ఓపీఎస్ పునరుద్ధరణకు ఉద్యమం

by Ravi |   (  Updated:2022-09-03 18:41:09  IST  )

ఓపీఎస్ పునరుద్ధరణకు ఉద్యమం
X

దేవకీనందన్, నకర కేసులలో సుప్రీంకోర్టు తన వైఖరి తెలుపుతూ 'విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ భిక్ష కాదని, జీవితకాలం పనిచేసినందుకు పొందే మానవ హక్కు' అని స్పష్టం చేసింది. అనుకోకుండా జరిగే ఘటనలకు, సంభవించే పరిణామాలకు (మరణం-వృద్ధాప్యం) సామాజిక భద్రత కల్పించడమే పెన్షన్ ముఖ్య లక్ష్యం' అని ఫోర్త్ పే కమిషన్ పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 కూడా పౌరులకు సామాజిక భద్రత కల్పించాలని చెబుతోంది. ఆర్టికల్ 14 పౌరుల మధ్య సమానత్వం గురించి వివరిస్తుంది. కానీ, ఈ అన్ని అంశాలను నూతన పెన్షన్ విధానం ఉల్లంఘిస్తున్నది.

న్నో సంవత్సరాలు కష్టపడి, తమ మేధో సంపత్తిని పెట్టుబడిగా పెట్టి సమాజంలో గౌరవప్రద ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, ప్రభుత్వానికీ, సమాజానికి సేవ చేస్తున్నారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు. వారికి వృద్ధాప్యంలో మిగిలేది ఎన్నో సంవత్సరాలు తాము ప్రభుత్వం దగ్గర దాచుకున్న డబ్బులతో నెలనెలా వచ్చే పెన్షన్ మాత్రమే. దీంతోనే వారు తమ విశ్రాంత జీవిత కాలం అంతా గడుపుతాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి శరాఘాతంగా మారింది.

2004 నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి కేంద్రం సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) ప్రవేశపెట్టింది. రాష్ట్రాలలో దీనిని అమలు చేసే నిర్ణయాలను మాత్రం అక్కడి ప్రభుత్వాలకే వదిలేసింది. కేంద్రం ఇచ్చిన వెసులుబాటును కాదనుకొని, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరీ సీపీఎస్‌ను ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో జీఓ నం 653, 654, 655ను 2004 సెప్టెంబర్ 1 న విడుదల చేసి సీపీఎస్ అమలులోకి తెచ్చారు. దీంతో ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న రివిజన్ పెన్షన్ రూల్స్-1980 జీఓ 653 వర్తించకుండా పోయింది. ఉద్యోగులు,ఉపాధ్యాయులు గ్రాట్యుటీ కోల్పోయారు. 654 జీఓ ద్వారా జీపీఎఫ్ రూల్స్ -1935 మరుగునపడి, పాత పింఛను విధానం కోల్పోయారు. 655 జీఓ ద్వారా ఉద్యోగి జీతం నుండి సీపీఎస్ చందా వసూలు చేసుకొనుటకు అధికారం ఇవ్వబడింది.

తెలంగాణలో కూడా

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పెన్షన్ విధానాన్ని జీఓ నం. 28 ద్వారా 23 ఆగస్టు 2014 నాడు అమలు చేయుటకు అంగీకరించింది. సీపీఎస్‌ను చాలా రాష్ట్రాలు అమలు చేసినప్పటీకీ, వామపక్ష ప్రభుత్వాలు గల వెస్ట్ బెంగాల్, త్రిపుర, కేరళ దీనిని ఆమోదించలేదు. తర్వాత త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినాక, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక సీపీఎస్‌ను అమలు చేశారు.

వెస్ట్ బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్ ఈ విధానాన్ని తిరస్కరించింది. నూతన పెన్షన్ విధానం లో ఉద్యోగికి ఎంత పెన్షన్ వస్తుందనే విషయంపైన స్పష్టత లేదు. పీఎఫ్ఆర్‌డీ-ఎ యాక్ట్ 2013 సెక్షన్ 20లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎంత పెన్షన్ వస్తుందనేది మార్కెట్ నిర్ణయిస్తుందని పేర్కొనబడింది. అంటే, ఈ సీపీఎస్ మార్కెట్ శక్తుల కుట్రల నుంచి పుట్టిన ఒక నయా ఉదారవాద విషవృక్షం అని అర్థము అవుతున్నది. ఇది విశ్రాంత ఉద్యోగులు,ఉపాధ్యాయుల పాలిట యమపాశం గా మారింది.

