- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి!
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే యాదవుల(గొల్ల) చారిత్రక సాంస్కృతిక సంపదైన గొల్లగట్టు జాతర నేటి నుండి ఐదు

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే యాదవుల(గొల్ల) చారిత్రక సాంస్కృతిక సంపదైన గొల్లగట్టు జాతర నేటి నుండి ఐదు రోజుల వరకు జరగనుంది. ఇది రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తరువాత జరిగే అతిపెద్ద జాతర.
తెలంగాణలో దైవాలుగ కొలువబడుతున్న బీరప్ప, మల్లన్న, వీరన్న, గొల్లగట్టు లింగన్నలు పశు కాపరులుగా జీవించిన చారిత్రక వీరులు.. ముఖ్యంగా గొల్లగట్టు లింగమంతులను యాదవులే కాక అన్ని శ్రామిక ఉత్పత్తి కులాలు తమ ఇంటి దైవంగా కొలుచుకుంటారు. ఇంతవరకు భారతదేశంలో ఆధిపత్య దోపిడీ వర్గాల చరిత్రే చరిత్రగా లిఖించబడింది. కానీ శ్రామిక ఉత్పత్తి కులాల జీవనాలు చరిత్రకు ఎక్కలేదు. ఇప్పుడు మనం శ్రామికుల జీవనం, ఉత్పత్తి సాధనలు, ఉత్పత్తి విధానాలు, వారి సంస్కృతిని వాటి పరిస్థితులను మన చరిత్రగా రాసుకోవలసిన అవసరం ఉన్నది.
ఇక్కడి స్థల చరిత్ర ప్రకారం
సూర్యాపేట జిల్లా కేంద్రానికి అతి సమీపంలో గొల్ల గట్టు లింగమంతుల స్వామి జాతర మాఘమాసంలో అత్యంత వైభవంగా సాగుతుంది.ఈ జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ‘ఓ లింగ’ అని లింగన్నను తలుచుకుంటూ లక్షలాదిమందిగా తరలివస్తారు. ఇక్కడి స్థల చరిత్ర ప్రకారం లింగన్న మానవాతీత శక్తులు కలిగిన పశు కాపరిగా ఉంటూ ప్రకృతి వైపరీత్యాల నుండి క్రూరమృగాల దాడుల నుండి పశువులని కాపాడే వాడని చెప్తుంటారు. స్థానిక పశు కాపరులు ఉండ్రుగొండ సమీపంలో ఉన్నటువంటి పెద్దగుట్టు మీద పశువులను మేపుతుండేవారు. ఆ సమయంలో పశువులపై దాడికి వచ్చిన కౄర మృగాలను ఎదుర్కుంటు వెళ్లిన లింగన్న మాయమై అక్కడే దైవంగా వెలిశాడని యాదవుల నమ్మకం. అలా మాయమైన లింగన్నను స్థానిక పశు కాపరులు ‘ఓ లింగ’ అని తలుచుకుంటూ పెద్దగుట్ట ఎక్కి జాతరను ప్రారంభించారు. ఉండ్రుగొండ పెద్దగుట్ట ప్రాంతం పెద్ద కోట దుర్గం, దట్టమైన అడవులతో నిండి ఉండటంతో పాటు జాతర సమయంలో ఒక గర్భిణికి జరిగిన ప్రమాదం కారణంగా ప్రస్తుతం దురాజ్‌పల్లి సమీపంలో ఉన్న పాలశెర్లయ్య గుట్టమీదికి జాతర మారినట్టు చెప్పుకుంటారు.
అయిదు రోజులు సంబరాలు..
