక నిన్న నేపాల్‌ను ముంచెత్తిన జెన్ జీ లు రేపటిరోజు నీ ముంగిట్లోకి వస్తే ఏం చేస్తావు? తస్మాత్ జాగ్రత్త.

-చందుపట్ల రమణా రెడ్డి

అడ్వకేట్

94404 49392

Next Story