అది వారికిచ్చే భిక్ష కాదు

దేవకీనందన్, నకర కేసులలో సుప్రీంకోర్టు తన వైఖరి తెలుపుతూ 'విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ భిక్ష కాదని, జీవితకాలం పనిచేసినందుకు పొందే మానవ హక్కు' అని స్పష్టం చేసింది. అనుకోకుండా జరిగే ఘటనలకు, సంభవించే పరిణామాలకు (మరణం-వృద్ధాప్యం) సామాజిక భద్రత కల్పించడమే పెన్షన్ ముఖ్య లక్ష్యం' అని ఫోర్త్ పే కమిషన్ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 కూడా పౌరులకు సామాజిక భద్రత కల్పించాలని చెబుతోంది. ఆర్టికల్ 14 పౌరుల మధ్య సమానత్వం గురించి వివరిస్తుంది. ఈ అన్ని అంశాలను నూతన పెన్షన్ విధానం ఉల్లంఘిస్తున్నది. సీపీఎస్‌లో పెన్షన్‌ను మార్కెట్ నిర్ణయిస్తుంది.అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి నెలనెలా పెన్షన్ మారుతూ వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత 'గాలిలో దీపం'గా మార్చుతుంది.

సుమారు 30 ఏండ్లకు పైగా ప్రభుత్వ సేవలో ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? మార్కెట్‌పై ఆధారపడిన నూతన పెన్షన్ వృద్ధ్యాప్యంలో వారికి ఎలా తోడ్పడుతుంది? ఉద్యోగుల వాటా, ప్రభుత్వ వాటా మొత్తం స్టాక్ మార్కెట్‌లో పెడితే, వారి బతుకులకు భద్రత లేకుండా పోదా? వ్యవస్థీకృత రంగంలో, అందులో ప్రభుత్వంలో సేవలందించిన వారి వృధ్యాప్య బతుకులను మార్కెట్ జూదానికి వదిలి పెట్టడం సమంజసమా? ప్రభుత్వాలు తెచ్చిన ఈ విధానం వలన ఉద్యోగ విరమణ చేసిన వారు గౌరవంగా ఎలా బతుకగలరు? ఈ మధ్యనే ఉద్యోగ విరమణ చేసిన వారికి వచ్చే నూతన పెన్షన్ ఆసరా పెన్షన్ కన్నా అధ్వాన్నంగా ఉంది.

ఆయా రాష్ట్రాల స్ఫూర్తితోనే

నూతన పెన్షన్ విధానం వలన రానున్న నష్టాలు తెలుసుకున్న ఉద్యోగులు,ఉపాధ్యాయులు సీపీఎస్‌కి వ్యతిరేకంగా కొత్త సంఘాలు ఏర్పాటు చేశారు. ఉద్యమాన్ని పట్టాలెక్కించారు. ప్రారంభంలో మాట్లాడని పాత సంఘాలు తర్వాత తమ గళాన్ని వినిపించడం ప్రారంభించాయి. అన్ని రాష్ట్రాలలో సంఘాలు ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) పునరుద్ధరణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ పోరాటాల వలననే కోల్పోయిన గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించగలిగారు.

ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలు ఓపీఎస్ అమలుకు కమిటీ వేసి రెండు వారాలలోనే నిర్ణయం తీసుకున్నాయి. బెంగాల్‌లో ఓపీఎస్ కొనసాగిస్తున్నారు. కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఓపీఎస్ పునరుద్ధరణకు కమిటీలు వేశాయి. దీంతో ఉద్యోగులలో ఆశలు చిగురించాయి. కాలయాపన చేయకుండా తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఈ సానుకూల స్థితిని సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి. సీపీఎస్ రద్దు కోసం సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలి.

జుర్రు నారాయణ యాదవ్

టీటీయూ జిల్లా అధ్యక్షుడు,మహబూబ్‌నగర్

94940 19270

Next Story