దురాజ్‌పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న కేసారం గ్రామ యాదవులు అక్కడ హక్కుదారులుగా ఉండి ప్రతి రెండేళ్లకోసారి జాతరను జరిపిస్తుంటారు. జాతరకు రెండు వారాల ముందు దిష్టి పూజ కొరకై తొర్రూరు సమీపాన చీకటాయిపాలెం నుండి గ్రామ బైకాని వారు దేవర పెట్టెను అత్యంత వైభవంగా కేసార గ్రామానికి తరలిస్తారు. దిష్టి పూజ రోజున ఆ గ్రామ యాదవులైన మెంత బోయిన వారి ఇంట్లో పూజలందుకున్న దేవర పెట్టెను ఆటాపాటలతో సాంప్రదాయ భేరీలు, గజ్జెలు,దుస్తువులను ధరించి గుట్ట మీదకు చేరుకుంటారు. దిష్టి పూజ పూర్తి అయిన రెండవ ఆదివారం రోజున ప్రారంభం అయిన జాతర సాంప్రదాయకంగా ఐదు రోజులు కొనసాగుతుంది. జాతర ప్రారంభానికి ముందే సూర్యపేటలోని హక్కుదారులైన యాదవ వంశస్తులు మకర తోరణాన్ని గొల్లగట్టుకు చేరుస్తారు. అదేవిధంగా కాసింపేట యాదవులు పసిడి కుండను జాతరకు ముందే చేర్చి లింగమంతుల స్వామి ఆలయంపై చివరి రోజు వరకు ఉంచుతారు. ఈ ఐదు రోజుల పాటు జాతర యాదవుల సాంప్రదాయ వేషధారణ, భేరీలు, గజ్జెల లాగులు మందగంపల ప్రదర్శన, తడిబట్ట తానాలు, ఒకపొద్దు బోనాలు, కఠార్ల ప్రదర్శన, చంద్ర పట్నం, గండ దీపం, గదాశూలం, జాగిలాల ఆటలతో అంగరంగ వైభవంగ జరుగుతుంది.
యాదవ రాణి ఆగుమంచి త్యాగం
యాదవ మహారాణి ఆగు మంచి పోలురాజు, సిరిదేవిల కూతురు. అన్న కాటమరాజు పిలుపు మేరకు అయితమరాజు యర్రగడ్డపాడు యుద్ధానికి వెళ్తున్న సమయంలో దొనకొండ రాజ్యాన్ని సోదరి ఆగుమంచి చేతిలో పెట్టినట్టు తెలుస్తున్నది.తల్లి సిరిదేవి,వదిన వీర గంగ(కాటమరాజు భార్య) సహాయంతో అగుమంచి దొనకొండ రాజ్యాన్నేలింది. అగుమంచి రాజ్యమేలినట్టుగ గంగదొనకొండలో ఉన్న ఆగు మంచి బావి, ఆగు మంచి పాదాలు, సతీసహగమన ఛాయా చిత్రాలు సజీవ సాక్ష్యాలు. యాదవ రాణి ఆగు మంచి అత్యంత ధైర్యసాహసురాలు, సౌందర్యవతి కూడా. యర్రగడ్డపాడు యుద్ధంలో అన్నలకు విజయం కలగాలని ఆగు మంచి శివ పూజలు చేసింది. యాదవ కాంతల చేత యలమంచలి గంగ బోనాలు చేయించింది, గంగకు పాలు పోస్తుంటె అవి ఎర్రని రక్తంగా మారడం యర్రగడ్డపాడు యుద్ధంలో అన్నలకు ఆపద సూచికగా భావించింది. యుద్ధంలో యాదవ వీరులు, సైన్యాలు ఆగు మంచి భర్త పుత్తమరాజు(కొమరమ్మ కుమారుడు) వీర మరణం పొందారని తెలిసిన తరువాత తమకున్న సిరిసంపదలను రాజ్యంలోని ప్రజలకు పంచిపెట్టింది. తమ వంశ కీర్తిని నలుమూలల చాటడానికి యాదవ ఆశ్రిత కులాలను సృష్టించి చివరకు అగుమంచి యాదవ రాణులతో పాటుగా సతీసహగమనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు లింగన్న ఉత్పత్తి శక్తిగ మరోవైపు పశుకాపరులుగా, రాజ్యపరిపాలకులుగా ఉన్న కాటమరాజు వంశస్తులైన యాదవ వీరులు ఒకే దగ్గర పూజలందుకోవడం ఈ గొల్లగట్టు జాతర ప్రత్యేకం.
ఇంతటి వైవిధ్యం కలిగిన జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నప్పటికి ప్రభుత్వం వసతులపై సరైన దృష్టి పెట్టకుండా తాత్కాలిక ఏర్పాట్లకు పరిమితమవుతుంది. రాష్ట్రంలో రెండవ పెద్ద జాతర అయిన గొల్లగట్టుకు ప్రభుత్వం కేవలం ఐదు కోట్లు కేటాయించడం యాదవులను విస్మరించడమే. వెంటనే ప్రభుత్వం జాతరకు అధిక నిధులు కేటాయించి, శాశ్వత వసతులు కల్పించాలి.
మధు యాదవ్ నూకల
ఉస్మానియా యూనివర్సిటీ
63033 43359






